Fish Fry: చేపకు చేప ఇలా ఫ్రై చేసేస్తే రుచి అదిరిపోతుంది, ఈ గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెసిపీ తెలుసుకోండి
Fish Fry: చేప మొత్తాన్ని ఫ్రై చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మేమిక్కడ గ్రీన్ మసాలాతో ఫిష్ ఫ్రై రెసిపీ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించండి.
చేప వేపుడు పేరు చెబితే నోరూరిపోతుంది. ఇక చేప మొత్తం ఫ్రై చేసి పుదీనా, కొత్తిమీర తరుగు పేస్టును దట్టించి చేసే ఈ చేప వేపుడు ఇంకా రుచికరంగా ఉంటుంది. దీని పేరు గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై. దీన్ని చేయడం చాలా సులువు. మీడియం సైజులో ఉండే చేపను తెచ్చుకుని ఈ గ్రీన్ మసాలాతో ఫ్రై చేస్తుంటే రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. మీకు నచ్చడం ఖాయం.
గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చేపలు - రెండు
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - అరకప్పు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - ఏడు
పసుపు - అర స్పూన్
జీలకర్ర - అరస్పూను
లవంగాలు - నాలుగు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - ఒక స్పూను
పచ్చిమిర్చి - ఏడు
గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెసిపీ
1. ముందుగా గ్రీన్ మసాలాను రెడీ చేసుకోవాలి.
2. ఇందుకోసం మీరు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు వేసి రుబ్బుకోవాలి.
3. ఆ రుబ్బు లోనే నిమ్మరసం, జీలకర్ర, పసుపు పొడి కూడా వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.
4. తగినంత నీరు చేర్చుకోవచ్చు. అంతే గ్రీన్ మసాలా ముద్ద రెడీ అయినట్టే.
5. మీడియం సైజులో ఉండే రెండు చేపలను తీసుకొని శుభ్రంగా పైన పొట్టు తీసి కడుక్కోవాలి.
6.పైన గాట్లను పెట్టుకోవాలి. ఈ గ్రీన్ మసాలా ముద్దను చేప మొత్తానికి పట్టించాలి.
7. గాట్లు లోపలికి వీటిని ఇంకిపోయేలా చేయాలి.
8. దీన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయాలి.
9. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
10. ఆ నూనె వేడెక్కాక ఈ చేపలను ఆ నూనెలో వేసి చిన్న మంట మీద వేయించాలి.
11. రెండు వైపులా వేగే వరకు ఆ చేపలను అలా వేయించాలి.
12. కనీసం పావుగంట నుంచి 20 నిమిషాల పాటు నూనెలో వేయిస్తే చేప బాగా ఫ్రై అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెడీ అయినట్టే.
ఈ గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెసిపీ చాలా సులువుగా చేసేయొచ్చు. పైగా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో గ్రీన్ కలర్ కోసం మనం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను వాడాము. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గ్రీన్ మసాలాతో చికెన్ ఫ్రై ని కూడా చేసుకోవచ్చు. అలాగే రొయ్యల ఫ్రై చేసినా కూడా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ గ్రీన్ మసాలా రెసిపీలను ప్రయత్నించండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.