Chinese Food: చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ తో యువతలో సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం, చెబుతున్న సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు
Chinese Food: మనం తినే ఆహారాలు ఆరోగ్యకరమైనవో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లాంటివి శరీరానికి అనేక రకాల నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి పునరుత్పత్తి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.
పాత కాలంతో పోలిస్తే ఈ రోజుల్లో ఆడపిల్లల పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా అభిప్రాయపడ్డారు. పునరుత్పత్తి వ్యవస్థకు చైనీస్ ఆహారం చెడు ప్రభావం చూపిస్తుందని ఆమె చెబుతున్నారు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ తినేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండాలని ఆమె చెబుతున్నారు.
చైనీస్ ఫుడ్ ప్రమాదకరమా?
ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకోవాలని శ్వేతా షా సూచించారు. చైనీస్ ఫుడ్ ప్రజలకు చాలా చెడు చేస్తుందని పోషకాహార నిపుణులు భావిస్తున్నారు. చైనీస్ ఆహారంలోని అనేక రకాల సాస్‌లు ఉపయోగిస్తారని… వాటి కలయిక శరీరానికి ఎంతో కీడు చేస్తుందని ఆమె చెప్పారు. ఇది ప్రజలలో పునరుత్పత్తి వ్యవస్థ సమస్యలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
గర్భాశయానికి దేశీ వంటకం
గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు నెయ్యి, బెల్లం, శనగలు కలిపి తినాలని ప్రతిరోజూ సూచించారు. చాలాసార్లు ప్రజలు డిన్నర్ కోసం సలాడ్ లేదా పండ్లు తింటారని, అవి తక్కువ కేలరీలు ఇస్తాయని వారు అనుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు. పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట తినకూడదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రాత్రి భోజనంలో కిచిడీ తినడం ఉత్తమ ఎంపికని వివరించారు. గ్రీన్ టీ, ఇంట్లో తయారు చేసుకున్న హెర్బల్ టీ తాగాలని ఆమె చెప్పారు. టీ బ్యాగుల్లోని మైక్రోప్లాస్టిక్స్ క్యాన్సర్ కు కారణమవుతాయి. కాబట్టి టీ ఆకులతో టీ పెట్టుకుని తాగడం ఉత్తమమని ఆమె చెబుతున్నారు.
ఫాస్ట్ పుడ్ కేవలం యువతకే కాదు, పిల్లలు పెద్దలకు కూడా ఎంతో హానికరం. ఇది రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలను ఇవ్వదు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినేవారిలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొటిమలు, చర్మ పొడి బారడం, లేదా జిడ్డుగా మారడం వంటి సమస్యలు కనిపిస్తాయి. చైనీస్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.
కొందరిలో శ్వాస కోశ సమస్యలు రావడానికి ఫాస్ట్ ఫుడ్ కారణమవుతుంది. శరీరానికి పోషకాహార అందకపోవడం వల్ల పోషకాహార లోపం కూడా తలెత్తుతుంది. వీరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోయి గుండె జబ్బులు రావచ్చు. అధిక బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది.
ఫాస్ట్ ఫుడ్ తరచూ తినేవారి దంతాల సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ ఆహారంలో పిండి పదార్థాలు అధికం. ఇవి ఆమ్లాలను అధికంగా ఉత్పత్తి చేసి దంతాలను క్షీణించేలా చేస్తాయి. దంతాల ఆరోగ్యం కోసం చైనీస్ ఫుడ్ మానేయడం ఉత్తమం. పిల్లలకు చైనీస్ ఫుడ్ పూర్తిగా తినిపించకపోవడమే మంచిది.