Inter Results 2024 : పరీక్షలు పోతే మళ్లీ రాసుకోవచ్చు.. కానీ జీవితమే పోతే మళ్లీ తిరిగిరాదు-ap inter results 2024 dont take foolish decisions after exams results your parents will suffer life time ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Inter Results 2024 : పరీక్షలు పోతే మళ్లీ రాసుకోవచ్చు.. కానీ జీవితమే పోతే మళ్లీ తిరిగిరాదు

Inter Results 2024 : పరీక్షలు పోతే మళ్లీ రాసుకోవచ్చు.. కానీ జీవితమే పోతే మళ్లీ తిరిగిరాదు

Anand Sai HT Telugu
Apr 12, 2024 09:51 AM IST

AP Inter Results 2024 : జీవితంలో పరీక్షలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబాన్ని అంతా కష్టాల్లోకి నెట్టేస్తాయి.

ఏపీ ఇంటర్ ఫలితాలు
ఏపీ ఇంటర్ ఫలితాలు (Unsplash)

ఈ మధ్య కాలంలో పరీక్షల్లో తప్పితే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చాలా మందిలో కనిపిస్తుంది. అవి కేవలం పరీక్షలు మాత్రమే జీవితాన్ని నిర్ణయించే మార్కులు కాదు. అసలు జీవితానికి మార్కులు కొలమానమే కాదు. ఎందుకంటే పరీక్షల్లో ఫెయిల్ అయి జీవితంలో సక్సెస్ అయినవారు చాలా మంది ఉన్నారు. గొప్ప గొప్ప వారు అంతా ఏదో ఒకరోజు పరీక్షల్లో ఫెయిల్ అయినవారే. ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో కాదు. పరీక్షల్లోనే.

ఏపీ ఇంటర్ ఫలితాలు వస్తున్నాయి. చాలా మంది విద్యార్థులు ఈ విషయంలో ఒత్తిడితో ఉంటారు. అయ్యో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి.. ఫెయిల్ అయ్యాను అని ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ పరీక్షల్లో తప్పితే ఏం కాదు. అసలు నిజానికి పరీక్షల్లో తప్పిన వారికే జీవితంలో ఏం చేయాలనే కసి పెరుగుతుంది. అది చాలా చిన్న విషయం. దానికోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీ అమ్మానాన్నలకు మీరు ఒక్కరే.

మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివించి ఉంటారు. వాళ్ల చెమటతో తయారైన జీవితం మీది. ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి వారి కష్టాన్ని గుర్తుచేసుకోండి. వారి కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. అప్పుడు మీ నిర్ణయం మారుతుంది. మీకు ఏదైనా అయితే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది తల్లిదండ్రులే. అదే మీరు చెడు నిర్ణయాలు తీసుకుంటే వాళ్లు జీవితాంతం కుంగిపోతారు. మానసికంగా, శారీరకంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, ప్రేమలోనో.. పరీక్షలోనే ఫెయిలయ్యామని అర్ధాంతరంగా అంతం చేసేందుకా ఈ జీవితం? మన పుట్టుకే ఓ విజయం అయినప్పుడు మధ్యలో వచ్చే ఈ సమస్యలెంత? జీవితమంతైతే కాదు కదా..

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని తప్పుడు నిర్ణయాలు జోలికి వెళ్లవద్దు.. పరీక్షలు మళ్లీ వస్తాయి.. పోతాయి.. కానీ నీలాంటి కొడుకు లేదా కూతురును నిన్ను కన్న తల్లిదండ్రులకు ఎవరూ తెచ్చి ఇవ్వలేరు. ఒక్కసారి ఆలోచించండి..

అందుకే పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ రాసుకోవచ్చు. ఏం కాదు. కాస్త కష్టపడాలి అంతే. జీవితంలో చూడాల్సిన విజయాలు చాలా ఉంటాయి. వాటి కోసం ప్రణాళికలు వేసుకోండి. చదువుకుంటే మంచి జీవితం దొరుకుతుంది. అయితే చదువులేకపోయినా జీవితం ఉంటుంది. ఏదో ఒక పని చేసి బతకొచ్చు. కానీ జీవితాన్ని ముగిస్తే మాత్రం మీ అంత మూర్ఖులు ఉండరు.

జీవితం అనే ప్రయాణంలో కష్టాలు కామన్. ఒడ్డుకు చేరే వరకూ ప్రయాణం ఆపకూడదు. ఆపితే కిందపడిపోతావ్. మళ్లీ తిరిగిలేవలన్నా లేవలేం. మనిషి పుట్టుకే ఓ వరం. అలాంటి వరాన్ని సరిగా వాడుకోవాలి. తప్పుడు నిర్ణయాలతో ముగించకూడదు. ఏదో ఒక రోజు మీరు గొప్పస్థాయికి వెళ్తారు. దానికి మీ ఆలోచనలే పెట్టుబడి. పరీక్షల్లో ఫెయిల్ అయినా.. తక్కువ మార్కులు వచ్చినా.. ఏం పర్లేదు. మళ్లీ రాసుకోవచ్చు. కానీ మీ జీవితమనే పుస్తకంపై ఎల్లప్పుడూ సంతకం మీదే ఉండాలి. ఇతరులు చేయలేరు.

పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలా మంది నెక్ట్స్ ఏంటి అనే ఆలోచనలతో సతమతమవుతారు. ఈ కాలంలో సమాచారం వెతికేందుకు చాలా దారులు ఉన్నాయి. మీరు తర్వాత ఏం చేయాలి, మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయంపై క్లారిటీ తెచ్చుకోండి. ఎలాంటి కోర్సుల్లో చేరితే ఎలాంటి భవిష్యత్ ఉంటుందనే విషయంపై పరిశోధించండి. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి.

WhatsApp channel