Studyroom decor Tips: స్టడీరూం ఇలా అలంకరిస్తే.. పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది-childern stydy room decoration tips to improve their concentration ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Studyroom Decor Tips: స్టడీరూం ఇలా అలంకరిస్తే.. పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది

Studyroom decor Tips: స్టడీరూం ఇలా అలంకరిస్తే.. పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Sep 07, 2023 03:52 PM IST

Studyroom decor Tips: పిల్లలు చదువుకునే స్టడీ రూం వాతావరణం వాళ్ల దృష్టి మరల్చేలా ఉండకూడదు. వాళ్ల ఏకాగ్రత పెంచేలా స్టడీ రూం ఎలా అలంకరించాలో తెలుసుకోండి.

పిల్లల స్టడీ రూం డెకార్
పిల్లల స్టడీ రూం డెకార్ (pexels)

ఇంట్లో అన్ని గదుల్ని అలంకరించుకోవడం ఒక ఎత్తయితే పిల్లలు చదువుకునే గదిని అలంకరించడం మరో ఎత్తు. ఇంట్లో పిల్లలు ఏ వయసు వారు అన్న దాన్ని బట్టీ డిజైనింగ్‌ తీరు మార్చుకోవాల్సి ఉంటుంది. స్కూలుకు వెళ్లే పిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే వారు చదువుకునే గదిని ఇలా తీర్చి దిద్దండి. వారు మరింత ఏకాగ్రతతో చదువుకోవడం ప్రారంభిస్తారు.

విశాలంగా ఉంచండి :

పిల్లలు చదువుకునే గదిని వీలైనంత తక్కువ సామాన్లతో ఏర్పాటు చేయండి. ఎక్కువగా పెద్ద పెద్ద ఫర్నిచర్‌ని వేయవద్దు. బదులుగా రకరకాల స్టడీ మెటీరియల్స్‌, మెదడుకు పదును పెట్టే పజిల్‌ గేమ్స్‌ లాంటి వాటిని అక్కడ ఉండేలా చూడండి. సాధారణ సమయంలో కంటే పిల్లలు చదువుకునే సమయంలో ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. చుట్టూ ఎక్కువగా సామాన్లు కనిపించేసరికి వారికి స్ట్రెస్‌ మరింత పెరుగుతుంది. అందుకనే ఆ గదిని వీలైనంత విశాలంగా ఉండేలా చూడండి.

కళ్లకు తగ్గ లైటింగ్‌ :

ఈ గదిలో మిరుమిట్లు గొలుపుతూ చాలా ఎక్కువ కాంతినిచ్చే లైట్లను ఏర్పాటు చేయవద్దు. బదులుగా చదివేప్పుడు కళ్లకు సాంత్వనగా అనిపించే రీడింగ్‌ లైట్లను ఏర్పాటు చేయండి. పగటి పూట అయితే సహజమైన వెలుతురు, గాలి గదిలోకి ధారాళంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకోండి. చీకటి పడిన తర్వాత చదువుకునే అవసరముంటే ఒక స్టడీ ఫోకస్‌ లైట్‌ని ఏర్పాటు చేయండి. గది మొత్తం చీకటిగా ఉండి, పుస్తకం ఉన్న చోట మాత్రమే కాంతి ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇతరత్రా వస్తువుల మీదకు దృష్టి ఎక్కువగా వెళ్లదు. పుస్తకం మీదే ఉంటుంది.

వీలుగా పుస్తకాల అరలు :

మామూలు గదుల్లోలాగే ఇక్కడా ఎక్కువ క్యాబినేట్‌లను ఏర్పాటు చేయకండి. బదులుగా పుస్తకాలను పెట్టడానికి, తీసుకోవడానికి వీలుగా ఉండే బుక్‌ షెల్ఫులను అవసరాన్ని బట్టి అందంగా డిజైన్‌ చేసుకోండి. ఇప్పుడు పుస్తకాల షెల్ఫులూ బోలెడు డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. గది ఖాళీ, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ గోడకు ఆర్ట్‌ వర్క్లకు బదులుగా అందమైన పుస్తకాల అరను ఏర్పాటు చేయండి. గది చిన్నగా ఉంది ఖాళీ లేదు అనుకున్నప్పుడు వాల్‌ మౌంటెడ్‌ స్టడీ టేబుళ్లను ఫిట్‌ చేయించుకోవడం మంచిది.

నిశబ్దంగా ఉండాలి :

బయటి శబ్దాలు ఎక్కువగా లోపలికి రాకుండా చూసుకోవాలి. కిటికీలు, వెంటిలేటర్లను పెట్టుకునేప్పుడే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీవీలు, మ్యూజిక్‌ సిస్టంలలాంటి వాటిని ఈ గదికి దగ్గరలో ఏర్పాటు చేయకూడదు.

ఒకటే రంగు :

గది మొత్తానికి ఒకటే రంగును వేయించాలి. దానివల్ల ఏకాగ్రత దిబ్బతినదు. మరీ లేత, మరీ ముదురు రంగులు చదువుకునే గదికి అంతగా నప్పవు. మధ్యస్తంగా ఉన్న రంగును ఎంపిక చేసుకోవాలి. ఇంటీరియర్‌ దీనికి నప్పే విధంగా డిజైన్‌ చేసుకుంటే లుక్‌ బాగుంటుంది. ఎన్ని పెట్టినా గదిలో ఒకటి రెండైనా పచ్చటి మొక్కల్ని పెట్టకపోతే డిజైనింగ్‌ పూర్తి కానట్లేనని గుర్తుంచుకోండి.

Whats_app_banner