Coconut oil making: కొబ్బరినూనె ఇంట్లోనే చేసుకోవచ్చు.. ఏ పరికరాలూ అవసరం లేకుండా..
Coconut oil making: కొబ్బరినూనె ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
స్వచ్ఛమైన కొబ్బరినూనె వాడటం వల్ల ఆరోగ్యానికీ, జుట్టుకీ చాలా ఉపయోగం. అయితే బయట దొరికే కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరినూనె ధర ఎక్కువనో, లేదంటే స్వచ్ఛమైందో కాదో అనే సందేహం ఉంటుంది. ఏమైనా రసాయనాలు కలిపారన్నా భయమూ ఉంటుంది. అయితే ఇంట్లోనే కొబ్బరినూనె చేసుకుంటే ఈ సమస్యులండవు. తయారుచేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అదెలాగో చూద్దాం.
కొబ్బరినూనె వల్ల బోలెడు లాభాలుంటాయి. వంటలో వాడటం నుంచి జుట్టు రక్షణ వరకు దీన్ని ఉపయోగించొచ్చు. ముదిరిన కొబ్బరి నూనె నుంచి కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ స్వచ్ఛమైంది. అలాగే కొబ్బరి సహజ గుణాలన్నీ దీంట్లో ఉంటాయి.
వర్జిన్, ఎక్స్ట్రా వర్జిన్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తేడాలేంటి?
ఇవన్నీ కొబ్బరినూనెలో రకాలు. ఇవన్నీ కొబ్బరి నూనెలో రకాలు. కానీ వాటి తయారీ విధానం భిన్నంగా ఉంటుంది. వర్జిన్, ఎక్స్ట్రా వర్జిన్ కొబ్బరినూనెలు మెకానికల్ పద్ధతుల్లో తయారుచేస్తారు. కోల్డ్ ప్రెస్డ్ నూనె ఎలాంటి వేడి లేకుండా తయారు చేస్తారు కాబట్టి దీన్ని నాణ్యత ఎక్కువున్న నూనెగా పరిగణిస్తారు. ఫ్లేవర్లు, పోషకాలు కూడా ఎక్కువుంటాయి.
కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె లాభాలు:
- కండీషనర్: జుట్టుకు కొబ్బరినూనె మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా, మెరుపుతో ఉండేట్లు చూస్తుంది. జుట్టు చివర్లు చిట్లే సమస్య కూడా తగ్గిస్తుంది.
- జుట్టు పెరుగుదల: దీంట్లో ఉన్న పోషకాల వల్ల జుట్టు పెరగడంలో సాయపడుతుంది. మాడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- చుండ్రు సమస్య తగ్గుతుంది: కొబ్బరినూనెకుండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చుండ్రు సమస్యతో పాటూ మాడు ఇన్ఫెక్షన్లుంటే తగ్గిపోతాయి.
ఇంట్లో ఎలా చేసుకోవాలి?
1. కొబ్బరిని పగలగొట్టి నీళ్లు వంపేయాలి. ఇప్పుడు కొబ్బరిని ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలన్నీ నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.
2. ఇపుడు ఒక మిక్సీ జార్ లో ఈ ముక్కలు వేసుకుని అవసరమైనన్ని నీళ్లు పోసుకుని వీలైనంత మెత్తగా చేసుకోవాలి.
3. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలో పోసుకోవాలి. సన్నని కాటన్ లేదా చీజ్ క్లాత్ తీసుకుని వడగట్టుకోవాలి. వీలైనంత గట్టిగా పిండుకోవాలి.
4. వడకట్టుకున్న మిశ్రమాన్ని పెద్ద గాజు సీసాలో పోసుకోవాలి. దాన్నలాగే 24 నుంచి 48 గంటలు కదపకుండా వదిలేయాలి. ఆలోపు నూనె నీళ్ల నుంచి వేరయిపోయి మీదికి తేలుతుంది. ఫ్రిజ్ లో పెడితే పైన నూనె గడ్డకట్టుకుపోతుంది.
5. ఇపుడు పైన ఉన్న నూనెను మెల్లగా వేరు చేసి వేరే డబ్బాలో భద్రపరుచుకోవాలి.