Beetroot Idli: బీట్రూట్ ఇడ్లీ ఇలా చేశారంటే ఆరోగ్యంతో పాటూ ఎంతో రుచి కూడా-beetroot idli recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Idli: బీట్రూట్ ఇడ్లీ ఇలా చేశారంటే ఆరోగ్యంతో పాటూ ఎంతో రుచి కూడా

Beetroot Idli: బీట్రూట్ ఇడ్లీ ఇలా చేశారంటే ఆరోగ్యంతో పాటూ ఎంతో రుచి కూడా

Haritha Chappa HT Telugu
Mar 27, 2024 06:00 AM IST

Beetroot Idli: బీట్రూట్ ఇడ్లీలు చూడడానికి అప్పుడే విరిసిన గులాబీ పువ్వుల్లా ఉంటాయి. ఈ గులాబీ రంగు ఇడ్లీలను చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా.

బీట్రూట్ ఇడ్లీ రెసిపీ
బీట్రూట్ ఇడ్లీ రెసిపీ

Beetroot Idli: బీట్రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. బీట్రూట్ ను ఇడ్లీలుగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకు బీట్రూట్ ఇడ్లీ తినిపించడం వల్ల ఎన్నో పోషకాలను అందించిన వారు అవుతారు. దీన్ని వీటిని చేయడం కూడా చాలా సులువు. బీట్రూట్ ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బీట్రూట్ ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం - రెండు కప్పులు

మినప్పప్పు - ఒక కప్పు

బీట్రూట్ - ఒకటి

నెయ్యి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

బీట్రూట్ ఇడ్లీ రెసిపీ

1. బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టండి.

2. అవి బాగా నానాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి.

3. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే గిన్నెలో వేసి రాత్రంతా పులియబెట్టండి.

4. ఉదయం లేచాక తాజా బీట్రూట్ ని తీసుకొని పైన తొక్కను తీసేయండి.

5. చిన్న ముక్కలుగా కోసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.

6. ఆ పేస్ట్ ను రాత్రంతా పులియబెట్టిన మిశ్రమంలో వేసి బాగా కలపండి.

7. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి.

8. ఒక అరగంట పక్కన పెట్టుకోండి. మీకు బీట్రూట్ పచ్చివాసన వస్తుంది అనిపిస్తే... బీట్రూట్‌ను ముక్కలుగా కోసి నూనెలో కాసేపు వేయించి తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకుని కలుపుకోవచ్చు. అది మీ ఇష్టమే.

9. ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ అయ్యాక ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి లేదా నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోండి.

10. ఓ పావు గంట సేపు ఆవిరి మీద ఉడికిస్తే ఇడ్లీలు రెడీ అయిపోతాయి.

11. ఇవి పింక్ రంగులో విచ్చుకున్న గులాబీలు ఉంటాయి.

12. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బీట్రూట్ ఇడ్లీతో కొబ్బరి చట్నీ జతగా ఉంటే ఆ రుచే వేరు.

మనం తినే అన్ని కూరగాయలతో పోలిస్తే బీట్రూట్ ఎంతో ఆరోగ్యకరమైనది. కానీ దీన్ని తినేందుకు చాలా మంది కష్టపడతారు. కారణం ఇది పచ్చివాసన రావడం. దీన్ని ఎలా వండినా పెద్దగా టేస్ట్ అనిపించదు. అందుకోసమే బీట్రూట్ తినే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ శరీరంలో రక్తహీనత సమస్య ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన వాటిల్లో బీట్రూట్ ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. చర్మ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బీట్రూట్ ను ఇంటిల్లిపాది వారానికి కనీసం రెండు మూడు సార్లు తినాలి. ముఖ్యంగా రక్తహీనత సమస్య మహిళల్లో, పిల్లల్లో అధికంగా ఉంటుంది. కాబట్టి వారానికి కనీసం మీరు నాలుగు సార్లు బీట్రూట్ తినడం ద్వారా ఆ సమస్య నుంచి తప్పించుకోగలరు. నేరుగా తినడం కష్టం అనుకుంటే ఇలా బీట్రూట్ ఇడ్లీ లేదా బీట్రూట్ దోశ వంటివి చేసుకొని తింటే మంచిది. ఎలాగైనా బీట్రూట్ శరీరంలో చేరడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి.

అలా అని ప్రతి రోజు బీట్రూట్ ను తినవద్దు. ఎందుకంటే వీటిలో ఆక్సలైట్లు ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజూ బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళు ఉంటారు. అయితే అరగ్లాసు బీట్రూట్ జ్యూస్ లో అర గ్లాసు నీళ్లు కలుపుకొని తాగడం చాలా మంచిది. ప్రతిరోజు తాగే కన్నా రెండు మూడు రోజులకు ఒకసారి తాగితే మంచిది.

టాపిక్