దంతాలు జివ్వుమని లాగుతున్నాయా? కాల్షియం లోపం కావొచ్చు.. ఆయుర్వేద సలహా ఇదీ!
దంతాలలో నరాలు జివ్వుమని లాగితే అది కాల్షియం సమస్య కావొచ్చు. కాల్షియం లోపం కారణంగా ఎముకలు, దంతాలలో సమస్యలు ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా ఇంకా ఎన్నో నష్టాలుంటాయి, కాల్షియం సహజంగా లభించే వనరులు ఇక్కడ అందిస్తున్నాం.
మన శరీరానికి కాల్షియం ఎంతో అవసరం. ముఖ్యంగా ఎముకల ధృడత్వానికి, ఆరోగ్యమైన దంతాల కోసం కాల్షియం అనే మినరల్ కచ్చితంగా అవసరం అవుతుంది. ఇదేకాకుండా రక్తం గడ్డకట్టడం, హృదయ- స్పందనలు, నరాల పనితీరు తదితర విధుల్లో కూడా కాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపం పిల్లల్లో, పెద్దల్లో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరం బలహీనంగా మారినట్లు అనిపించటం, అలసట, దంత సమస్యలు, పొడి చర్మం, కండరాల్లో తిమ్మిరి లాంటి సమస్యలు ఉంటాయి.
అలాగే థైరాయిడ్, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, పేగు వ్యాధులు, హార్మోన్ల సమస్యలు, హెచ్‌ఆర్‌టి (హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ)తో బాధపడుతున్న వ్యక్తుల్లో కూడా కాల్షియం స్థాయిలు తక్కువగా ఉంటున్నట్లు మెడికల్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.
నెలసరి సమయంలో మహిళలు కాల్షియం లోపంతో బాధపడుతున్నారు అని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్‌సర్ పేర్కొన్నారు. కొన్నిసార్లు విటమిన్ D లోపం వలన కూడా అది కాల్షియం శోషణ జరగనీయకుండా అడ్డుకుంటుందని తెలిపారు.ఆయుర్వేదం ప్రకారం కాల్షియం సహజంగా లభించే 4 వనరులను సూచించారు.
వాటిని ఆహారంతో పాటు స్వీకరించడం ద్వారా శరీరానికి తగిన కాల్షియం లభిస్తుంది. తద్వారా పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.
డాక్టర్ దీక్షా భావ్సర్ ప్రకారం, కాల్షియం పుష్కలంగా లభించే 4 సహజ వనరులు:
1. ఉసిరి
ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ , కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఉసిరిని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. నేరుగా పండులాగా తినేయవచ్చు, రసం తాగొచ్చు, పొడిలాగా మార్చుకొని తినొచ్చు, షర్బత్ లాగా తయారుచేసుకోవచ్చు.
అయితే, ఉసిరి రుచిలో పుల్లగా ఉంటుంది కాబట్టి కీళ్ల నొప్పులు, కడుపునొప్పులు ఉన్నవారికి దీనిని సిఫారసు చేయడం లేదు. వైద్యుల సలహా తీసుకొని ఉపయోగించాల్సి ఉంటుంది.
2. మోరింగా
దీనినే మునగ చెట్టు అంటారు. మునగ ఆకులలో కాల్షియం, ఐరన్, విటమిన్లు ఎ, సి ఇంకా మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1 స్పూన్ మునగ ఆకుల చూర్ణం తీసుకోండి. అయితే మునగాకులు వేడి చేస్తాయి. కాబట్టి ఎవరి శరీరం వేడిగా ఉంటుందో వారు తీసుకోకండి.
3. నువ్వులు
సుమారు 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేడి, చేసి ఒక టీస్పూన్ బెల్లం, నెయ్యితో కలపండి. ఈ మిశ్రమాన్ని లడ్డూల లాగా చుట్టుకొని రోజూ ఓ మోతాదు ప్రకారం తీసుకోండి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఏవైనా ఉపయోగించవచ్చు. ఈ నువ్వుల ఉండల తినడం ద్వారా శరీరంలో కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి.
4. పాలు
పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలు తాగడం ద్వారా శరీరానికి సులభంగా కాల్షియం అందుతుంది. ఒక గ్లాసు స్వచ్ఛమైన పాలలో కాల్షియం స్థాయి 8.5 నుండి 10.2 mg/dl వరకు కాల్షియం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాస్ తాగటం ద్వారా కాల్షియం లోపం తలెత్తదు.
సంబంధిత కథనం