Work From Home Exercises: వర్క్ ఫ్రం హోం చేసే వారికి మధ్య మధ్యలో ఈ వ్యాయామాలు !
Work From Home Exercises: వర్క్ ఫ్రం హోం చేసేవాళ్లు పని మధ్యలో చేసుకోదగ్గ సులువైన వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. అవెలా చేయాలో తెలుసుకోండి.
ఇటీవల కాలంలో చాలా మంది వర్క్ ఫ్రం హోంలు చేస్తున్నారు. ఇంట్లోనే గంటల తరబడి అలా కూర్చుని కంప్యూటర్లతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి వారు మధ్య మధ్యలో చిన్న పాటి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు ఎలాంటి వ్యాయామాలు చేసుకోవచ్చో జాబితాను ఇక్కడిచ్చారు. వాటిని చూసి చేసేందుకు ప్రయత్నించండి.
వీలైనప్పుడల్లా నడక:
ఎప్పుడూ కూర్చునే పనులు చేసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు అధికం అవుతాయి. అందుకనే వర్క్ ఫ్రం హోంలో పనులు చేసుకునే వారు వీలైనంత అటూ ఇటూ తిరిగేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. వీడియో కాల్స్, ఫోన్ కాల్స్‌ని మాట్లాడేప్పుడు నిలబడండి. వీలైతే నడవండి. దీని వల్ల శరీరం కాస్త ఫ్లెక్సిబుల్‌గా అవుతుంది.
నిలబడిన చోటే పరిగెత్తండి:
ఎక్స్‌ర్‌సైజులు చేయడం పెద్దగా అలవాటు లేని వారు చిన్న చిన్న వ్యాయామాలతో శరీరాన్ని అలవాటు చేయండి. చిన్నగా జంప్‌లు చేయడం, నిలబడిన చోటే పరిగెట్టడం, స్క్వాట్‌లు చేయడం, ఆఫీసు టేబుల్‌ని పట్టుకుని పుషప్స్ చేయడం లాంటివి చేస్తూ ఉండండి.
ఒక రౌండు సూర్య నమస్కారాలు:
వీలైతే రెండు మూడు గంటలకోసారైనా ఓ రౌండు సూర్య నమస్కారాలు చేయండి. వీటి వల్ల శరీరం అన్ని రకాలుగానూ వంగుతుంది. ఇంకా ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది.
స్కిప్పింగ్ రోప్ పక్కనుంచుకోండి:
మీరు ఎగరగలిగేంత బరువులో ఉండే వారైతే స్కిప్పింగ్ రోప్‌ని ఎదురుగా పెట్టుకోండి. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు 20 నుంచి 100 వరకు, మీ సామర్థ్యాన్ని బట్టి రౌండ్లు స్కిప్పింగ్ ఆడేందుకు ప్రయత్నించండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్:
ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ఓసారి లేచి గోడకు కాస్త ఆనుకుని కూర్చోండి. కళ్లు మూసుకుని ఐదు నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి మీ ఒత్తిడి మొత్తం దూరం అయిపోతున్నట్లు భావించండి. ఇలా చేయడం వల్ల పని ఒత్తిడి నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది.
అలారం పెట్టుకోండి:
చాలా మంది ఆఫీసు పనిలో బడి తమ శరీరం కదలికల గురించి పెద్దగా పట్టించుకోవడం మానేస్తుంటారు. ఇలా మర్చిపోయే వారు కనీసం రెండు గంటలకోసారైనా లేచి చిన్నగా వ్యాయామాలు, ఒళ్లు విరుచుకోవడం లాంటివి చేసుకోవాలి. గుర్తుండదు అనుకునే వారు అలారం సెట్ చేసుకుని దాని ప్రకారం మీ పనిని, వ్యాయామాన్ని ప్రణాళిక ప్రకారం చేసుకోండి. పై అన్నింటిలో అవసరం, సమయాన్ని బట్టి వేటిని వీలైతే వాటిని చేస్తూ ఉండటం అలవాటు చేసుకోండి. వీటి వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.