Henna Hair Masks: జుట్టు సమస్యలు తగ్గాలంటే.. ఈ హెన్నా ప్యాకులు వేసుకోండి..-different henna hair masks for healthy and shiny hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Henna Hair Masks: జుట్టు సమస్యలు తగ్గాలంటే.. ఈ హెన్నా ప్యాకులు వేసుకోండి..

Henna Hair Masks: జుట్టు సమస్యలు తగ్గాలంటే.. ఈ హెన్నా ప్యాకులు వేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Sep 04, 2023 03:15 PM IST

Henna Hair Masks: చుండ్రు సమస్య, జుట్టు తెల్లబడే సమస్య.. ఇలా చాలా రకాల జుట్టు సమస్యలకు హెన్నా ప్యాక్‌లతో పరిష్కారం దొరుకుతుంది. అలాంటి మంచి హెన్నా పూతలేంటో తెలుసుకోండి.

జుట్టు కోసం హెన్నా పూతలు
జుట్టు కోసం హెన్నా పూతలు (feepik)

ఈ మధ్య చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ తెల్ల జుట్టు వచ్చేస్తోంది. మారుతున్న జీవన శైలి, చుట్టూ కాలుష్యం, అనారోగ్య కారణాల్లాంటి వాటి వల్ల ఈ యువత ఈ సమస్య బారిన పడుతున్నారు. చిన్నతనంలో వృద్ధుల్లా కనిపించడం ఇష్టం లేక రసాయనిక డైలను తలలకు వేసుకుంటూ లేనిపోని సైడ్‌ ఎఫెక్ట్స్‌ని తెచ్చి పెట్టుకుంటున్నారు. దీనికి బదులుగా జుట్టు ఆరోగ్యాన్ని పెంచే కొన్ని రకాల హెన్నా ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం. వీటిని ప్రయత్నించడంద్వారా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండానే తెల్ల జుట్టును పోగొట్టుకోవచ్చు. అలాగే కేశాలను కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

రంగు కోసం :

వంద గ్రాముల గోరింటాకు పొడిలో ఒక చెక్క నిమ్మరసం, ఒక టేబుల్‌ స్పూను కాఫీ పొడి, నీటితో కలపాలి . ఈ మిశ్రమం మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా ఉండాలి. అలా తయారు చేసుకున్న మిశ్రమంపై మూత పెట్టి కనీసం నాలుగు గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు గోరింటాకు పొడిలోని రంగు దిగి, జుట్టుకు బాగా పట్టే అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని జట్టుకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. షాంపూ పెట్టకూడదు.

జుట్టు ఆరోగ్యం కోసం :

జుట్టు పట్టులా మెరవాలన్నా, చుండ్రు తగ్గాలన్నా, దెబ్బతిన్న జుట్టు బాగవ్వాలన్నా ఈ హెన్నా ప్యాక్‌ని ట్రై చేయవచ్చు. నాలుగు స్పూన్ల హెన్నా పొడిలో, రెండు టేబుల్‌ స్పూన్ల మెంతి పొడి కలపాలి. అందులో నాలుగు కర్పూరం బిళ్లల్ని మెత్తగా పొడి చేసి వేయాలి. అన్నింటినీ బాగా కలిపి కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ గట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. కనీసం నాలుగు గంటల పాటు నాననివ్వాలి. తర్వాత జుట్టుకు కుదుళ్ల నుంచీ చివర్ల దాకా రాసుకోవాలి. కనీసం 45 నిమిషాల పాటు దీనిని తలకు పట్టించి ఉంచాలి. తర్వాత షాంపూతో తల స్నానం చేయవచ్చు. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ని వేసుకోవడం వల్ల తెల్లజుట్టు ముదురు ఎరుపు రంగులోకి మారడంతోపాటు ఆరోగ్యకరంగా ఎదుగుతుంది.

పట్టు కుచ్చులా మెరవాలంటే :

సిల్కీ జుట్టు కావాలనుకునేవారు ఈ హెన్నా పూతను ట్రై చేయవచ్చు. నాలుగు స్పూన్ల గోరింటాకు పొడిని తీసుకోవాలి. అందులోకి నాలుగైదు టేబుల్‌ స్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌ని వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. జుట్టుకు ముందుగా ఒకసారి తలస్నానం చేసేయాలి. తర్వాత ఈ పేస్ట్‌ని మాడు నుంచి వెంట్రుక చివళ్ల వరకు మొత్తం పట్టించాలి. అరగంట తర్వాత సాధారణ నీటితో కడుక్కుంటే సరిపోతుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌లా పని చేసి పట్టులా మెరిసేలా చేస్తుంది.

Whats_app_banner