cancer cause cardiac arrest: క్యాన్సర్‌తో స్ట్రోక్ కూడా వస్తుందా? వైద్యుల మాటిదే-bengali actress aindrila sharma dies at 24 can cancer cause cardiac arrest ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer Cause Cardiac Arrest: క్యాన్సర్‌తో స్ట్రోక్ కూడా వస్తుందా? వైద్యుల మాటిదే

cancer cause cardiac arrest: క్యాన్సర్‌తో స్ట్రోక్ కూడా వస్తుందా? వైద్యుల మాటిదే

HT Telugu Desk HT Telugu
Nov 21, 2022 06:49 PM IST

క్యాన్సర్ నుంచి బయటపడిన బెంగాలీ నటి స్ట్రోక్‌తో ఆదివారం చనిపోయారు. క్యాన్సర్‌కు స్ట్రోక్స్‌కు ఉండే సంబంధంపై వైద్యుల మాట ఇదీ..

ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ. అథెరోస్ల్కెరోసిస్ వ్యాధి గుండెపోటు, స్ట్రోక్స్‌కు దారితీస్తుందని చెబుతున్న వైద్యులు
ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ. అథెరోస్ల్కెరోసిస్ వ్యాధి గుండెపోటు, స్ట్రోక్స్‌కు దారితీస్తుందని చెబుతున్న వైద్యులు

ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ (24) పలుమార్లు గుండెపోటుకు గురై ఆదివారం మరణించారు. రెండుసార్లు క్యాన్సర్‌ నుంచి బయటపడిన ఐంద్రీలా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ నవంబర్ 1న ఆసుపత్రిలో చేరారు. ఐంద్రిలా క్యాన్సర్‌ చికిత్స చేయించుకోవడం వల్ల ఆమెకు కార్డియాక్ అరెస్ట్ లేదా స్ట్రోక్ వచ్చి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి

"కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె పనితీరు అకస్మాత్తుగా స్తంభించడం. మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయడం ఆ సమయంలో కష్టతరం అవుతుంది..’ అని డాక్టర్ అతుల్ మాథుర్ చెప్పారు. ఆయన ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంకేతాలు ఆకస్మిక పతనం, పల్స్ పడిపోవడం, శ్వాస లేకపోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.

బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ మధ్య సంబంధం

‘ధమనులు మూసుకుపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ రావొచ్చు. ధమనులు నిరోధానికి గురైనప్పుడు గుండెపోటు ఏర్పడి తరువాత బ్రెయిన్ స్ట్రోక్ కూడా దానిని అనుసరిస్తుంది. అథెరోస్ల్కెరోసిస్ అనే వ్యాధి ప్రక్రియలో భాగంగా కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ఒకదానితో ఇంకొకటి సంబంధం కలిగి ఉంటాయి. అథెరోస్ల్కెరోసిస్ ఉన్నప్పుడు ఒత్తిడి, రక్తపోటు, మత్తుపదార్థాల వినియోగం, ధూమపానం, మధుమేహం లేదా ఏదైనా కఠిన వ్యాయామం కారణంగా సైలెంట్ బ్లాక్ పగిలి గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా గుండెపోటుకు దారితీస్తుంది. తీవ్రమైన గుండెపోటు గుండె ఆగిపోవడానికి దారి తీస్తుంది. గుండె పూర్తిగా ఆగిపోయి శరీరంలోని వివిధ అవయవాలకు తగినంత ఆక్సిజన్, రక్తం అందించలేకపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు..’ అని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్, హెచ్‌ఓడీ కార్డియాలజీ డాక్టర్ సంజీవ్ గేరా చెప్పారు.

క్యాన్సర్ లేదా క్యాన్సర్ చికిత్స కార్డియాక్ అరెస్ట్‌కు కారణం కావొచ్చు..

‘క్యాన్సర్‌ వల్ల కూడా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్ నాళాలు గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రధానంగా కాళ్ళలోని చిన్న నాళాలలో ఈ పరిణామం సంభవిస్తుంది. క్యాన్సర్ ఉన్న రోగికి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, మెదడుకు హాని కలిగించవచ్చు..’ అని డాక్టర్ అతుల్ మాథుర్ చెప్పారు. కీమోథెరపీ లేదా రేడియోథెరపీతో పాటు క్యాన్సర్ వ్యాధి గుండెపోటు లేదా స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ గెరా చెప్పారు.

WhatsApp channel

టాపిక్