Chanakya Niti Telugu : ఈ ఐదు విషయాలు పాటిస్తే జీవితంలో డబ్బుకు ఇబ్బంది ఉండదు
Chankya Niti On Money : జీవితంలో డబ్బు అనేది మనిషికి కచ్చితంగా ఉండాలి. అప్పుడే సరిగా బతుకుతాడని చాణక్య నీతి చెబుతుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే డబ్బుకు సమస్య ఉండదని చాణక్యుడు వివరించాడు.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితం గురించి అనేక విషయాలను చెప్పాడు. ఎలా బతికితే జీవితం బాగుంటుందో వివరించాడు. డబ్బులకు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు చాణక్యుడు. అయితే డబ్బు మాత్రమే ఒకరి విలువను పెంచదు. సమాజంలో గౌరవంగా జీవించేవారే విజయవంతంగా జీవిస్తారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు రాజకీయవేత్త, ఆర్థికవేత్త, పండితుడు కూడా. జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన విషయాలు పేర్కొన్నాడు. జీవితంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు అనుసరించాల్సిన విషయాలను చూడండి.
ఖర్చులకు దూరంగా ఉండాలి
ఏమీ ఆలోచించకుండా తొందరపాటు ఖర్చులకు దూరంగా ఉండాలి. చాణక్యుడు ప్రకారం డబ్బును నీళ్లలా ఖర్చు చేసేవారు, డబ్బు పొదుపు చేయని వారు మూర్ఖులు. వారు తీవ్రమైన బాధలను ఎదుర్కోవచ్చు. అత్యవసర పరిస్థితుల కోసం కొంత డబ్బు ఆదా చేసుకోండి. డబ్బు ఎలా పొదుపు చేయాలో తెలిసిన వారు తెలివైన వారని చాణక్య నీతి చెబుతుంది. విలాసాల కోసం డబ్బు వృథా చేయకండి. ఎందుకంటే అత్యవసర సమయాల్లో మీకు డబ్బు దొరకదు. అప్పుడు చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.
చెడు పనుల ద్వారా సంపాదించుకోవద్దు
చాణక్యుడు ప్రకారం మనం డబ్బును సరిగ్గా ఉపయోగించాలి. చెడు పనుల ద్వారా మనం సంపాదించే ధనం మంచి చేయదు. ఎప్పుడూ డబ్బుకు బానిస కాకూడదు. మనం చాణక్యుడి సూత్రాలను అనుసరిస్తే మనకు ఆర్థిక సమస్యలు ఎప్పటికీ రావు. జీవనోపాధి మొదలైన వాటిని ఎన్నుకునేటప్పుడు, మీరు స్పష్టమైన ఎంపిక చేసుకోవాలి. మీకు ఇష్టమైన ప్రదేశాలలో నివసిస్తున్నప్పుడు, పని చేస్తూ మీరు డబ్బు సంపాదించవచ్చు. అదే ఉపాధి లేని ప్రదేశాల్లోకి వెళ్లి మీరు ఎంత చూసినా.. డబ్బు రాదు. పైనుంచి మీకే ఖర్చులు ఉంటాయి.
క్రమశిక్షణ ఉండాలి
చాణక్యుడి సూత్రాల ప్రకారం, మనం క్రమశిక్షణ లేని మార్గాల్లో డబ్బు సంపాదిస్తే అది త్వరగా మాయమవుతుంది. అంటే మీరు తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు పదేళ్ల తర్వాత మీ నుంచి వెళ్లిపోతుంది. మీ మనశ్శాంతి దానితో పాటు నశిస్తుంది. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బుకు తక్కువ జీవితకాలం ఉంటుంది. మంచి మార్గాల్లో డబ్బు సంపాదించాలని చాణక్య నీతి చెబుతుంది. అప్పుడే డబ్బు మీ దగ్గర ఎక్కువకాలం ఉంటుంది.
ఇతరులను గౌరవించాలి
చాణక్యుడి సూత్రాల ప్రకారం, ఏ పరిస్థితిలోనైనా ఇతరులను గౌరవించాలి. మీరు ఇతరులను గౌరవించినప్పుడు వారు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇతరులను గౌరవించే వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని చాణక్య నీతి చెబుతోంది. ఇతరులను కించపరిచి ఆనందించే వ్యక్తులకు సమాజం ఎప్పటికీ విలువ ఇవ్వదు. అటువంటి వారి దగ్గర డబ్బు నిలవదు. ఆర్థిక కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
కుటుంబంలో కలహాలు ఉండకూడదు
చాణక్యుడి ప్రకారం కుటుంబంలో కలహాలు ఉంటే మహాలక్ష్మి నివసించదు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే అక్కడ మహాలక్ష్మి నివాసం ఉంటుంది. లేదంటే వెంటనే వెళ్లిపోతుంది. సుఖం, శాంతి లేని ఇంట్లో సంపద శాశ్వతంగా ఉండదు. మీ వద్ద ఉన్న డబ్బు గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకోకండి. డబ్బు మీద వ్యామోహం వద్దు. డబ్బు సంపాదన అనేది ఒక వెర్రిలా చేయకూడదు. తమ సంపద గురించి గర్వపడే వారి దగ్గర డబ్బు నిలవదు.