Tuesday Motivation : పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు.. ఈ రియల్ స్టోరీ చదవండి-every student must read this 12th fail to ips officer manoj kumar story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Every Student Must Read This 12th Fail To Ips Officer Manoj Kumar Story

Tuesday Motivation : పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు.. ఈ రియల్ స్టోరీ చదవండి

Anand Sai HT Telugu
Mar 05, 2024 05:00 AM IST

Tuesday Motivation : ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. కారణం పరీక్షలో ఫెయిల్ అవ్వడం. కానీ పరీక్షలో ఫెయిల్ అయి జీవితంలో ఎన్నో విజయాలు సాధించినవారు కూడా ఉన్నారు.

మనోజ్ కుమార్ శర్మ సక్సెస్ స్టోరీ
మనోజ్ కుమార్ శర్మ సక్సెస్ స్టోరీ (Unsplash)

12th ఫెయిల్ సినిమా కొన్ని రోజుల కిందట విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా మంచి స్పందన వచ్చింది. కారణం ఇది IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, IRS ఆఫీసర్ శ్రద్ధా జోషి నిజమైన కథ. నిజానికి ఇది చాలా స్ఫూర్తిదాయకమైన కథ. 12వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి జీవితంలో ఎలా విజయం సాధించాడనే చూపించిన నిజమైన కథ ఇది.

పరీక్షలో ఫెయిల్ అయ్యి జీవితంలో విజయం సాధించిన ఐపీఎస్ ఆఫీసర్ నిజ జీవిత కథ. ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోతామేమోనని కొందరు ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఫెయిల్ అయినా కూడా జీవితంలో విజయం సాధించొచ్చని మనోజ్ కుమార్ శర్మ నిరూపించారు. ఈ కథ విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం. 12వ తరగతిలో హిందీ మినహా అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిన ఆయన ఈరోజు IPS అధికారి. కృషి, పట్టుదలే ఇందుకు కారణం.

1977లో జన్మించిన మనోజ్ కుమార్ శర్మ మధ్యప్రదేశ్‌లోని బిల్‌గావ్ అనే చిన్న గ్రామంలో పెరిగారు. వారిది పేద కుటుంబం. చదువుకునే రోజుల్లో మనోజ్ కుమార్ శర్మ చురుకైన విద్యార్థి కాదు. 10వ తరగతి పాసయ్యాడు. కష్టపడి 11వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు, కానీ 12వ తరగతిలో వెనుకబడి.. హిందీ మినహా మిగతా సబ్జెక్టులన్నింటిలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత రీ ఎగ్జామినేషన్‌లో మిగిలిన సబ్జెక్టులను క్లియర్ చేశాడు.

తన జీవితంలోని ప్రతి దశలో సవాళ్లను ఎదుర్కొన్నాడు మనోజ్ కుమార్. పట్టుదలతో ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. చదువుకు డబ్బులు లేక టెంపో డ్రైవర్‌గా పనిచేయడం, లైబ్రరీలో పని చేయడం, కొంత మంది ధనవంతుల కుక్కలను తీసుకెళ్లడం, ఇలా ఏ పనైనా చేశాడు. చదువు కోసం చాలా కష్టపడ్డాడు. రోడ్డు పక్కన బిచ్చగాళ్లలా పడుకునేవాడు. తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు.

మనోజ్ కుమార్ ప్రేమకథ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. UPSC కోచింగ్ సమయంలో ఉత్తరాఖండ్‌కి చెందిన శ్రద్ధా జోషిని కలుసుకున్నాడు. జోషి ఇప్పుడు IRS అధికారిగా పనిచేస్తున్నారు. మనోజ్ ఎలాంటి కోచింగ్ లేకుండానే ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణుడయ్యాడని తెలిసి ఇంప్రెస్ అయ్యారు జోషి. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరికొకరు సపోర్టు చేసుకుంటూ ప్రేమలో పడ్డారు. మనోజ్ ఐపీఎస్ అధికారి అయిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మనోజ్ కుమార్ శర్మ ఊరు.. బందిపోట్లు ఎక్కువగా ఉండే.. మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయకు సమీపంలో ఉంది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి.. ఎవరు ఊహించని విధంగా ఎదిగిన మనోజ్ కుమార్ శర్మ జీవితం అందరికీ ఆదర్శం.

చదువుతున్న ప్రతి పిల్లాడికి మనోజ్ కుమార్ కథ తెలియాలి. ఫెయిల్ అయితే జీవితం అయిపోయినట్టు అనుకునే చాలా మంది తెలుసుకోవాలి. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. జీవితంలో విజయం సాధించొచ్చు. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఉంటే.. ఏదైనా అందుకోవచ్చు. ఇందుకు మనోజ్ కుమార్ శర్మ జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓటమి చూస్తేనే గెలుపు విలువ తెలుస్తుంది.