Sitaphal in Pregnancy: ప్రెగ్నెన్సీలో సీతాఫలం తినొచ్చా? ఎన్ని సమస్యలకు ఔషధమో తెలుసా?
Sitaphal in Pregnancy: గర్భధారణ సమయంలో సీతాఫలం తినొచ్చా లేదా అనే సందేహం ఉందా? అయితే ప్రెగ్నెన్సీలో ఈ పండు తింటే మంచిదా కాదా అనే వివరాలు, ఈ పండులో ఉండే పోషకాల గురించి పూర్తిగా తెల్సుకోండి.
గర్భధారణ సమయం మహిళ జీవితంలో అతి ముఖ్యమైంది. ఈ సమయంలో ఎలాంటి ఆహారాలు తినొచ్చు, ఏవి తింటే ఏమవుతుందో అని రకరకాల ప్రశ్నలుంటాయి. ఇప్పుడు సీతాఫలం సీజన్ వచ్చేసినట్లే. ఈ పండ్లు కూడా గర్భధారణ సమయంలో తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం సీతాఫలం తప్పకుండా తినొచ్చు. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు, తల్లికీ ఎలాంటి లాభాలుంటాయో చూడండి.
సీతాఫలం పోషకాలు:
క్రీమీగా, తియ్యగా, రుచిగా ఉండే సీతాఫలానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. దీంట్లో పోషకాలు ప్రెగ్నెన్సీలో చాలా ఉపయోగకరం. ఈ పండులో ఉండే ఫోలేట్ పిండం ఎందుకుదలకు, ఎలాంటి లోపాలు రాకుండా చూస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ సి చర్మం ఆరోగ్యాన్ని పెంచుతుంది. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యం కాపాడుతుంది. పీచు ఎక్కువగా ఉండే పండు కాబట్టి ఇది మలబద్దకం లాంటి సమస్యల్నీ తగ్గిస్తుంది. పొటాషియం రక్త పోటును నియంత్రిస్తే.. మెగ్నీషియం కండరాల పనితీరుకు సాయపడతాయి.
ప్నెగ్నెన్సీలో సీతాఫలం లాభాలు:
వాంతులు తగ్గించడం:
ప్రెగ్నెన్సీ మహిళల్లో ఉదయాన్నే వాంతులు, వికారం లాంటి సమస్యలుంటాయి. మార్నింగ్ సిక్ నెస్ అంటారు దీన్ని. దీన్ని తగ్గించడానికి సీతాఫలం సాయం చేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ బి6 ఈ సమస్య తగ్గించడంలో సాయపడుతుంది.
జీర్ణ శక్తి:
ప్రెగ్నెన్సీలో చాలా మంది మహిళల్లో మలబద్దకం సమస్య వస్తుంది. హార్మోన్లలో, శరీరంలో వచ్చే మార్పులు దీనికి కారణం. సీతాఫలంలో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచి మల బద్దకం సమస్య పూర్తిగా తగ్గిస్తుంది. ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.
పిండం ఎదుగుదల:
పిండం ఎదుగుదలకు సీతాఫలంలో ఉండే పోషకాలన్నీ సాయం చేస్తాయి. దీంట్లో ఉండే ఫోలేట్ పిండం ఎదుగుదలలో ఎలాంటి లోపం రాకుండా కాపాడుతుంది. అలాగే క్యాల్షియం, మెగ్నీషియం దృఢమైన ఎముకలకు సాయం చేస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిండాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజీ నుంచి కాపాడతాయి.
హైడ్రేషన్:
ప్రెగ్నెన్సీలో హైడ్రేషన్ చాలా కీలకం. సరైన నీటి శాతం వల్ల రక్తం స్థాయులు పెరగడానికి, ఉమ్మనీరు పెరగడానికి సాయం చేస్తుంది. సీతాఫలం శరీరానికి కావాల్సిన హైడ్రేష్ అందిస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
సీతాఫలం వల్ల అనేక లాభాలున్నా సరే దీన్ని మితంగానే తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే దీంట్లో ఉండే అధిక పీచు శాతం జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. దాంతో డయేరియా లాంటి సమస్యలు రావచ్చు. దీనివల్ల ఎలర్జీలు రావడం అరుదే. అయినా సరే తిన్న వెంటనే దద్దుర్లు, వాపు లాంటివి కనిపిస్తే వైద్యుల్ని సంప్రదించండి.