Street Food | వైజాగ్‌లో బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఇవే.. కచ్చితంగా ట్రై చేయండి!
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి బెస్ట్ హాలిడే డెస్టినేషన్లలో ఒకటి వైజాగ్. చుట్టూ కొండలు, సముద్రం, ఆహ్లాదకర వాతావరణం విశాఖపట్నం సొంతం. విశాఖ అందాలను చూడటంతోపాటు అక్కడికి వెళ్తే కచ్చితంగా ట్రై చేయాల్సిన స్ట్రీట్ ఫుడ్ కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
వైజాగ్ బీచ్ లలో తిరుగుతూ అక్కడ దొరికే చిరుతిండ్లను టేస్ట్ చేస్తుంటే ఆ మజానే వేరు. పర్యాటక ప్రదేశాలకు వెళ్లడమే కాదు.. అక్కడ దొరికే ఫుడ్ కూడా టేస్ట్ చేస్తేనే బాగుంటుంది. అందులోనూ వీధుల్లో రోడ్డు పక్కన దొరికే ఫుడ్స్ కు అలవాటు పడిన నగర వాసులైతే వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు. మరి విశాఖపట్నంలో దొరికే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఏంటి? ఎక్కడ దొరుకుతాయో చూద్దాం.
మురి మిక్చర్
మరమరాలు లేదా బొంగులు లేదా బొరగులు ఇలా ఒక్కో చోట ఒక్కోలా పిలుచుకునే ఆహార పదార్థంతో చేసే మురి మిక్చర్ చాలా ఫేమస్. తెన్నేటి పార్క్, ఆర్కే బీచ్, రుషి కొండ వద్ద దొరికే ఈ మురి మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. మూరీలు, పల్లీలు, ఉల్లి, పచ్చిమిర్చి, టమోటా వంటి పదార్ధాలను కలిపి తయారు చేస్తారు. దీనిపై చివర్లో కాస్త నిమ్మరసాన్ని వేస్తారు. పిల్లలు సహా అందరూ ఈ టేస్ట్ ఎంజాయ్ చేస్తారు.
పునుగులు
బీచ్ లో సముద్రంపై నుంచి వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ.. వేడివేడి పునుగులు తినాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. బియ్యం, మినపపప్పుతో చేసే పునుగులు చాలా రుచిగా ఉంటాయి. ఇదే ఎంవీపీ డబుల్ రోడ్డులో టమాటా బజ్జీ కూడా దొరుకుతుంది.
స్వీట్ కార్న్
స్వీట్ కార్న్ తినడానికి వైజాగ్ వరకూ వెళ్లాలా అని అనకండి. ఇక్కడి తెన్నేటి పార్క్ వద్ద స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ రుచి చూస్తూ సముద్ర తీర అందాలను ఆస్వాదించడం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది.
దోశ
MVP సర్కిల్ దగ్గర గుంటూరు టిఫిన్స్ అని ఉంటుంది. అక్కడ ఒక్కసారి దోశ తిన్నారంటే మళ్లీ ఆ టేస్టు ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తాం. అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా దొరికే ఇడ్లీ తింటే వావ్ అనాల్సిందే. ఆర్కే బీచ్ వద్ద మసాలా బఠాణీ చాలా బాగుంటుంది.
లివర్ కబాబ్
MVP సర్కిల్ వద్ద వైజాగ్ కాంప్లెక్స్ లో లివర్ కబాబ్ కి పెట్టింది పేరు. లివర్ కబాబ్, మటన్ కబాబ్, చికెన్ కబాబ్, చేపల వేపుడు వంటి అనేక రకాల రుచికరమైన వంటకాలు లభిస్తాయి.
బొంగు చికెన్
వైజాగ్ వెళ్లిన వాళ్లు అరకు వెళ్లకుండా ఉండరు. అరకు అందాలను వీక్షిస్తూ వెదురు బొంగులో చేసిన చికెన్ తింటుంటే ఆ మజానే వేరు. వెదురు బొంగుల్లో మసాలా అద్దిన చికెన్ ను ఉంచి కాలుస్తారు. వేడికి బొంగులో ఉన్న రసం మాంసానికి ఎక్కి ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే ఈ పదార్ధాన్ని బొంగు చికెన్ అని పిలుస్తారు.
సంబంధిత కథనం