నలుపే ఆరోగ్యమాయెనే! నల్లని ఆహార పదార్థాలు తింటూ..-add black foods to your diet that are healthier than normal foods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నలుపే ఆరోగ్యమాయెనే! నల్లని ఆహార పదార్థాలు తింటూ..

నలుపే ఆరోగ్యమాయెనే! నల్లని ఆహార పదార్థాలు తింటూ..

Manda Vikas HT Telugu
Feb 28, 2022 08:21 PM IST

ఆంథోసైనిన్స్ వర్ణం కలిగిఉన్న ఆహార పదార్థాలు నలుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో కనిపిస్తాయి. వీటినే బ్లాక్ ఫుడ్స్ అని పిలుస్తారు. ఆంథోసైనిన్స్ వర్ణరంజకం ఉన్న పదార్థాలలో పుష్కలమైన పోషక విలువలతో పాటు, గొప్ప యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని తేలింది.

<p>Representational Image</p>
Representational Image (Shutterstock)

మీరు భోజనం చేస్తున్న సమయంలో మీ ప్లేట్ లో ఎన్ని రంగుల ఆహార పదార్థాలున్నాయో అని ఎప్పుడైనా గమనించారా? ఆకుకూరలైతే ఆకుపచ్చగా, టమోటా అయితే ఎర్రని రంగు, ఇలా వివిధ పదార్థాలకు సహజంగా ఉండే రంగులు లేదా వండేటపుడు అందులో ఉపయోగించే మసాల దినుసుల బట్టి ఆయా రంగులు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అలా కాకుండా మీప్లేట్ మొత్తాన్ని నల్లని ఆహార పదార్థాలతో నింపిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఇలా ఊహించారా? నల్లటి ఆహార పదార్థాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం బ్లాక్ ఫుడ్స్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది.

ఇంతకీ ఈ బ్లాక్ ఫుడ్స్ అంటే ఏమిటి అనుకుంటున్నారా? ఆకుకూరలు, కాయగూరలు ఏవైనా వాటిలో సహజంగా ఉండే వర్ణం ఆధారంగా అవి బయటకు ఆయా రంగుల్లో కనిపిస్తాయి. అలాగే ఆంథోసైనిన్స్ కలిగిఉన్న ఆహార పదార్థాలు నలుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో కనిపిస్తాయి. వీటినే బ్లాక్ ఫుడ్స్ అని పిలుస్తారు. 

ఆంథోసైనిన్స్ వర్ణరంజకం ఉన్న పదార్థాలలో పుష్కలమైన పోషక విలువలతో పాటు, గొప్ప యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని తేలింది. ఇవి శరీరంలో రక్తాన్ని శుభ్రపరచడంలో సహయ పడతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మరి అలాంటి బ్లాక్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్లాక్ రైస్: 

సాధారణంగా మనం రోజూ తినే బియ్యం తెల్లగా ఉంటాయి. కానీ బ్లాక్ రైస్ కూడా ఉంటుందని మీకు తెలుసా?

సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతాలల్లో ఈ నల్ల బియ్యం ఎక్కువగా పండిస్తారు, ఈ బియ్యం మిగతా బియ్యం రకాల కంటే విభిన్నమైన ఫ్లేవర్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కలిగి తేలికగా జీర్ణమవుతుంది. ఊబకాయం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు.

నలుపురకం బియ్యంపై చైనాలో పురాతన కాలంలో నిషేధం విధించారు, ఎందుకంటే ఇది రాజ వంశస్థులు తినడానికి మాత్రమే అప్పట్లో పండించేవారు. మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నల్ల బియ్యం పండిస్తున్నారు. ఈ రకం బియ్యం వండుకొని తినటం ద్వారా కంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. దీని ద్వారా వచ్చే గంజిలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.

నల్ల పప్పు: 

బ్లాక్ రైస్ లాగే బ్లాక్ దాల్ కూడా ఉందండోయ్. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, భారతీయులు యుగయుగాలుగా ఈ నల్ల పప్పును ఉపయోగిస్తున్నారు. కానీ పొట్టు తీసి బాగా పాలిష్ చేయడం మూలానా వాటిని మనం గుర్తించలేకపోతున్నాం. అయితే ఆర్గానిక్ స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి. వీటిలో ఫైబర్, ఐరన్, ఫోలేట్, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. రుచికరంగా కూడా ఉంటాయి.

బ్లాక్ ఆలివ్‌లు: 

ఆలివ్‌ సంబంధిత పదార్థాలను పాశ్చాత్య దేశాల్లో విరివిగా ఉపయోగిస్తారు. మన వద్ధ కూడా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కొంత ఉండటం మూలానా ఆలివ్‌లు ఇక్కడ సూపర్ మార్కెట్లలో లభ్యమవుతాయి. బ్లాక్ ఆలివ్‌లను సలాడ్లు, పాస్తా, జ్యూస్, ఫ్రైస్, పిజ్జా, కొన్ని ఊరగాయయల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలివ్‌లలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఈ, పాలీఫెనాల్స్,  ఒలియోకాంతల్ ఉంటాయి, ఇది ఆలివ్‌లలో కనిపించే బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, పెయిన్ కిల్లర్ సమ్మేళనం. ఈ బ్లాక్ ఆలివ్స్ గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనులు కొవ్వు అడ్డుపడకుండా కాపాడుతుంది, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, DNA దెబ్బతినకుండా చేస్తుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యాన్ని కూడా తోడ్పడుతుంది.

నల్ల నువ్వులు: 

నల్ల నువ్వుల్లో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, కాల్సిమ్, జింక్, రాగి, సెలీనియం, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే సెసమిన్ అనే సమ్మేళనం కీళ్ల నొప్పులు , మంటను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ 1-2 టీస్పూన్ల నల్ల నువ్వులను వాటిని సలాడ్లలో గార్నిష్‌గా, లడ్డూలలో, బ్రెడ్‌లు, స్మూతీలు, సూప్‌లు, ఏదోక రూపంలో తీసుకున్నా సరే, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

నల్ల ద్రాక్ష: 

తీపి రుచిలో ఒక అద్భుతమైన ఫ్లేవర్ కలిగి ఉంటుంది. నల్ల ద్రాక్ష చాలా మంది ఇష్టంగా తింటారు. సీజనల్ గా లభ్యమయ్యే ఈ పండ్లను తినడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూర్చవచ్చు. నల్ల ద్రాక్షలో లుటీన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి కళ్లలోని రెటీనా దెబ్బతినకుండా కాపాడుతాయి. ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంది.  LDL స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ పండులో ఉండే ప్రోఅంటోసైనిడిన్స్ చర్మ ఆరోగ్యానికి మంచిది. ఈ ద్రాక్షను సలాడ్లు, స్మూతీలు, జామ్‌లు, పెరుగు అన్నంలో కూడా కలుపుకొని తినేయవచ్చు.

నల్ల వెల్లుల్లి: 

నల్ల వెల్లుల్లి అంటూ ప్రత్యేకంగా లభించదు. మన వద్ద సాధారణంగా లభ్యమయ్యే వెల్లుల్లినే నల్లగా మార్చే ప్రక్రియ ద్వారా రంగును అభివృద్ధి చేసి, వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. వెల్లుల్లిని చాలా కాలంపాటు జాగ్రత్తగా నిల్వ ఉంచటం లేదా పులియబెట్టడం ద్వారా నల్లరంగు సంతరించుకుంటుంది. ఇలా చేయటం ద్వారా వంటకాల్లో రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యపరంగా సెల్ డ్యామేజీని నిరోధించేందుకు తోడ్పడుతుంది. ఈ క్రమంలో క్యాన్సర్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. నల్లగా మార్చిన వెల్లుల్లిలో మామూలు వెల్లుల్లి కంటే రెండింతల ఎక్కువ యాంటీ -ఆక్సిడెంట్లు శరీరానికి లభిస్తాయి.

Whats_app_banner