Tamil Horror OTT: ఓటీటీలోకి లేడీ ఓరియెంటెడ్ హారర్ మూవీ - ప్రతి పది నిమిషాలకో ట్విస్ట్‌తో భయపెడుతుంది!
Tamil Horror OTT: విమలారామన్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ గ్రాండ్‌మా ఓటీటీలోకి వస్తోంది. జూలై 23 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Tamil Horror OTT: విమలారామన్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్ హారర్ మూవీ గ్రాండ్‌మా థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. జూలై 23 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. 2022 జూలైలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఎమోషనల్ హారర్ మూవీగా తెరకెక్కిన గ్రాండ్‌మా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
ఒకే బిల్డింగ్‌లో...మూడు పాత్రల నేపథ్యంలో...
గ్రాండ్‌మా మూవీకి శిజిన్‌లాల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ ఎక్కువగా మూడు పాత్రల నేపథ్యంలో ఒకే బంగళాలో జరుగుతుంది. కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేశాడు డైరెక్టర్. గ్రాండ్‌మా కంటే ముందే శిజిన్‌లాల్‌తో వేరే సినిమా చేయడానికి విమలారామన్ అంగీకరించింది. అది అనుకోకుండా ఆగిపోవడంతో డైరెక్టర్‌తో ఉన్న కమిట్‌మెంట్ కారణంగా గ్రాండ్‌మాలో నటించింది.
అమ్మమ్మ ఆత్మగా మారితే..
గ్రాండ్‌మా మూవీలో ప్రియాంక అనే లాయర్‌గా విమలారామన్ నటించిగా...త్రిష అనే కేర్ టేకర్ పాత్రలో సోనియా అగర్వాల్ కనిపించింది. ప్రియాంక ఓ లాయర్. భర్తకు దూరమైన ఆమె ఓ పెద్ద బంగళాలో కూతురితో కలిసి ఒంటరిగా ఉంటుంది. ప్రియాంక కూతురు నిక్కీకి అమ్మమ్మతో అటాచ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. అమ్మమ్మ చనిపోవడంతో నిక్కీ షాక్ నుంచి తేరుకోలేకపోతుంది.
తన రూమ్ నుంచి బయటకు రాకుండా ఎప్పుడు ఒంటరిగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. నిక్కీకి కేర్ టేకర్‌గా త్రిష కొత్తగా అపాయింట్ అవుతుంది. నిక్కీ అమ్మమ్మ ఆత్మ ఆ ఇంట్లోనే సంచరిస్తుందనే విషయం ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే త్రిషకు అర్థమవుతుంది.
నిక్కీ ఆ ఆత్మతోనే మాట్లాడుతుందని తెలుసుకుంటుంది? ఆ ఆత్మ కారణంగా త్రిష ఎలాంటి ఇబ్బందులు పడింది? మనవరాలిని వదిలిపెట్టకుండా ఆ ఆత్మ బంగళాలో ఉండటానికి కారణం ఏమిటి? ప్రియాంక శత్రువుల కారణంగా నిక్కీకి ఎలాంటి ఆపద ఏర్పడింది అన్నదే ఈ మూవీ కథ.
డిఫరెంట్ హారర్ మూవీ....
హారర్ సినిమాలు చాలా వరకు రివేంజ్ అంశాలతోనే ముడిపడి ఉంటాయి. విలన్స్‌పై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆత్మలు ఎదురుచూస్తున్నట్లుగా చూపిస్తుంటారు. గ్రాండ్‌మా మాత్రం రొటీన్‌కు భిన్నమైన పాయింట్‌తొ సాగుతుంది. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్, విమలారామాన్, సోనియా అగర్వాల్ యాక్టింగ్‌కు థియేటర్లలో ప్రశంసలు లభించాయి.
తెలుగులో పలు సినిమాలు...
విమలారామన్, సోనియా అగర్వాల్ హీరోయిన్లుగా తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో విజయాలను అందుకున్నారు. తెలుగులో ఎవరైనా ఎపుడైనా, గాయం 2, రంగా ది దొంగ సహా మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది విమలారామన్.
సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గాంఢీవధారి అర్జున, రుద్రాంగితో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. తెలుగు మూవీ నీ ప్రేమకైతోనే సోనియా అగర్వాల్ సినీ జర్నీ ప్రారంభమైంది. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ 7 జీ బృందావన కాలనీ పెద్ద హిట్‌ను అందుకున్నది. కానీ సోనియా అగర్వాల్‌కు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. విన్నర్, రెడ్‌తో పాటు మరో నాలుగైదు సినిమాలు చేసింది.