Kawasaki Ninja 300| ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్ 'బేబీ నింజా' అప్డేటెడ్ వెర్షన్
భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ స్పోర్ట్ బైక్ కవాసకి నింజా 300 బిఎస్6 మోడల్ విడుదలయింది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత ఉంది మొదలగు వివరాల కోసం చూడండి..
కవాసకి ఇండియా తన ప్రసిద్ధ ఎంట్రీ-లెవల్ స్పోర్ట్ బైక్ ‘నింజా 300’ బిఎస్6 మోడల్ 2022ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను బేబీ నింజా అని కూడా పిలుస్తారు. దీనిని కొనుగోలు చేసేందుకు వీలుగా బుకింగ్‌లు వెంటనే ప్రారంభించింది. ఈ సరికొత్త బైక్ ఇప్పుడు లైమ్ గ్రీన్, క్యాండీ లైమ్ గ్రీన్, ఎబోనీ గ్రీన్ అనే మూడు రంగులలో సరికొత్త గ్రాఫిక్‌లతో లభ్యమవుతోంది. అయితే కలర్ గ్రాఫిక్‌లకు సంబంధించి స్వల్ప మార్పులు మినహా డిజైన్ ఇంకా లుక్ పరంగా ఈ బైక్ గతేడాది బైక్‌ను పోలినట్లుగానే ఉంటుంది.
కవాసకి నింజా 300 మార్కెట్లో ఇప్పటికే ఉన్న KTM RC 390, హోండా CB 300R, రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 అలాగే BMW G310GS లాంటి బైక్‌లతో పోటీలో నిలుస్తుంది. అయితే బరువులో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 కంటే 23 కిలోల బరువు తక్కువగా ఉంది. ఈ బైక్ సీటు ఎత్తు (780 mm) కూడా ఇక్కడ పేర్కొన్న బైక్‌ల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎత్తు తక్కువగా ఉండే వారికి ఈ బైక్ సౌకర్యంగా ఉంటుంది.
ఈ బైక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
కవాసకి నింజా 300లో 296 cc లిక్విడ్-కూల్డ్ 8-వాల్వ్ DOHC ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంది. ఇది డ్యూయల్ థొరెటల్ వాల్వ్‌లను కలిగి ఉంది. ఈ ఇంజన్ 11,000 RPM వద్ద 38 HP శక్తిని అలాగే 10,000 RPM వద్ద 26.1 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్‌ను 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేశారు. 'అసిస్ట్ - స్లిప్పర్’ క్లచ్ సౌకర్యం కూడా ఉంది.
సస్పెన్షన్ పరంగా 37mm టెలిస్కోపిక్ ఫోర్క్, లింక్-టైప్ మోనోషాక్ సెటప్‌తో పాటు బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను కూడా కలిగి ఉంది. LED లైటింగ్ ఇచ్చారు. ఇక మిగతా ఫీచర్లు అన్ని పాతవే ఉన్నాయి.
ఈ సరికొత్త కవాసకి నింజా 300 బిఎస్6 మోడల్ 2022 ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 3.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
సంబంధిత కథనం