Friday Motivation: మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు, మీరు బలవంతులో, బలహీనులో మీరే తెలుసుకోండి
Friday Motivation: మన ఆలోచనలే మనలని బలవంతులుగా మారుస్తాయి. అవే ఆలోచనలు మనల్ని బలహీనులుగా కూడా మారుస్తాయి. మీరు ఎలా ఆలోచిస్తే మీరు అలా తయారవుతారు.
Friday Motivation: జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం... తాము బలహీనులమని భావించడమే. గెలవాలన్న ఆశలేని వాడు ఆటకు ముందే ఓడిపోతాడు. అతడే బలహీనుడు. వెనుక ఏముందో, ముందు ఏముందో అనేది ఆలోచించడం మానేయండి. మీలో ఏముందో అదే ముఖ్యం. మీలో భయం ఉంటే మీరు బలహీనులుగా మారుతారు. ధైర్యం ఉంటే శక్తివంతులుగా అవుతారు.
దేనికైతే నువ్వు భయపడకుండా అడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఆ సమస్యకు ఎదురెళ్ళి చూడండి మీలో ఉన్న భయం మాయమైపోతుంది. మీలో ఉన్న శక్తిమంతుడు బయటికి వస్తాడు. మీలో ఉన్న శక్తిని బయట పెట్టే అవకాశం మీ మీకే ఉంది. పర్వతాన్ని చూసి భయపడితే మీరు బలహీనులుగా ఉండిపోతారు, ఒక్కసారి పర్వతం ఎక్కి చూడండి అది మీ పాదాల కిందనే కనిపిస్తుంది.
ప్రశ్నించినదే దేనికీ సమాధానం దొరకదు, ప్రయత్నించినదే కోరుకున్నది ఏదీ దక్కదు. అలాగే ధైర్యంగా ముందడుగు వేయనదే.. మీరు ఏది సాధించలేరు. మిమ్మల్ని వెంటాడే భయాన్ని వీడి మీరే దూరంగా పరిగెట్టాలి.
తన మీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులు. సందేహాలతో సతమతమవుతూ ఏ పని చేయకుండా కూర్చునే వారు బలహీనులు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు. బలవంతులు మాత్రం ప్రతి విషయాన్ని సహిస్తూ మౌనంగా ఉంటారు. తమ పని తాము చేసుకొని చివరికి విజేతగా మిగులుతారు.
మీరు ఏదైనా తప్పు చేస్తే ధైర్యంగా క్షమాపణ కోరండి. అందులో చిన్నతనం ఏమీ లేదు, చేసిన తప్పుక క్షమాపణ కోరేవాడు ధైర్యవంతుడుతో సమానం. ఇతరులు తప్పును క్షమించగలిగేవాడు బలవంతులు. మీరు ధైర్యవంతుడిగా, బలవంతుడిగా జీవించాలనుకుంటే ఆ లక్షణాలను అలవర్చుకోండి.
బలహీనులు అంటే విమర్శలు తీసుకోలేని వారు... పొగడ్తలకు పొంగిపోయేవారు. వారంతా మానసిక బలహీనుల కిందకే వస్తారు. విమర్శలను తట్టుకుంటూ, పొగడ్తలకు పొంగిపోకుండా ముందుకు సాగిపోయే వాడే నిజమైన బలవంతులు. మీకు మీరే బలహీనులుగా భావిస్తే ఇతరుల దృష్టిలో మీరు మరింత బలహీనంగా మారిపోతారు. మీ మీద మీకు నమ్మకం ఉంటే తప్పకుండా మీ బలహీనతే బలంగా మారి విజయం సాధిస్తుంది.
చిన్న విషయాలకు అతిగా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు. వారు స్వచ్ఛమైన మనసు గలవారు. గుండెల్లో బాధను దాచుకోలేక, బయటపడే వారిని బలహీనులనుకుంటే అది మీ భ్రమ. మీరు ఊహించినంత బలం వారిలో దాగి ఉంటుంది. వారి బలాన్ని వారి స్వచ్ఛమైన మనసు అధిగమిస్తుంది.
బలహీనులని భావించి ఏ వ్యక్తినీ చిత్తు కాగితంలా చూడకండి, రేపు ఆ కాగితం గాలిపటంలా మారి అంత ఎత్తుకు ఎగరొచ్చు. దాన్ని చూసేందుకు మీరు తల బాగా ఎత్తాల్సివస్తుంది. అందుకే ఉన్నంతలో ప్రతి వ్యక్తితో మర్యాదగా, మానవత్వంగా ప్రవర్తించడం ఎంతో ముఖ్యం. అలాగే మీలో ఉన్న బలహీనతను దూరం చేసుకుని ధైర్యంగా జీవించండి.