Plastic Chutney Recipe । ఈ ప్లాస్టిక్ చట్నీ ఒకసారి తిని చూడండి.. టేస్ట్ అదిరిపోతుందంటే నమ్మండి!
Plastic Chutney Recipe: ఎప్పుడూ కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీలేనా ఇవి కాకుండా కొత్తగా ప్లాస్టిక్ చట్నీ తిని చూడండి.. అదిరిపోతుంది.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, మధ్యాహ్నం లంచ్‌లో అయినా మీరు తినే భోజనానికి కొంచెం రుచిని తగిలించాలంటే చట్నీ ఉండాలి. చట్నీలు, పచ్చళ్లలో మీకు ఎన్నో ఇష్టమైనవి ఉండొచ్చు, కానీ ఇక్కడ మీకు చెప్పబోయే చట్నీ వెరైటీ ఎంతో ప్రత్యేకమైనది. దీనిని ప్లాస్టిక్ చట్నీ అంటారు. కంగారు పడకండి, ఇది మీరు అనుమానిస్తున్నట్లుగా ప్లాస్టిక్ పేపర్లు లేదా ప్లాస్టిక్ వస్తువులను రొట్లో నూరి చేసే పచ్చడి మాత్రం కాదు. ఇది పూర్తిగా శాకాహారం, బెంగాలీలు ఎక్కువ తింటారు.
ఇక, అసలు విషయానికి వస్తే ఈ ప్లాస్టిక్ చట్నీని లేత బొప్పాయి తురుముతో తయారు చేస్తారు. ఇది తయారైన తర్వాత చట్నీ లాగా కాకుండా హల్వా లాగా పారదర్శకంగా ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పచ్చి బొప్పాయి చట్నీ అలియాస్ ప్లాస్టిక్ చట్నీ దాని రంగు, రుచి, రూపానికి ప్రసిద్ధి చెందినది. దీనిని ఎక్కువ పెళ్లిళ్లు, పెరంటాలు విందు భోజనాలలో వడ్డిస్తారు. ఈ చట్నీ కొంచెం తీపిగా, పుల్లగా రెండింటి కలయికలో ఉంటుంది. మరి మీరు కూడా ఈ ప్లాస్టిక్ చట్నీని రుచి చూడాలనుకుంటే ఇక్కడ ప్లాస్టిక్ చట్నీ రెసిపీని అందించాం. కావలసిన పదార్థాలు, తయారీ విధానం కోసం ఇచ్చిన సూచనలు చూసి మీరు కూడా ఈ ప్లాస్టిక్ చట్నీని సులభంగా తయారు చేసుకోవచ్చు.
Plastic Chutney Recipe కోసం కావలసిన పదార్థాలు
- 1/2 లేత పచ్చి బొప్పాయి
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1 కప్పు చక్కెర
- 1/4 స్పూన్ ఉప్పు
- 1/2 టీస్పూన్ కలోంజీ విత్తనాలు
- 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు
- 2 టేబుల్ స్పూన్లు ఎండుద్రాక్ష
- 1/2 నిమ్మకాయ
- 1 కప్పు నీరు
ప్లాస్టిక్ చట్నీ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా లేత పచ్చి బొప్పాయిని శుభ్రంగా కడిగి, దాని తొక్క తీయండి, ఆపై అందులోని విత్తనాలను తీసివేయండి.
- ఇప్పుడు బొపాయిని కీరదోస లాగా వీలైన సన్నని ముక్కలుగా కోయండి. ఆపై ఈ ముక్కలను కొద్దిసేపు నీటిలో నానబెట్టండి.
- ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి, ముక్కలు చేసిన బొప్పాయిని ఒక నిమిషం పాటు వేయించాలి.
- ఆపై ఒక కప్పు నీరు పోసి, మూతపెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టండి.
- ఉడకబెట్టిన తర్వాత 1 కప్పు చక్కెర వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఉప్పు, కలోంజీ విత్తనాలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి బాగా కలపాలి, మళ్లీ మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.
- ఈ దిశలో నిమ్మరసం పిండుకొని, మూత తీసి 15 నిమిషాలు ఉడికించాలి.
- అనంతరం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గిన్నెలోకి తీసుకోవాలి, అంతే ప్లాస్టిక్ చట్నీ రెడీ.
దీనిని అన్నంలో, ఇడ్లీలకు, దోశలకు మీకు నచ్చిన ఆహారంలో కలుపుకొని తినవచ్చు.
సంబంధిత కథనం