మతిమరుపు పెరుగుతుందా? అల్జీమర్స్‌కి కావొచ్చు! మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి-foods that help you fight the risk of alzheimers disease ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మతిమరుపు పెరుగుతుందా? అల్జీమర్స్‌కి కావొచ్చు! మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి

మతిమరుపు పెరుగుతుందా? అల్జీమర్స్‌కి కావొచ్చు! మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి

Manda Vikas HT Telugu
Feb 28, 2022 02:34 PM IST

అల్జీమర్స్ వ్యాధి అనేది నాడీవ్యవస్థకు సంబంధించిన రుగ్మత. దీని వలన మెదడు కుంచించుకుపోవడం, మెదడు కణాలు నిర్జీవమవడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచన, స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని మనిషి కోల్పోతాడు. ఈ అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా మొదటి దశలో కొద్దిపాటి మతిమరుపుతో మొదలవుతుంది, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ వ్యాధి మరింత ముదిరి గందరగోళ పరిస్థితులను సృష్టిస్తుంది.

<p>Alzheimer’s disease</p>
Alzheimer’s disease (Unsplash)

అల్జీమర్స్ అనేది నాడీవ్యవస్థకు సంబంధించిన రుగ్మత. దీని వలన మెదడు కుంచించుకుపోవడం, మెదడు కణాలు చనిపోవడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచనా శక్తి, స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని మనిషి కోల్పోతాడు. క్రమేణా ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటూ నాటకీయ మానసిక స్థితికి లోనవుతాడు. మొత్తంగా చిత్తవైకల్యానికి గురవుతాడు. ఈ అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా మొదటి దశలో కొద్దిపాటి మతిమరుపుతో మొదలవుతుంది, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ వ్యాధి మరింత ముదిరి గందరగోళ పరిస్థితులను సృష్టిస్తుంది. అయితే ప్రాథమిక దశలో సరైన ఆహారం తీసుకోవడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు లేదా ప్రభావాన్ని సుమారు 40 శాతం వరకు తగ్గించవచ్చని పలు వైద్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

అల్జీమర్స్ వ్యాధిని కంట్రోల్ చేసే ఆహారాలు:

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం ద్వారా మెదడు క్షీణతను తగ్గించవచ్చు. ఇందుకోసం ఆహారంలో తృణధాన్యాలు, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, నట్స్, బీన్స్, పౌల్ట్రీ, సీఫుడ్ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ తో వంటలు వండుకోవాలి. బాగా శుద్ధి చేసిన లేదా పాలిషిడ్ ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: 

సాధారణంగా మెదడు అభివృద్ధికి అధిక స్థాయిలో DHA అవసరం కాబట్టి, కొవ్వు చేపలను కలిగి ఉండాలని సిఫార్సు చేశారు. అదనంగా, వాల్‌నట్స్, అవిసె గింజలు, ఆలివ్ నూనెతో సహా అన్ని రకాల ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు-మెదడులో ప్రోటీన్ నిర్మాణానికి దోహదపడతాయి.

విటమిన్ సి, ఈ అధికంగా ఉండే ఆహారాలు: 

మెదడు పనిచేస్తున్న కొద్ది రసాయనిక ప్రతిచర్యలు జరిగి తద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్, కణాలను దెబ్బతీసే అస్థిర అణువులు మానసిక క్షీణతను వేగవంతం చేస్తాయి. కాబట్టి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న ఆహారాలు తీసుకుంటే అవి ఈ ఫ్రీ రాడికల్స్‌ను తటస్థం చేయడానికి సహాయపడతాయి. విటమిన్ సి (నారింజ, బ్రోకలీ, స్ట్రాబెర్రీ వంటివి), విటమిన్ ఈ (ఆలివ్ ఆయిల్ మరియు బాదం వంటివి) పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఫ్లేవనాయిడ్స్: 

నీటి శాతం పుష్కలంగా ఉండే ఫ్లేవనాయిడ్స్ యాపిల్స్, బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, గ్రేప్‌ఫ్రూట్‌లు, పానీయాలు తదితర వాటిల్లో ఉంటాయి. అలాగే మొలకలు, క్యాబేజీ, వెల్లుల్లి, కిడ్నీ బీన్స్, ఉల్లిపాయలు, బఠానీలు, పాలకూర లాంటి ఆహారాల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి.

ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు: 

విటమిన్-బి లోపం వల్ల, ముఖ్యంగా ఫోలేట్ లోపం పనులపై ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తుంది. ఈ అమైనో ఆమ్లం లోపంతో మెదడు పనితీరు దెబ్బతిని అది అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బు ప్రమాదాన్ని సైతం తీవ్రంగా పెంచుతుంది. ముదురు ఆకుకూరలు, ఎండిన బీన్స్ వంటి కూరగాయలు తీసుకోవడం ద్వారా ఫోలేట్ లోపాన్ని అధిగమించవచ్చు.

పసుపు: 

పసుపులో ఉండే కర్కుమిన్ అనే పోషకం యాంగ్జైటీని తగ్గిస్తుంది, తద్వారా అది మెదడుకు ఉపశమనాన్ని కలిగించి దాని పనితీరు మెరుగుదలతో సంబంధం కలిగి ఉందని కొన్ని అధ్యయనాల్లో నిరూపితమైంది.

బెర్రీ ఫ్రూట్స్: 

బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్‌బెర్రీస్ మరియు స్ట్రాబెర్రీలు పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మెదడు పనితీరును ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుతూ ఎన్నో ప్రయోజనాలు కలుగజేస్తాయి.

సీడ్స్, నట్స్: 

పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు మరియు గుమ్మడికాయ గింజలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఈ, జింక్, ఒమేగా -3, కోలిన్ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి ఆలోచన తీరును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఈ విత్తనాలను స్వయంగా తినండి, సలాడ్‌లపై లేదా పుడ్డింగ్, మఫిన్‌ల వంటి డెజర్ట్‌లలోకి చల్లుకొని తినండి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా తగినంత ప్రయోజనాలను పొందండి.

ప్రాథమిక దశలలో అల్జీమర్స్‌ని గుర్తించడం ఎలా? ఈ వ్యాధి ప్రారంభదశ సంకేతాలు ఇలా ఉంటాయి:

• రోజువారీ జీవితానికి అంతరాయం కలిగించే జ్ఞాపకశక్తి కోల్పోవడం, మతిమరుపు.

• సమస్యలను అర్థం చేసుకోవడంలో లేదా పరిష్కరించడంలో సవాళ్లు

• తెలిసిన పనులను సైతం పూర్తి చేయడంలో ఇబ్బంది

• సమయం లేదా ప్రదేశం గుర్తించడంలో గందరగోళం

• చిత్రాలను అర్థం చేసుకోవడంలో సమస్య

• మాట్లాడటం లేదా వ్రాయడంలో సమస్యలు

• పదేపదే చేసిన తప్పులనే చేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం

• సొంత పనులు, ఇతర కార్యకలాపాలను చేసుకోవటానికి బద్ధకించడం.

• మానసిక స్థితి, వ్యక్తిత్వంలో మార్పులు లాంటి సంకేతాలు ఉంటాయి. 

మీ జ్ఞాపకశక్తి లేదా ఆలోచనా విధానం గురించి మీరు ఆందోళన చెందుతుంటే. పైన చెప్పిన లక్షణాలకు మీకు సంబంధించినట్లుగా అనిపిస్తే, వెంటనే మీకు మీరుగా మీకేదో అయిపోయిందని ఒక నిర్ధారణకు రాకుండా, సమస్యను క్షుణ్ణంగా అంచనా వేయడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం