Food for weight loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. తాజా స్టడీ మాట ఇదీ
Food for weight loss: బరువు తగ్గాలనుకునే వారికి సౌత్ ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఒక శుభవార్త తెచ్చింది.
బరువు తగ్గడం చాలా కష్టమైన పని. అయితే సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం చేసిన కొత్త పరిశోధన బరువు తగ్గాలనుకునే వారికి ఒక శుభవార్త చెప్పింది. రోజూ కొన్ని బాదంపప్పులు తినడం వల్ల అది మీ బరువు తగ్గే ప్రయత్నాలకు సాయంగా ఉంటుందట.
బాదం మానవుల ఆకలిని ఎలా మారుస్తుందో అధ్యయనం చేసిన పరిశోధకులు రోజూ 30-50 గ్రాముల బాదంపప్పులు తింటే తక్కువ కేలరీల ఆహారం తీసుకునేలా అవి ప్రోత్సహిస్తాయని ఈ అధ్యయనం తేల్చింది.
యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఆసక్తికర విషయాలు పంచుకుంది. కార్బోహైడ్రేట్‌తో కూడిన చిరుతిండికి బదులుగా అంతే శక్తినిచ్చే బాదంపప్పులు తిన్న వారు తర్వాతి భోజనంలో వారి శక్తి వినియోగాన్ని 300 కిలోజౌల్స్‌కు తగ్గించారని తేల్చింది.
యూఎన్ఐఎస్ఏ అలయన్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎక్సర్‌సైజ్ న్యూట్రిషన్ అండ్ యాక్టివిటీ (ఎరీనా) నుండి డాక్టర్ షరయా కార్టర్ ఈ పరిశోధన వెయిట్ మేనేజ్మెంట్‌లో విలువైన ఇన్‌సైట్స్ అందిస్తుందని చెప్పారు.
‘అధిక బరువు, ఊబకాయం ప్రధాన ప్రజారోగ్య సమస్యలు. మెరుగైన హార్మోన్ల ప్రతిస్పందన ద్వారా ఆకలిని మాడ్యులేట్ చేయడం వెయిట్ మేనేజ్మెంట్‌ను ప్రోత్సహించడంలో కీలకం కావొచ్చు’ అని డాక్టర్ కార్టర్ చెప్పారు.
‘మా పరిశోధన ఆకలిని నియంత్రించే హార్మోన్లను పరిశీలించింది. నట్స్.. ప్రత్యేకంగా బాదాం గింజలు ఆకలి నియంత్రణకు ఎలా దోహదపడతాయో పరిశీలించింది..’ అని చెప్పారు.
‘బాదం పప్పులు తిన్న వ్యక్తులు వారి ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులను గమనించారు. ఇవి ఆహారం తీసుకోవడం తగ్గడానికి దోహదం చేసి ఉంటాయని మేం కనుగొన్నాం..’ అని చెప్పారు.
ఆస్ట్రేలియాలో 12.5 మిలియన్ల మంది వయోజనులు, లేదా ప్రతి ముగ్గురిలో ఇద్దరు అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 650 మిలియన్ల మంది ఊబకాయంతో ఉన్నారని పరిశోధన వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం బాదం పప్పులు తినడం వల్ల 47 శాతం తక్కువ స్థాయి సి-పెప్టైడ్ ప్రతిస్పందనలు, 18 శాతం ఎక్కువగా గ్లూకోజ్-ఆధారిత ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టైడ్, 39 శాతం ఎక్కువగా గ్లూకాగాన్ ప్రతిస్పందనలు ఉంటాయని తేలింది.
సి-పెప్టైడ్ ప్రతిస్పందనలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. మధుమేహం, గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ప్యాంక్రియాటిక్ పాలీపెప్టైడ్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది ఆహారం తీసుకోవడంలో తగ్గుదలకు కారణమవుతుంది. గ్లూకాగాన్ మెదడుకు సంతృప్తి సంకేతాలను పంపుతుంది. ఈ రెండూ బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. బాదాంలో ప్రోటీన్, ఫైబర్, అన్‌శాచ్యరేటెడ్ ఫ్యాట్ ఆమ్లాలు అధికంగా ఉండడం సంతృప్తిని కలిగించే లక్షణాలకు దోహదం చేస్తాయి. ఇది తక్కువ కిలోజౌల్స్ వినియోగానికి కారణాన్ని వివరించడంలో సహాయపడతాయని అధ్యయనం విశ్లేషించింది.
"చిన్న, సానుకూల జీవనశైలి మార్పులు కూడా ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయి. చిన్న, స్థిరమైన మార్పులు చేస్తున్నప్పుడు, దీర్ఘకాలంలో మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది’ అని కార్టర్ చెప్పారు.