Foods in Ayodhya: అయోధ్య నగరానికి వెళుతున్నారా? అక్కడ మీరు తప్పకుండా రుచి చూడాల్సిన ఆహారాలు ఇవే
Foods in Ayodhya: చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది అయోధ్య. అక్కడ ఎన్నో చిరు తిళ్లు టేస్టీగా ఉంటాయి.
Foods in Ayodhya: శ్రీరాముడి జన్మస్థానమైన అయోధ్య అందంగా ముస్తాబుతోంది. అక్కడ రామ మందిరం ప్రారంభోత్సవం, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఉండటంతో అయోధ్య వార్తల్లో నిలుస్తోంది. ఎంతో మంది రామ మందిర ప్రారంభానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దేశ విదేశాల నుంచి ఆలయానికి విరాళాలు, విశిష్టమైన కానుకలు వస్తూనే ఉన్నాయి. రామ మందిర ప్రారంభానికి మీరూ వెళుతుంటే అయోధ్యలో దొరికే కొన్ని రుచికరమైన ఆహారాలను తప్పకుండా రుచి చూసి రండి.
పేడా
పేడా అంటే కోవా అనే చెప్పాలి. వారణాసిలోని లాల్ పేడా, మధుర పేడా ఎంత రుచిగా ఉంటాయో అయోధ్యలో దొరికే ఖోయాతో చేసే పేడా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది చక్కెర పూతతో వస్తుంది. దీన్ని అయోధ్య దేవాలయాల్లో ప్రసాదంగా ఇస్తారు. దీన్ని కచ్చితంగా రుచి చూడాల్సిన అవసరం ఉంది.
రామ్‌జీ సమోసా
అయోధ్యలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఈ సమోసాలు. అక్కడ ఇది ఎంతో పాపులర్ స్నాక్‌గా చెప్పుకోవాలి. ప్రతి చోటా సమోసాలు లభిస్తాయి కానీ అయోధ్యలో దొరికే సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి. వీలైతే ఈ రామ్ జీ సమోసాలను తిని రండి.
టెహ్రీ
ఇది బియ్యంతో చేసే రుచికరమైన వంటకం. బాస్మతి బియ్యం, కొన్ని రకాల కూరగాయలు, మసాలా దినుసులు వేసి దీన్ని వండుతారు. పెరుగుతో లేదా రైతాతో దీన్ని తినాలి. రుచి అద్భుతంగా ఉంటుంది. పదేపదే అయోధ్య వెళ్ళలేరు కాబట్టి, వెళ్లినప్పుడే ఇలాంటి వన్నీ రుచి చూసి వస్తే మంచిది.
మఖాన్ మలై
పాల క్రీమ్ తో తయారుచేసే రుచికరమైన వంటకం ఇది. చక్కెర, యాలకుల పొడి వేసి దీన్ని తయారు చేస్తారు. రకరకాల డ్రైఫ్రూట్స్ ను గార్నిష్ చేస్తారు. దీన్ని తింటే స్వర్గం కనిపిస్తుంది. ఇంత రుచికరమైన వంటకాలు ఉన్నాయా అనిపిస్తుంది. కాబట్టి మఖాన్ మలై ఒకసారి తిని చూడాల్సిందే.
కచోరి
కచోరీలు అందరికీ తెలిసినవే కావచ్చు. కానీ అయోధ్యలో మాత్రం ప్రత్యేకంగా ఈ కచోరీలను తినాలి. లోపల బంగాళదుంపల గ్రేవీలను నింపి, మసాలా దినుసులు దట్టించి రుచికరంగా వండుతారు. ఇది క్రిస్పీగా ఉంటుంది. అయోధ్యలో ఇదొక టేస్టీ స్ట్రీట్ ఫుడ్. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది.
ఆలూ టిక్కీ చాట్
చాట్ అంటే ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. అందులో ఆలూ టిక్కీ చాట్ మరింత టేస్టీగా ఉంటుంది. బంగాళదుంపలు, మసాలా దినుసులు బాగా దట్టించి చేసే ఈ వంటకాన్ని ఒకసారి రుచి చూడాల్సిందే. కాస్త చాట్ మసాలా, పెరుగు మిక్స్ చేసుకొని తింటే దీని రుచి అదిరిపోతుంది. ఇదొక ప్రత్యేకమైన వంటకం అని చెప్పాలి.