Art of apologizing: మీ బంధం బలంగా ఉండాలంటే ఈ 5 క్షమాపణ భాషలు నేర్చుకోండి
Art of apologizing: బంధం బలంగా ఉండాలంటే మీరు తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పడం తెలిసి ఉండాలి. 5 రకాల క్షమాపణలు ఇక్కడ చూడండి.
క్షమాపణ కోరేందుకు కూడా ఐదు భాషలు ఉన్నాయని మీకు తెలుసా? భిన్నమైన ప్రేమ భాషలు ఉన్నట్టే క్షమాపణలు కోరేందుకూ భిన్నమైన క్షమాపణ భాషలు ఉన్నాయి. మనం తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పడంలో ఎలాంటి తప్పూ లేదు. నిజానికి బంధం ముడివడే వరకు నిరీక్షణ, తిరస్కారాలు, ఏ ఫీలింగ్ అయినా మధురంగానే ఉంటుంది. ఒకసారి బంధం ముడివడ్డాక భాగస్వామిని అర్థం చేసుకున్నప్పుడు వారు చేసే పొరపాట్లను, తప్పులను తేలిగ్గా వదిలేస్తాం. ఎందుకంటే మనకు ఆ బంధం ముఖ్యమనుకున్నప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ భాగస్వామిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నప్పుడు వారి ఇంటర్‌ప్రిటేషన్ వేరేగా ఉంటుంది. ఇక భాగస్వామి క్షమాపణలు కోరి తిరిగి తమ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు నానాపాట్లు పడాల్సి వస్తుంది. అయినా ఆ బంధం నిలుస్తుందని గ్యారంటీ లేదు. ఇలాంటప్పుడు క్షమాపణ భాషలు పనికొస్తాయి.
ఏ బంధంలోనైనా క్షమాపణలు కోరడం అది ఆరోగ్యకరమైన బంధానికి సంకేతంగా భావించవచ్చు. అది మీ రొమాంటిక్ పార్ట్‌నర్ కావొచ్చు, స్నేహితుడు కావొచ్చు, లేదా కుటుంబ సభ్యుడు కావొచ్చు. మీ భాగస్వామి చెబుతున్న క్షమాపణల భాషను అర్థం చేసుకుంటే మీరు వారిని పూర్తిగా వినేందుకు, అర్థం చేసుకునేందుకు, బంధం మరింత బలపడేందుకు దోహదపడుతుంది. అందువల్ల మీరు క్షమాపణ చెబుతున్నా, క్షమాపణ స్వీకరిస్తున్నా ఈ క్షమాపణ భాషను తెలుసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. అప్పుడే మీ బంధం గట్టిగా నిలబడుతుంది.
రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్, థెరపిస్ట్ జోర్డాన్ గ్రీన్ క్షమాపణకు సంబంధించిన 5 భాషలను తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పంచుకున్నారు.
1. Expressing regret: విచారం వ్యక్తం చేయడం
ఈ రకమైన క్షమాపణలో "నన్ను క్షమించండి" అనే పదాలను వారికి వినిపించడం అవసరం. మీ మాటలు లేదా ప్రవర్తన వారిని బాధించినప్పుడు మీరు భావోద్వేగ భాషను ఉపయోగించాలి. మీరు దేని గురించి చింతిస్తున్నారో అవతలి వ్యక్తికి వివరించాలి. మీరు వారిని ఎంతగా బాధించారో మీరు అర్థం చేసుకున్నారని వ్యక్తికి తెలియజేయాలి. మీరు వారిని బాధపెట్టిన అన్ని సందర్భాలను గుర్తు చేయొచ్చు. కోపం, బాధ, వంటి భావాలను అనుభవించే హక్కు వారికి ఉందని వారికి చెప్పాలి. మీరు విచారం వ్యక్తంచేస్తున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ మీ మాటలకు తగ్గట్టుగా ఉండాలి. మీ స్వరం, మీరు ఎంత బిగ్గరగా మాట్లాడుతున్నారు, మీ బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్నింటిలో మీ విచారం కనిపించాలి.
2. Accepting responsibility: బాధ్యతను అంగీకరించడం
క్షమాపణ చెప్పాలంటే మీరు చేసిన దానికి బాధ్యత వహించాలి. మీ ప్రవర్తన తప్పు అని అంగీకరించాలి. ఈ రకమైన క్షమాపణ ఈ పదాలతో ప్రారంభమవ్వాలి. "తప్పు", అలా ఎందుకు జరిగింది అనే వివరణ ఉండాలి. చేసిన తప్పును సమర్థించుకోవడం ఆపాలి. భాగస్వామిని నిందించడం మానుకోవాలి. బాధ్యతను స్వీకరించడానికి మెచ్యూరిటీ అవసరం. బాధ కలిగించినందుకు బాధ్యత వహించడాన్ని ఈ రకమైన క్షమాపణ సూచిస్తుంది.
3. Making restitution: కోల్పోయిందాన్ని భర్తీ చేయడం
ఈ క్షమాపణ భాష "సరిదిద్దడానికి" లేదా చర్య ద్వారా జరిగిన తప్పును సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే మీరు మీ భాగస్వామిని బాధపెట్టిన మార్గాలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మీరు వారిని ప్రేమిస్తున్నారని, క్షమాపణ కోరుతున్నారని వారికి చూపించడానికి మీరు మీ ప్రవర్తన ద్వారా చూపాల్సి ఉంటుంది. క్షమాపణ లేఖ రాయవచ్చు. అవతలి వ్యక్తి కోసం ఆలోచనాత్మకమైన లేదా సహాయకరమైన పనులను చేయవచ్చు.
4. Genuinely repenting: నిజంగా పశ్చాత్తాపం చెందడం
ఈ క్షమాపణ భాషకి మీ ప్రవర్తనను మార్చుకోవాలనే కోరికను వ్యక్తపరచడం, తప్పు మళ్లీ జరగకుండా ఒక ప్రణాళికను రూపొందించడం అవసరం.
నిజమైన పశ్చాత్తాపం అంటే:
• ప్రవర్తన మార్చుకుంటున్నట్టు మీ ఉద్దేశాన్ని తెలియజేయడం.
• మీరు వారిని మళ్లీ బాధపెట్టకూడదనే భావాన్ని వ్యక్తం చేయడం.
• మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారని వారికి చూపడం.
• అలా మళ్లీ జరగకుండా ఆపడానికి మార్గాలను కనుగొనడం.
• ఆపై ప్రణాళికను అమలు చేయడం.
• ప్రవర్తన పునరావృతం కాకుండా నిజమైన ప్రయత్నాలు చేయడం.
• మీరు విఫలమైతే ఏమి చేయాలో ఒక ప్రణాళికను రూపొందించడం.
5. Requesting forgiveness: నన్ను క్షమిస్తావా?
మనం క్షమాపణ కోరుతున్నామని అవతలి వ్యక్తికి తెలుసని అనుకుంటాం. కానీ క్షమాపణ చెప్పడం వెనక మీ బంధం బీటలు వారకుండా చూసుకోవడం, దానిని నిలబెట్టుకునేలా చూసుకోవడం అనే భావన ఉందని చెప్పాలంటే ‘నన్ను క్షమిస్తావా?’ అని అభ్యర్థించడం మరొక క్షమాపణ భాష. మీ బంధం గురించి మీకు ఉన్న శ్రద్ధ దీనిలో తెలుస్తుంది. మీరు చేసిన తప్పు మీకు తెలిసినప్పుడు, అది బంధానికి అడ్డంకిగా మారినప్పుడు ఈ భాష ఉపయోగించండి.
సంబంధిత కథనం