Boiled peanuts: పల్లీలు వేయించి కాకుండా ఉడికించి తినండి.. ఈ లాభాలన్నీ పొందొచ్చు-benefits of eating boiled peanuts instead roasted ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Boiled Peanuts: పల్లీలు వేయించి కాకుండా ఉడికించి తినండి.. ఈ లాభాలన్నీ పొందొచ్చు

Boiled peanuts: పల్లీలు వేయించి కాకుండా ఉడికించి తినండి.. ఈ లాభాలన్నీ పొందొచ్చు

Koutik Pranaya Sree HT Telugu
Sep 19, 2024 07:00 PM IST

Boiled peanuts: వేరుశెనగలను వేయించడానికి బదులుగా ఉడకబెట్టి తినడం ప్రారంభించండి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, బరువు తగ్గడానికి, డయాబెటిస్‌కు ఇది ఉత్తమ అల్పాహారం ఎంపిక.

ఉడికించిన వేరుశనగ
ఉడికించిన వేరుశనగ (shutterstock)

వేరుశెనగ లేదా పల్లీలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా లేకున్నా పల్లీలు మాత్రం ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. వీటిని తినడం వల్ల కూడా డ్రై ఫ్రూట్స్ లాంటి లాభాలే పొందొచ్చు. అయితే సాధారణంగా వేరుశనగను నూనెలో ఫ్రై చేసి లేదా వేయించి తినడమే ఎక్కువగా చేస్తారు. బదులుగా ఉడకబెట్టుకుని తింటే అనేక లాభాలుంటాయి. అవేంటో చూడండి.

పోషకాలు:

వేరుశెనగలను ఉడకబెట్టి తింటే అది సంపూర్ణ భోజనంలా ఉంటుంది. తిన్న తర్వాత కడుపు కూడా నిండడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు.. ఇలా ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన పోషకాలన్నీ దొరుకుతాయి. అరకప్పు ఉడికించిన వేరుశెనగలో 286 క్యాలరీలు ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా ఉండదు కాబట్టి వీటిని తినడం ఆరోగ్యకరం.

గుండె ఆరోగ్యం:

వేరుశెనగలో మోనోశాచురేటెడ్ కొవ్వు, పాలీ అన్ శ్యాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రోజూ కొంత మొత్తంలో వేరుశెనగ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండెజబ్బులు కూడా దూరం అవుతాయి.

డయాబెటిస్:

ఉడికించిన వేరుశెనగలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఇది డయాబెటిస్, క్యాన్సర్ లేదా గుండె జబ్బులు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉడకబెట్టిన వేరుశెనగలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని సహాయంతో అది శరీరంలో చక్కెర శోషణను నెమ్మదిగా అవుతుంది. డయాబెటిస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు:

మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ అల్పాహారానికి ముందు ఉడకబెట్టిన వేరుశెనగలను కాస్త తినండి. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది అవసరమైన అన్ని పోషకాలు కూడా లభిస్తాయి.

మెదడు ఆరోగ్యం:

వేరుశెనగలో మంచి మొత్తంలో ఫోలేట్, నియాసిన్ ఉంటాయి. దీనివల్ల మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫోలేట్, నియాసిన్ పోషకాలు మెదడు అభిజ్ఞా పనితీరు, నాడీ వ్యవస్థకు సహాయపడతాయి.

ఉడికించినవే మేలు:

కాల్చిన వేరుశెనగ కంటే ఉడికించిన వేరుశెనగలో ఎక్కువ ఫైబర్, అవసరమైన పోషకాలు ఉంటాయి. కాల్చడం కంటే ఉడకబెట్టడం వల్ల పోషక నష్టం కూడా తక్కువుంటుంది.

వీళ్లు వద్దు:

పేగు సంబంధిత సమస్యలు, ఉబ్బరం సమస్యలు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఉడకబెట్టిన వేరుశెనగలు తినకపోవడమే మంచిది.

Whats_app_banner