Belly Fat Reduce Tips | పొట్టను ఎలా తగ్గించాలి? నిపుణులు సూచించిన మార్గాలు ఇవిగో!
Belly Fat Reduce Tips: పెరిగిన పొట్టతో అనేక దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి న్యూట్రిషనిస్టులు ఇచ్చిన సలహాలు చూడండి.
Belly Fat Reduce Tips: పొట్ట భాగంలో కొవ్వు పెరగడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది ఒకరి రూపాన్ని, శరీరాకృతిని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగా అనేక దుష్ప్రభాలను కలిగిస్తుంది. ఈరోజుల్లో చాలా మంది యుక్తవయసు ఉన్నవారు కూడా పెరిగిన పొట్టతో ఇబ్బందిపడుతునన్నారు, ముందుకు పెరుగుతూపోతున్న పొట్టకు అడ్డుకట్ట వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన ఫలితాలు రావడం లేదు. కొంతమంది సన్నగా, స్లిమ్‌గా ఉన్నప్పటికీ, పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇలా ఉండటం ద్వారా నడుము చుట్టుకొలత పెరుగుతుంది. సన్నగా ఉండి, అధిక బరువు లేనప్పటికీ కూడా పెరిగిన పొట్టతో ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని ద్వారా హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, కాలేయ వ్యాధి, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే పొట్టభాగంలో కొవ్వును కరిగించటమే ఏకైక మార్గం. ఆరోగ్యకరమైన జీవనశైలి చర్యలను అనుసరించడం ద్వారా నెమ్మదిగా, స్థిరంగా పొట్టను తగ్గించుకోవచ్చు. మీ నిద్రవేళలను సవరించడం, పోషకాహారమైన అల్పాహారం తీసుకోవడం, ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామం చేయడం వంటి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
ఫరీదాబాద్‌లోని అమృతా హాస్పిటల్‌లోని చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అయిన డాక్టర్ చారు దువా హెచ్‌టి డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోడానికి కొన్ని సూచనలు, జీవనశైలి మార్పుల గురించి తెలియజేశారు.
పొట్ట భాగంలో కొవ్వును ఎలా తగ్గించాలి?
1. డెజర్ట్‌లు, స్వీట్లు, ఎరేటెడ్ పానీయాలు, స్క్వాష్‌లు, కుకీలు, క్యాండీలు, కేకులు మొదలైన చక్కెర కలిగిన ఉత్పత్తులను తగ్గించండి.
2. ప్రాసెస్ చేసినవి, ఫాస్ట్ ఫుడ్ ఆహారాలను తగ్గించండి. సమయం కాని సమయంలో ఆకలి వేధిస్తే అనారోగ్యకరమైన చిరుతిండ్లు తినడానికి బదులుగా మఖానా, పండ్లు లేదా పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని తీసుకోండి.
3. సాధారణ కార్బోహైడ్రేట్లను తగ్గించండి. బ్రెడ్, బిస్కెట్లు, వైట్ రైస్, మైదా ఉత్పత్తులు, బంగాళదుంపలకు దూరంగా ఉండాలి. తృణధాన్యాలు, పీచు పదార్థాలు, చక్కెర తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినండి.
4. ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. మీ ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సలాడ్లు ఉండేలా చూసుకోండి. ఇవి మీ ఆకలిని తీర్చడంతో పాటు, మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి.
5. పప్పులు, టోఫు, చికెన్, తక్కువ కొవ్వు కలిగిన పాలు మొదలైన ఆరోగ్యకరమైన పలుచటి ప్రోటీన్లను మీ ఆహారంలో చేర్చుకోండి.
6. అల్పాహారం అస్సలు మానేయకండి. ప్రతిరోజూ మీ అల్పాహారంలో ప్రోటీన్లు, తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోండి.
7. ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా తినండి. ఆవనూనె వాడండి, గింజలు, చేపలు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోండి.
8. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి; చురుకైన నడక, సైక్లింగ్, స్విమ్మింగ్, జుంబా, ఏరోబిక్స్, స్పోర్ట్స్ వంటి కార్డియో వ్యాయామం చేయండి. అదనంగా కడుపు వద్ద కండరాలను బిగించగలిగే వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. యోగా ప్రయత్నించండి, ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయండి.
9. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవండి, ఉదయం ఎండలో కాసేపు ఉండండి. ఈ అలవాటు మీ నిద్ర చక్రాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ అలవాట్లు కలిగి ఉండటం ద్వారా మీరు చాలా తర్వగా పొట్టను తగ్గించుకోవచ్చు. తగ్గిన పొట్ట మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇవే నియమాలను ప్రతిరోజూ అనుసరించాలి.
సంబంధిత కథనం
టాపిక్