Monsoon Beauty Tips । వర్షాకాలంలో మీ ముఖాన్ని తాజాగా ఉంచే ఈ టిప్స్ పాటించండి!
మాన్‌సూన్‌లో మీ మేని ఛాయ మసకబారుతుంది. జిడ్డు చర్మం కలిగిన వారి ముఖం మరింత జిడ్డుగా తయారవుతుంది. కాబట్టి అందంగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి.
వర్షాకాలం వచ్చేసింది. ఇక ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి టీలు తాగవచ్చు, సాయంత్రం కాగానే పకోడీలు తినవచ్చు, వర్షంలో తడిస్తే స్నానం చేసినట్లే ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా స్నానం చేయాల్సిన అవసరమే ఉండదు అని కొందరు అనుకోవచ్చు. వర్షాకాలంలో వాతావరణంలో తేమ కారణంగా మీ చర్మంపై మొటిమలు రావచ్చు అని మీకు తెలుసా? మీ చర్మం ఇప్పటికే జిడ్డుగా ఉంటే, ఈ తేమ మీ ముఖంపై కాంతిని పూర్తిగా తొలగిస్తుంది, మచ్చలు ఏర్పడవచ్చు. బ్లాక్ హెడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేకప్ వేసుకుంటే అది మీ ముఖంపై బురదలా తయారవొచ్చు. కాబట్టి సీజన్ ఏదైనా చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగి ఉన్నవారు ఈ వర్షాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖంపై సెబమ్ ఉత్పత్తిని తొలగించడానికి ఎల్లప్పుడూ బ్లాటింగ్ పేపర్‌ను మీతో ఉంచుకోండి.
ఇంకా ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో తెలియజేస్తూ ఇక్కడ కొన్ని చిట్కాలను అందిస్తున్నాము.
1 టోనర్ ఉపయోగించండి
వర్షాకాలంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మంచి చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించడం. ఇందులో భాగంగా ముఖంపై ఆయిల్ ఉత్పత్తిని తగ్గించడానికి స్కిన్ టోనర్ వాడాలి. టోనర్‌ని ఉపయోగించడం వల్ల చర్మంపై pH స్థాయిని సమతుల్యం చేయవచ్చు. ఇది బ్యాక్టీరియా వృద్ధి నిరోధిస్తుంది. కాబట్టి మొటమలకు ఆస్కారం ఉండదు, ఈ రకంగా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
మీరు ఇంట్లో స్వంతంగా టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. 10 టీస్పూన్ల నీటిలో 2 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, 1 టీస్పూన్ టీ ట్రీ ఆయిల్ కలపండి. మిక్స్ చేసి ముఖంపై అప్లై చేయాలి.
2 మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోవద్దు
వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ మీ చర్మం తేమను కోల్పోతుంది. కాబట్టి మీ చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీ చర్మంపై రోజ్ వాటర్ అప్లై చేయడం ఎల్లప్పుడూ మంచిది. ఇది చర్మాన్ని హైడ్రేటింగ్ చేయడమే కాకుండా ఒక రిలీఫ్ కలిగిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజ్ వాటర్ ఉపయోగిస్తే అది మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మంపై దురదను నివారిస్తుంది. ముఖంపై కొద్దిగా రోజ్ వాటర్ స్ప్రే చేసి ఆరనివ్వాలి.
3 ఫేస్ వాష్‌లను ఉపయోగించండి
వర్షాకాలంలో మీ చర్మం మొటిమలు, మచ్చలకు, రంధ్రాలకు అవకాశమిచ్చే బ్యాక్టీరియా ప్రతిచర్యను ఎదుర్కొంటుంది. ఈ సమస్యను నివారించడానికి సబ్బులకు బదులుగా వేప ఆధారిత ఫేస్ వాష్‌ను ఉపయోగించాలి. వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా అది చర్మంపై మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది.
4 శనగపిండితో ఫేస్ మాస్క్
శనగపిండితో తయారు చేసుకునే ఫేస్ మాస్క్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఉపయోగించడం మరీ మంచిది. రెండు చెంచాల శెనగపిండిని తీసుకుని అందులో కొద్దిగా పాలు, పసుపు కలపాలి. మిక్స్ చేసి ముఖంపై అప్లై చేయాలి. మృదువైన, మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ మాస్క్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించండి.
5 గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి
మీ ముఖాన్ని చల్లటి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో కడగాలి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డును తొలగించవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన, మృదువైన, మెరిసే ముఖం పొందవచ్చు. అంతేకాదు గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియాను నశిస్తుంది, చెంపలపై ఏర్పడిన రంధ్రాలు మూసుకుపోవచ్చు.
సంబంధిత కథనం