Dondakaya Roti Pachadi: దొండకాయ రోటి పచ్చడి ఇలా చేశారంటే స్పైసీగా అదిరిపోతుంది-dondakaya roti pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dondakaya Roti Pachadi: దొండకాయ రోటి పచ్చడి ఇలా చేశారంటే స్పైసీగా అదిరిపోతుంది

Dondakaya Roti Pachadi: దొండకాయ రోటి పచ్చడి ఇలా చేశారంటే స్పైసీగా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Mar 16, 2024 11:53 AM IST

Dondakaya Roti Pachadi: రోటి పచ్చళ్ళు ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి దొండకాయ రోటి పచ్చడి ట్రై చేసి చూడండి. ఇది వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. దొండకాయ రోటి పచ్చడి రెసిపీ చాలా సులువు.

దొండకాయ పచ్చడి రెసిపీ
దొండకాయ పచ్చడి రెసిపీ (youtube)

Dondakaya Roti Pachadi: లేత దొండకాయలతో చేసిన రోటి పచ్చడి రుచిగా ఉంటుంది. కొంతమందికి ఎన్ని కూరలు ఉన్నా ఏదో ఒక పచ్చడితో రెండు ముద్దలు తింటే గాని భోజనం సంపూర్ణంగా అనిపించదు. అలాంటి వారి కోసమే ఈ దొండకాయ రోటి పచ్చడి రెసిపీ. ఇది తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. కేవలం అన్నంలోనే కాదు దోశె, ఇడ్లీలో కూడా ఈ పచ్చడి టేస్టీగా అనిపిస్తుంది. దొండకాయ రోటి పచ్చడి రెసిపీ చేయడం చాలా సులువు. కానీ ఎంతోమందికి విధానం తెలియక చేసుకోరు ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించండి.

దొండకాయ రోటి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

దొండకాయలు - పావు కిలో

పచ్చిమిర్చి - 12

చింతపండు - నిమ్మకాయ సైజులో

కొత్తిమీర - ఒక కట్ట

ఉప్పు- రుచికి సరిపడా

నూనె - మూడు స్పూన్లు

మెంతులు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

శనగపప్పు - ఒక స్పూన్

మినప్పప్పు - ఒక స్పూన్

ఆవాలు - ఒక స్పూన్

కరివేపాకు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

ఎండుమిర్చి - రెండు

దొండకాయ రోటి పచ్చడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో మెంతులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

2. అవి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి సన్నగా కోసిన దొండకాయలను, పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.

4. కాస్త ఉప్పును చల్లి మూత పెడితే అవి త్వరగా ఉడుకుతాయి.

5. అవి వాటిని వేయించుకున్నాక చివర్లో చింతపండు, కొత్తిమీరను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

6. ఈ మిశ్రమాన్నిమిక్సీ జార్ లో వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా బరకగా రుబ్బుకోవాలి.

7. ముందుగా పొడిచేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలి.

8. అన్నింటినీ కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

9. దీనికి తాలింపు వేయాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ముందుగా ఆవాలు వేసి చిటపటలాడించాలి.

10. తర్వాత జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి.

11. చిటికెడు ఇంగువ, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

12.. ఈ మొత్తం మిశ్రమాన్ని పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ దొండకాయ రోటి పచ్చడి రెడీ అయినట్టే.

దొండకాయలతో చేసే వంటకాలు ఆరోగ్యానికి మంచిది. కానీ ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు. వాటిని చాలా తేలికగా తీసుకుంటారు. తక్కువ ధరకు లభించే దొండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు కచ్చితంగా తినాల్సిన కూరగాయలలో దొండకాయ ఒకటి. ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా దొండకాయను వినియోగిస్తారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

దొండకాయలో థయామిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి దొండకాయకు ఉంది. చాలామంది పిల్లలకు దొండకాయలు పెట్టేందుకు ఇష్టపడరు. దొండకాయని పిల్లలకు తినిపిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

దొండకాయ రోటి పచ్చడి రుచికే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకలు దంతాలు దృఢంగా మారుతాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం అంటే సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గేందుకు దొండకాయ ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు దొండకాయను వండుకొని తినండి. ముఖ్యంగా ఆంధ్రా స్టైల్ లో ఇక్కడ మేము చెప్పిన దొండకాయ రోటి పచ్చడి చేశారంటే రుచి అదిరిపోతుంది.

WhatsApp channel

టాపిక్