Hair Care Tips : ఏం చేసినా జుట్టు రాలడం ఆగడం లేదా? అయితే ఇది కచ్చితంగా ట్రై చేయాల్సిందే
Hair Care Tips : ఈ మధ్యకాలంలో జుట్టు సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగించి ఇంకా సమస్యలు పెంచుకుంటున్నారు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి సమస్యల నుంచి బయటపడొచ్చు.
ఈరోజుల్లో జుట్టు సమస్య లేని వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్. చుండ్రు, జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, ఒత్తుగా పెరగపోవడం, గుత్తులు గుత్తులుగా ఊడిపోవడం, పలచుగా ఉండి బట్టతల రావడం, ఇవన్నీ నేటి యువత ఎదుర్కొంటున్న జుట్టు సమస్యలు. వీటి నుంచి బయటపడటానికి ఖరీదైన షాంపూలు, అవసరానికి మించి ఆయిల్స్ వాడేస్తుంటారు.
పెద్ద పెద్ద సమస్యలకు కూడా ఒక్కోసారి పరిష్కారం చాలా చిన్నగా ఉంటుంది.. అలాగే ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదాన్ని మించిన ఔషధం లేదు. ఆయుర్వేదంలో జామ ఆకులకు మంచి ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనం జామ ఆకులతో జుట్టు సమస్యను ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం.
జామాకులల్లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మన జుట్టు ఆరోగ్యానికి కూడా జామాకులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో దోహదపడుతుంది. అలాగే వీటిలో లైకోపిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఎండ నుండి జుట్టును కాపాడడంలో మనకు దోహదపడుతుంది.
జామాకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
జామాకుల కషాయాన్ని వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. నీటిలో శుభ్రంగా కడిగిన 5 నుంచి 7 జామాకులను వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని చల్లారే వరకు అలాగే ఉంచి ఆ తరువాత వడకట్టాలి. తరువాత ఈ కషాయాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేసుకోండి. ఒక గంట తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఇలా జామ ఆకులను తరచుగా వాడటం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కాసులతో పని లేకుండా కావాల్సిన పరిష్కారం వస్తుందంటే.. ఇంకే కావాలి చెప్పండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ జుట్టు ఎదుగుదలను ఇంకెవరూ ఆపలేరు.