Dell XPS 13। డెల్ నుంచి మరో సరికొత్త 2-in-1 ల్యాప్‌టాప్ విడుదల, ధర ఎంతో తెలుసా?
పీసీ మేకర్ డెల్ నుంచి Dell XPS 13 అనే సరికొత్త ల్యాప్ టాప్ విడుదలైంది. ఇది టాబ్లెట్ లాగా కూడా పనిచేసే ఒక 2-in-1 పరికరం. దీని ధర, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ డెల్ తన XPS సిరీస్‌ను విస్తరించింది. ఈ సిరీస్‌లో కొత్త XPS 13 ల్యాప్‌టాప్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది అధునాతన 12వ తరం ఇంటెల్ EVO ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఈ Dell XPS 13 టాబ్లెట్ లాగా కూడా పనిచేసే ఒక 2-in-1 పరికరం. మునుపటి తరాల 2-in-1 మోడల్‌ల వలె కాకుండా ఈ సరికొత్త XPS 13 మాగ్నెటిక్ కీబోర్డ్ కేస్‌తో సర్ఫేస్ ప్రో-స్టైల్ మోడల్‌గా వచ్చింది. కాబట్టి టాబ్లెట్ నుంచి ల్యాప్‌టాప్‌కి సులభంగా మార్చుకోవచ్చు.
Dell XPS 13 ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Dell.comలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆగస్టు 25 నుంచి డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధరలు రూ. 99,990 నుంచి ప్రారంభమవుతున్నాయి.
2022 Dell XPS 13 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇది HD ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 500 నిట్స్ వరకు ప్రకాశాన్ని అందిస్తుంది. అంతేకాకుడా ‘ఐసేఫ్’ టెక్నాలజీని కలిగి ఉంది. కాబట్టి కంటిపై భారం తక్కువగా పడుతుంది. దీని స్క్రీన్ స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉంది, పైభాగంలో 400p IR కెమెరా ఇంకా 720p వెబ్‌క్యామ్ ఉన్నాయి. అలాగే బ్యాక్‌లిట్ కీబోర్డ్, డ్యూయల్ స్పీకర్‌లను ఇచ్చారు. 'ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ 3' టెక్నాలజీతో ఈ ల్యాప్‌టాప్ గంటలోపు 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇంకా ఏమేం ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇచ్చారో ఈ కింద పరిశీలించండి.
Dell XPS 13 9315 ల్యాప్‌టాప్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 13.4-అంగుళాల ఫుల్ HD ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్‌ప్లే
- 16 GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- Intel కోర్ i5-1230U లేదా Core i7-1250U ప్రాసెసర్
- Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 51Wh బ్యాటరీని ప్యాక్, 45W ఛార్జింగ్ సపోర్ట్
- Thunderbolt 4 USB Type-C పోర్ట్
- 5G కనెక్టివిటీ
2022 Dell XPS 13 ల్యాప్‌టాప్ పూర్తిగా CNC మెషిన్డ్ అల్యూమినియం, గాజుతో తయారు చేసినది. దీని నిర్మాణానికి వాడినది 100% రీసైకిల్ మెటీరియల్. ఇది అత్యంత సన్నని, తేలికైన 13-అంగుళాల XPS నోట్‌బుక్. దీని బరువు కేవలం 1.17kg మాత్రమే.