Chanakya Niti : ఈ కారణాలతో వివాహం విడాకులతో ముగుస్తుంది.. ఈ తప్పులు చేయకండి
Chanakya Niti : పూర్వ కాలంలో వివాహం తర్వాత సంబంధం జీవితాంతం కొనసాగేది. భార్యాభర్తల మధ్య సహనం, గౌరవం ఉండటం వల్ల విడిపోవాలనే ఆలోచన ఉండేది కాదు. కానీ ఈ ఆధునిక పరిస్థితుల్లో విడాకులు కామన్ అయిపోయాయి. చాణక్యుడు భార్యాభర్తలు వీడిపోడానికి గల కొన్ని కారణాలను చెప్పాడు.
పూర్వకాలంలో భార్యాభర్తలిద్దరూ అన్ని పరిస్థితులలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకునేవారు. మంచి, చెడు రెండింటినీ అంగీకరించేవారు. కానీ ఈ రోజుల్లో భార్యాభర్తలకు ఆ సహనం లేదు. ఆధునిక జీవితంలో కోపం, చిరాకు, ఒత్తిడి, అబద్ధాలు చెప్పే ధోరణి వంటివి పెరిగిపోతున్నాయి. ఓపిక అనే పదానికి ఈ కాలంలో చోటు లేదేమో. భర్త ఒకటి అంటే భార్య పది అంటుంది. భార్య చిన్న తప్పు చేస్తే.. భర్త పది విషయాలను తప్పుగా చూపిస్తాడు. ఈ పరిస్థితుల కారణంగా వైవాహిక జీవితం నాశనం అవుతుంది. విడాకుల కేసులు కూడా వేగంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చాలా సంవత్సరాల క్రితం వైవాహిక జీవితాన్ని నాశనం చేయడానికి కారణమైన కొన్ని అలవాట్ల గురించి చెప్పాడు. మీరు అవేంటో తెలుసుకుని, ఎలా ఉండాలో డిసైడ్ అయితే.. వైవాహిక జీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు.
కోపం ఒక వ్యక్తికి హానికరం మాత్రమే కాదు, అతని అన్ని సంబంధాలను ముగించడానికి ఒక కారణంగా కూడా పరిగణించబడుతుంది. భార్యాభర్తలలో ఎవరికైనా కోపం ఉంటే వారి వైవాహిక జీవితంలో శాంతి ఉండదు. కోపంతో సంఘర్షణ పరిస్థితులు ఎక్కువ అవుతాయి. వైవాహిక జీవితం బలహీనమవుతుంది. కోపం తగ్గించుకోవాలి.
మీరు మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే, మీ వ్యక్తిగత రహస్యాలను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది. మీరు మీ సంభాషణలను మూడో వ్యక్తికి చెబితే అంతే సంగతలు. మీ మధ్య సమస్యను పరిష్కరించే బదులు, అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే భార్యాభర్తల విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.
భార్యాభర్తల సంబంధం చాలా సున్నితంగా ఉంటుంది. అబద్ధం చెప్పడం వల్ల ఈ సంబంధం చెడుగా ప్రభావితం కావొచ్చు. కాలక్రమేణా, మీ అబద్ధం బయటకు వస్తే, మీ భాగస్వామి మీపై నమ్మకాన్ని కోల్పోతారు. మీ సంబంధంలో చేదు ఏర్పడుతుంది. అందుకే భార్యాభర్తలు అబద్ధాలు చెప్పుకోవద్దు.
భార్యాభర్తలిద్దరూ ఆదాయానికి అనుగుణంగా తమ ఖర్చులలో సమతుల్యతను కాపాడుకోవాలి. మీ ఖర్చులకు లెక్కలేకుండా పోయినా లేదా అనవసరమైన ఖర్చులకు పాల్పడినా భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవు. ఖర్చులు ఎక్కువైతే.. గొడవలు కూడా ఎక్కువ అవుతాయి.
ప్రతి బంధానికి పరిమితి ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. హద్దులు దాటితే బంధుత్వాలు విచ్ఛిన్నమవుతాయి. అందుకే ఎవరితోనూ హద్దులు దాటి ప్రవర్తించకూడదు.
ఓర్పు అనేది చాలా ముఖ్యమైన విషయం. జీవితంలో చాలా సార్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అండగా ఉంటూ పరిస్థితులను ఓపికగా ఎదుర్కోవాలి. గొడవ అయితే.. ఒకరు ఓర్పుగా ఉన్నా.. మరొకరు సైలెంట్ అయిపోతారు. అదే ఓర్పు లేకుండా.. ఇద్దరూ గొడవకు దిగితే.. అది సంబంధాన్ని దెబ్బతీస్తుంది.