Immunity in Monsoon। వర్షాకాలంలో రోగాలను తరిమేయండి, రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి!
Boost Immunity in Monsoon: వర్షాకాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి, వీటిని పాటించడానికి ప్రయత్నించండి.
Boost Immunity in Monsoon వర్షాకాలంలో ఎప్పుడూ ఏ అనారోగ్యం వస్తుందో చెప్పలేం. అకస్మాత్తుగా కడుపునొప్పి రావచ్చు లేదా చర్మ వ్యాధులు రావచ్చు. అంటువ్యాధులు తగలవచ్చు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటివి ఇబ్బంది పెట్టవచ్చు, లేదా మరేదైనా ఇన్ఫెక్షన్ సోకవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ అలాంటిది. వాతావరణంలోని మార్పులు, పరిసరాల కాలుష్యం వలన అనేక రకాల వ్యాధి కారక క్రిములు, సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. మరోవైపు ఇలాంటి వాతావరణంలో మన రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా మారుతుంది. ఈ కారణంగా వర్షాకాలంలో ఏదో రూపంలో ఏదో ఒక అనారోగ్యం ప్రబలుతుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి, వీటిని పాటించడానికి ప్రయత్నించండి.
గోరువెచ్చని నీరు తాగండి
వర్షాకాలంలో నీరు చాలా కలుషితం అవుతుంది. ఈ కలుషిత నీరు తాగడం వల్ల కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. దీన్ని నివారించడానికి, ఎల్లప్పుడూ శుద్ధమైన నీటిని మాత్రమే తాగండి, శుద్ధమైన నీటిని మరిగించి, వడపోసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగితే మరింత మంచిది. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం నుండి విషాన్ని తొలగించి మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతే కాకుండా ఈ సీజన్‌లో వచ్చే గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
సీజనల్ పండ్లు తినండి
వర్షాకాలంలో పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో తింటా గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సీజన్ లో విటమిన్ సి పుష్కలంగా లభించే పండ్లను తినండి. నారింజ, బత్తాయి, ఉసిరి, నేరేడు మొదలైన పండ్లను తినడం చాలా ప్రయోజనం వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ రోగనిరోధక శక్తిని చాలా వరకు బలపరుస్తాయి.
కషాయాలు తీసుకోండి
రోగనిరోధక శక్తిని పెంచడంలో కషాయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. లవంగాలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, తులసి వంటి వాటితో చేసే కషాయం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. అదే సమయంలో సీజనల్ వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో వివిధ మూలికలతో చేసిన మంచి కషాయాలను తప్పక తీసుకోండి.
అల్లం బెల్లం తినండి
వర్షాకాలంలో అల్లం తినండి, దీనిని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. అల్లం టీ తాగవచ్చు లేదా వివిధ కూరగాయలో వేసి వండుకొని తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కొద్దిగా బెల్లం తినండి, బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.
పసుపు పాలు తాగండి
రోజూ రాత్రి పడుకునే ముందు చిటికెడు పాలు కలిపి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పసుపు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. పసుపు పాలు తాగడం వల్ల శరీరంలోని అలసట తగ్గి మంచి నిద్ర వస్తుంది. ఇమ్యూనిటీ పెరగడానికి మంచి నిద్ర అవసరమే.
వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, మంచి పోషకాహారం తినండి, పరిశుభ్రంగా ఉండండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యానికి తిరుగులేదు.
సంబంధిత కథనం