Types of sprouts: ఎప్పుడూ పెసర్లు, శనగలే కాదు..ఒకసారి వీటితో మొలకలు ట్రై చేయండి
Types of sprouts: వివిధ రకాల మొలకెత్తిన గింజలు, వాటి లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి.
ఉదయాన్నే మొలకెత్తిన గింజలు తింటే శరీరానికి బోలెడు లాభాలు. అయితే రోజూ ఒకేరకమైన మొలకలు కాకుండా విభిన్నంగా ప్రయత్నించొచ్చు. ఇంతకీ మనకు తెలిసిన పెసర్ల మొలకలే కాకుండా ఇంకా ఏ మొలకలు తింటే ఆరోగ్యానికి మేలో చూద్దాం.
రాజ్మాతో:
రాజ్మా గింజల మొలకలు కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలో తక్కువ కేలరీలు. ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కాస్త కొవ్వు శాతంతో పాటూ, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఐరన్, ఫోలేట్, విటిమన్ సి ఉండటం వల్ల ఇవి చాలా ఆరోగ్యకరం. మొలకెత్తిన రాజ్మా గింజల్లో మెలటోనిన్ ఉంటుంది. ఇది సరైన నిద్రకు అవసరం. దాంతో పాటే ఫ్రా రాడికల్స్ తో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. టైప్ 2 డయాబెటిస్ నుంచి కూడా రక్షిస్తాయి. అయితే మొలకెత్తిన రాజ్మా కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి.. వీటిని ఉడికించుకుని వంటల్లో లేదా సలాడ్ చేసుకుని తినొచ్చు.
బఠానీ తో:
బఠానీలో మామూలుగానే కాస్త తీపి. వాటిని మొలకెత్తించి తినడం వల్ల మంచి రుచి వస్తుంది. వీటిలో పచ్చ, తెలుపు అని రెండు రకాలుంటియి. కాకపోతే వీటిలో కేలరీలు ఎక్కువ. కానీ కొవ్వు శాతం తక్కువే. మామూలు బఠానీల్లో కన్నా మొలకెత్తిన బఠానీలో విటమిన్ బి9 లేదా ఫోలేట్ రెట్టింపు ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లకు బదులు వీటిని తీసుకోవచ్చు కూడా.
శనగలతో:
మిగతా వాటితో పోలిస్తే ఇవి తొందరగా మొలకెత్తేస్తాయి. వీటిలో ప్రొటీన్, పోషకాలు ఎక్కువ. శనగల్లో ఉండే ఐసోఫ్లేవోన్ అవి మొలకెత్తాక రెట్టింపు అవుతుంది. ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ లక్షణాలు కలిగి ఉంటుంది. మహిళల్లో వయసుతో పాటూ తగ్గే ఈ హార్మోన్ స్థాయుల్ని ఇది పెంచుతుంది. వీటిని ఉడికించి తీసుకోవచ్చు. కానీ పచ్చిగా తింటేనే లాభాలెక్కువ.
సోయాబీన్:
కొరియన్ వంటకాల్లో సోయాబీన్ మొలకలు ఎక్కువగా వాడతారు. ఇది పోషకాలతో పాటే, రుచిలో కూడా బాగుంటాయి. వీటిలో కేలరీలు తక్కువ. ప్రొటీన్ ఎక్కువ. అనీమియా సమస్య తగ్గిస్తాయి. శరీరంలో ఐరన్ శోశించుకోడానికి సాయపడతాయి. వీటిని పచ్చిగానే తినేయొచ్చు. లేదా సలాడ్లు, సూప్స్ లో వేసుకోవచ్చు.
గోదుమ గడ్డి:
దీన్ని మొలకల జాబితాలోకి చేర్చలేం కానీ.. గోదుమల్ని మొలకెత్తించే ఈ గోదుమ గడ్డిని పెంచుతారు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. దీన్ని ఎక్కువగా జ్యూస్ చేసుకునే తాగుతారు. థైరాయిడ్ స్థాయుల్ని నియంత్రించడంలో ఇది చాలా మేలు చేస్తుంది. దీంట్లో యాంటి ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఒకే రకమైన గింజలు కాకుండా వీటిలో రకరకాలు కాంబినేషన్లు ప్రయత్నించొచ్చు. ఏవైనా రెండింటిని కలిపి తినొచ్చు. సలాడ్ చేసుకోవచ్చు. పచ్చిగా తినొచ్చే. కూరల్లో వాడొచ్చు. మీ రుచికి తగ్గట్లుగా తప్పకుండా మొలకల్ని మీ ఆహారంలో చేర్చుకోండి.
టాపిక్