Friday motivation: సోమరితనమే మీ మొదటి శత్రువు, దాన్ని వదిలించుకునే పద్ధతులు ఇవిగో-friday motivational story about laziness and how to overcome it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: సోమరితనమే మీ మొదటి శత్రువు, దాన్ని వదిలించుకునే పద్ధతులు ఇవిగో

Friday motivation: సోమరితనమే మీ మొదటి శత్రువు, దాన్ని వదిలించుకునే పద్ధతులు ఇవిగో

Koutik Pranaya Sree HT Telugu
Aug 23, 2024 05:00 AM IST

Friday motivation: బద్ధకాన్ని మించిన శత్రువు లేదు. మన శరీరం మనకోసం తయారు చేసిన స్వీయ శత్రువది. దాన్ని జయించామంటే సగం పనులైపోతాయి. ఈ సోమరితనం నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలున్నాయి. చూసి ఫాలో అవ్వండి.

బద్దకం నుంచి బయటపడే మార్గాలు
బద్దకం నుంచి బయటపడే మార్గాలు (freepik)

కష్టపడాలన్నా ఈ క్షణమే. ఆనందించాలన్నా ఈ క్షణమే. గడిచిన నిన్న నీది కాదు. రానున్న రేపు నీ చేతుల్లో లేదు. కాబట్టి ప్రతిక్షణం ఉత్సాహంగా సోమరితనం లేకుండా గడపాలి. ఎదుగుదలను ఆపే లక్షణాల్లో సోమరితనం అతి పెద్దది. దాన్నుంచి బయటపడే మార్గాలేంటో చూడండి.

ఎరుపు రంగు బట్టలు

ఎరుపు రంగుకు ప్రత్యేక శక్తి ఉంది. మీకు బద్దకంగా, ఏ పని చేయకుండా సోమరిగా ఇంట్లో ఉండాలి అనిపించినప్పుడు ఎరుపు రంగు బట్టలు వేసుకోండి. తక్షణమే మీకు కొత్తగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. మీ మూడ్ మారిపోతుంది. ఈ రంగు మీలో కొత్త శక్తిని నింపుతుంది. మీరేమైనా సాధించగలరనే సానుకూల ఆలోచనలు కలిగిస్తుంది. మీరెప్పుడూ బద్దకంగా గడిపే మనుషులైతే ఇంట్లో కూడా ఎరుపు రంగు అక్కడక్కడా అయినా వేసుకుంటే బద్దకం దూరం అవుతుంది.

ఆ పనులే చేయాలి

కొన్ని పనులు చేయాలంటే మీకు బద్దకం పెరిగిపోతుంది. ఉదాహరణకు పుస్తకం చదవాలన్నా చదవలేకపోతే ముందు మనసులో చదవాలనే నియమం పెట్టేసుకోండి. ఏ పని కోసమో, షాపింగో వెళ్లలేక మిమ్మల్ని ఆపుతుందేదో గమనించి ముందొక సారి బయటకు వెళ్లిరండి. మళ్లీ చేస్తానులే అని వాయిదా వేసుకోకుండా తక్షణమే ఆ పని చేసేసి మళ్లీ రిలాక్స్ అవుతాననుకోండి. ఇలా ఒక్కో పని చేసుకుంటూ పోయారంటే బద్దకమే రాదిక. 

శారీరక శ్రమ

నిద్రపోడానికీ, లేవడానికి ఒక సమయం పెట్టుకోండి. కనీసం వారం దాన్ని పక్కాగా ఫాలో అయ్యారంటే క్రమంగా అలవాటు పడిపోతారు. పదికి పండుకోవడం, సూర్యోదయం కన్నా ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోండి. లేవగానే వాకింగ్ వెళ్లడమో, జిమ్ వెళ్లడమో మొదలుపెట్టండి. ఏకాగ్రత పెంచే వ్యాయామాలు, ప్రాణాయామాలు, ధ్యానం చేయండి. వీటికోసం రోజులో ఓ పది నిమిషాలు కేటాయించినా చాలు. చాలా మార్పొస్తుంది. మీలో పని మీద ఉత్సాహం పెరుగుతుంది

మీకు మీరే బహుమతి

చిన్న పిల్లలు ఒక పని చేస్తే, మంచి ర్యాంకు తెచ్చుకుంటే ఏదైనా కొనిస్తామని చెప్తాం కదా. మనమూ అలాగే మనకోసం చేసుకోవాలి. మీరనుకున్న పని ఏం చేసినా ఒక బహుమతి ఇచ్చుకోండి. అదేమైనా మీకు నచ్చేది ఉండాలి. అలా మీ బహుమతి మీరు తీసుకున్న ప్రతిసారీ మీలో పనులు పూర్తి చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఇదే మీరు ఫాలో అవ్వాల్సిన ధోరణి. అంతేకానీ ఆ పని చేయలేదని మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం, తిట్టుకోవడం వల్ల ఏమీ జరగదు. సానుకూల ధోరణితో మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇంకేమైనా సాధించేస్తారు చూడండి.

 

 

Whats_app_banner