fenugreek for dandruff: మెంతులను ఇలా వాడి చూడండి.. చుండ్రు తగ్గుతుంది
fenugreek for dandruff: చుండ్రు తగ్గడానికి మెంతులను ఎన్ని రకాలుగా వాడొచ్చో చూడండి.
ఎన్నిసార్లు తలస్నానం చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చుండ్రు సమస్య తగ్గట్లేదా. చుండ్రు సమస్య కోసం ఒకసారి మెంతులను ప్రయత్నించండి. మెంతులకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. దీంట్లో ప్రొటీన్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు నల్లగా ఉండేలా, ఒత్తుగా, పొడవుగా అయ్యేలా చేస్తాయి.
మెంతులను జుట్టుకు ఎలా రాసుకుంటే చుండ్రు సులభంగా తగ్గుతుందో చూడండి.
1.నానబెట్టిన మెంతులతో..
మూడు స్పూన్ల మెంతులను ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మిక్సీ పట్టి సన్నని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని మాడుకు, జుట్టుకు పట్టించి అరగంట సేపు వదిలేయాలి. గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే చాలు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు నానబెట్టిన మెంతులను జుట్టుకు పట్టిస్తే తొందరగా ఫలితం ఉంటుంది. చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు కూడా పెరుగుతుంది .
2. నిమ్మకాయ+ మెంతులు
రెండు చెంచాల మెంతులు రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో అరచెక్క నిమ్మరసం పిండి తలకు రాసుకోవాలి. అరగంటయ్యాక కడిగేసుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి రాసుకోవచ్చు. నిమ్మరసం వల్ల మాడు జిడ్డుగా అవ్వదు. జుట్టు మెరిసేలా చేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. చుండ్రు తగ్గుతుంది. ఇది రాసుకున్నపుడు నేరుగా ఎండలో కూర్చోకండి. నిమ్మరసం వల్ల మంట రావచ్చు.
3. పెరుగు+ మెంతులు
రాత్రంతా నానబెట్టిన మెంతులను ముద్దగా పట్టుకుని, దాంట్లో పెరుగు కలుపుకుని చిక్కటి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని తలకు రాసుకుని అరగంటయ్యాక తలస్నానం చేయాలి. దీన్ని వారానికి రెండు సార్లు రాసుకోవచ్చు. పెరుగు జుట్టు మృదువుగా అయ్యేలా చేస్తుంది. మెంతుల వల్ల మాడు శుభ్రపడుతుంది. పెరుగు మెంతులు కలిపి రాసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, షైనీ గా తయారవుతుంది.
4. మెంతులు + కొబ్బరి నూనె
మిగతా ప్యాకుల్లాగే మెంతుల ముద్దను రెడీ చేసుకోవాలి. దాంట్లో రెండు చెంచాల కొబ్బరినూనె కలిపి తలకు పట్టించాలి. వారానికి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని రాసుకోవచ్చు. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. మాడును తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఇది సాయపడుతుంది. మెంతులతో కలిపి వాడటం వల్ల ప్రయోజనాలు ఎక్కువుంటాయి.
5. మెంతులు + ఉసిరి పొడి
నానబెట్టి మిక్సీపట్టుకున్న మెంతుల ముద్దలో రెండు స్పూన్ల ఉసిరి పొడి, నాలుగు చెంచాల నిమ్మరసం కలపాలి. ఇరవై నిమిషాలాగా కడిగేసుకోవాలి. వారానికి ఒకసారి రాసుకోవచ్చు. ఉసిరి లో విటమిన్ సి ఉంటుంది. ఇది మాడు ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు ఒత్తుగా అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మాడు దురద కూడా తగ్గుతుంది.