Red Chutney | నోటికి రుచి తగలడం లేదా? రెడ్ చట్నీ కలుపుకోండి..ఆహా అనడం గ్యారెంటీ!
నాలుకను లపలపలాడించే రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో చెఫ్ కునాల్ కపూర్ ఒక సూపర్ రెసిపీని ఇచ్చారు. తయారు చేసుకోవడం చాలా సులువు. మీరూ ట్రై చేయండి..
ఎన్ని రకాల వెరైటీలు తిన్నా నాలుకకు రుచి తగలటం లేదా? అయితే నాలుకకు కొంచెం కారం తగిలించండి. ఎర్రటి కారంలో కొద్దిగా అల్లంవెల్లుల్లి నూనె కలుపుకొని తెల్లటి అన్నంలో కలిపితే వచ్చే ఆ రంగుకే నోరూరుతుంది. ఇంకాస్త పోపు వేసి ఘుమఘుమలాడిస్తే నాన్ వెజ్ వంటకాలను సైతం పక్కనపెట్టాల్సిందే.
ఈ రెడ్ చట్నీ కోసం చెఫ్ కునాల్ కపూర్ ఒక సూపర్ ఈజీ రెసిపీని పంచుకున్నారు. దానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. కానీ ఈ రెడ్ చట్నీని తయారు చేసుకునే ముందు బాగా ఆలోచించుకోమని చెఫ్ కునాల్ చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఈ రెడ్ చట్నీకి అలవాటుపడితే మళ్లీమళ్లీ ఇదే కావాలని తింటారట. మరీ ఇంతగా చెప్తే దీనిని తయారు చేసుకొని తినకుండా ఉండగలామా? అందుకే రెసిపీ ఇక్కడ ఇచ్చాం. పండగ చేస్కోండి..
రెడ్ చట్నీ కోసం కావలసినవి:
కాశ్మీరీ ఎండు మిర్చి లేదా బైడగి మిర్చి - 10
నూనె - 5 టేబుల్ స్పూన్లు
నువ్వులు (ఐచ్ఛికం) - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - ½ కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 6
కరివేపాకు - కొన్ని ఆకులు
తురిమిన కొబ్బరి - 1 కప్పు
చింతపండు - చిన్న ముక్క
వేయించిన శనగ పప్పు - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
నీరు - ½ కప్పు
తయారీ విధానం
- కడాయిలో నూనె వేసి వేడయ్యాక నువ్వులు వేయించాలి.
- ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేయాలి. సరిగ్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లబరుచుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, ఎండు మిర్చి చింతపండు, వేయించిన శనగ పప్పు, ఉప్పు నీరుతో పాటు వేయించిన మిశ్రమం వేసుకోవాలి.
- అన్నింటిని బాగా మిక్సీలో బాగా పేస్టులాగా రుబ్బుకోవాలి. అంతే రెడ్ చట్నీ సిద్ధం అయింది.
ఈ చట్నీని వేడివేడిగా అన్నంలో తినొచ్చు లేదా దోశ, ఇడ్లీలలో అద్దుకొని తినొచ్చు. మంచి రంగు, రుచితో పాటు వాసన ఘుమఘుమలాడుతుంది. ఈ చట్నీని ఫ్రిజ్‌లో ఉంచి రెండు-మూడు రోజుల వరకు నిల్వచేసుకోవచ్చు.
సంబంధిత కథనం