Chanakaya Niti Telugu | ఒక వ్యక్తిని నమ్మాలంటే.. వారిలో ఈ నాలుగు అంశాలు చూడాలి!
Chanakya Niti Telugu: ఒకరిపై మన విశ్వాసాన్ని ఉంచే ముందు లేదా సంబంధంలోకి ప్రవేశించే ముందు, ఓ నాలుగు ప్రాథమిక అంశాలను పరిగణించమని చాణక్యుడు సలహా ఇచ్చాడు.
Chanakya Niti Telugu: జీవితంలో నాకు ఎవరూ వద్దు, ఎవరితో సంబంధం నాకు అవసరం లేదు అని అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో చెప్పలేం. అలాగని అందరినీ నమ్ముతూ అందరితో సంబంధాలను కొనసాగించడం కూడా కరెక్ట్ కాదు. ఒక సమాజంలో కలిసి జీవిస్తున్నప్పుడు అందరితో సత్సంబంధాలను కలిగి ఉండటం మంచిదే, కానీ మంచిగా మాట్లాడే అందరూ మంచివారు అనుకోవడం, వారిని గుడ్డిగా నమ్మడం చేయకూడదు అని ఇక్కడ అర్థం. ఆచార్య చాణక్యుడు ఈ సంబంధాల గురించి సవివరంగా వివరించాడు. మానవ జీవితంలో సంబంధాల ఆవశ్యకతను నొక్కిచెప్పాడు. మీరు ఎంత కష్టపడి ఎదిగినా మీ చుట్టూ ఉండే వారు నమ్మకమైన వారు లేకపోతే అది మీ జీవితాన్ని పాతాళానికి నెట్టివేస్తుందని చాణక్య నీతి చెబుతుంది.
వ్యక్తులపై నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి, అర్ధవంతమైన సంబంధాలను పెంపొందించడానికి ముందు వారు ఎలాంటి వారో గ్రహించాలి. వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకునే ముందు వారిని క్షుణ్ణంగా అంచనా వేయడం చాలా ముఖ్యం అని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రం ద్వారా నొక్కి చెప్పాడు. ఒకరిపై మన విశ్వాసాన్ని ఉంచే ముందు లేదా సంబంధంలోకి ప్రవేశించే ముందు, ఓ నాలుగు ప్రాథమిక అంశాలను పరిగణించమని చాణక్యుడు సలహా ఇచ్చాడు. వ్యక్తిలో చూడాల్సిన ఆ నాలుగు అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం.
1. వారి నిస్వార్థతను అంచనా వేయండి
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఎవరితో అయినా స్నేహాన్ని ఏర్పరుచుకునేటప్పుడు వారి నిస్వార్థతను అంచనా వేయాలి. ఆ వ్యక్తి త్యాగం అనే సద్గుణాన్ని కలిగి ఉన్నాడో లేదో చూడాలి. చాణక్య నీతి ప్రకారం, నిస్వార్థతను ప్రదర్శించే వారు అచంచల విశ్వాసానికి అర్హులు. అలాంటి వ్యక్తులు ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తారు, ఇతరుల ఆనందం కోసం ఇష్టపూర్వకంగా త్యాగాలు చేస్తారు. అలాంటి వారిని నమ్మవచ్చు. అటువంటి వ్యక్తులతో స్నేహాన్ని పెంపొందించుకోవడం ద్వారా, జీవితంలో ఎదురయ్యే కష్టాలలో మనకు సహాయం అందుతుంది.
2. వారి పాత్రను అంచనా వేయండి:
మంచి స్వభావం ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలని చాణక్యుడు నొక్కి చెప్పాడు. ఇతరులపై పగ ప్రతీకారాలు పెంచుకొని, ఇతరులను స్వర్వ నాశనం చేయాలని నిరంతరం ఆలోచనలు చేస్తారో అలాంటి వారిని ఎప్పటికీ విశ్వసించవద్దు. ఇతరుల మేలు కోరేవారు, దానిపై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులతో అనుబంధం ఏర్పర్చుకోవాలి. ఇతరుల కీడు కోరే వారిని విశ్వసించడం వలన ఏదో ఒక రోజు వారు మీ నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తారని చాణక్య నీతి చెబుతోంది. విశ్వసనీయ సంబంధాలను నిర్మించడంలో ఈ అంశం కీలకంగా చూడాలని చెప్పారు.
3. వారి లక్షణాలను పరిశీలించండి
కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, మోసం వంటి ప్రతికూల లక్షణాలు ఉన్నవారిని ఎప్పటికీ నమ్మకూడదు. ఈ లక్షణాలు లేని వ్యక్తులు నమ్మదగినవారు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు, ద్రోహం చేయరు. మంచి లక్షణాలు ఉన్నవారు మీ జీవితంలోని సంతోషాలు, బాధలు రెండింటినీ యథార్థంగా పంచుకుంటారు. కాబట్టి ఒకరి పాత్రను అంచనా వేసేటప్పుడు ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే అవి నమ్మకమైన, శాశ్వతమైన సంబంధానికి పునాదిగా ఉంటాయి అని చాణక్య నీతి పేర్కొంది.
4. వారి చర్యలను గమనించండి
ఒక వ్యక్తి పాత్రను నిజంగా అర్థం చేసుకోవడానికి, వారి చర్యలపై చాలా శ్రద్ధ వహించాలి. పదేపదే తప్పులు చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పదేపదే తప్పులు చేసేవారు కొంతకాలం మంచివారిగా నటిస్తారు, తమదేం తప్పులేనట్లుగా అమాయకంగా వ్యవహరిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు నిజస్వరూపం బయటపెడతారు. వారు మీ నమ్మకాన్ని వమ్ము చేసే అవకాశం ఉంది. కాబట్టి మంచి పనులు, మంచి చర్యలు చేసే వారిని వెతకండి. ఎవరైతే పని మీద చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారో, జాలి- కరుణను స్థిరంగా ప్రదర్శించే వారితో మనం అనుబంధం ఏర్పర్చుకోవాలి.
సంబంధిత కథనం
టాపిక్