Mohan Raj Dies: టాలీవుడ్ విలన్ మోహన్‌రాజ్ కన్నుమూత - ఈడీ ఆఫీసర్ నుంచి సినిమాల్లో విలన్‌గా!
Mohan Raj Dies: టాలీవుడ్ విలన్ మోహన్‌రాజ్ అనారోగ్య సమస్యలతో గురువారం కన్నుమూశాడు. తెలుగులో ఎక్కువగా బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్‌లతో సినిమాలు చేశాడు మోహన్‌రాజ్. లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, అసెంబ్లీరౌడీతో పాటు పలు సినిమాల్లో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.
Mohan Raj Dies: ప్రముఖ దక్షిణాది నటుడు మోహన్‌రాజ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. గుండెపోటు కారణంగా ఇటీవలే మోహన్‌రాజ్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు
కిరిక్కాడాన్ జోస్...
మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రెండు వందలకుపైగా సినిమాలు చేశాడు మోహన్‌రాజ్. మోహన్‌లాల్ హీరోగా 1989లో వచ్చిన కిరీడామ్ అనే సినిమాతో మోహన్‌రాజ్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో కిరిక్కాడామ్ జోస్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో మోహన్‌రాజ్ తన విలనిజంతో ఆడియెన్స్‌ను భయపెట్టాడు. ఈ సినిమా మోహన్ రాజ్ సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. కిరిక్కాడాన్ జోస్‌గానే అతడు పాపులర్ కావడంతో ఆ పేరుతోనే చాలా సినిమాలు చేశాడు మోహన్‌రాజ్.
మలయాళంలో స్టార్ విలన్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. మోహన్‌లాల్, మమ్ముట్టితో పాటు మలయాళ అగ్ర నటీనటులందరితో సినిమాలు చేశాడు. 1990 నుంచి 2008 వరకు బ్రేక్ లేకుండా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ వచ్చారు.
లారీ డ్రైవర్‌తో పాపులర్...
1990లో వచ్చిన రౌడీయిజం నశించాలి మూవీతో మోహన్‌రాజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మోహన్‌రాజ్. బాలకృష్ణ హీరోగా నటించిన లారీ డ్రైవర్ సినిమాలో గుడివాడ రౌడీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. లారీ డ్రైవర్ తర్వాత తెలుగులో బిజీగా మారాడు మోహన్‌రాజ్. తెలుగులో ఎక్కువగా బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్ సినిమాల్లో విలన్‌గా కనిపించాడు మోహన్‌రాజ్.
బాలకృష్ణ, మోహన్‌రాజ్ కాంబోలో తెలుగులో నిప్పు రవ్వ, బొబ్బిలి సింహం, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్‌పెక్టర్, పవిత్ర ప్రేమ, సమర సింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డితో పాటు పలు సినిమాలొచ్చాయి.
అసెంబ్లీ రౌడీ…
అసెంబ్లీ రౌడీ, చినరాయుడు, శివయ్య, శ్రీరాములయ్య, పెళ్లిచేసుకుందాం, రాఘవేంద్ర, శివశంకర్‌తో తెలుగులో పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేశాడు మోహన్‌రాజ్.
ఈడీ ఆఫీసర్...
నటుడిగా మోహన్‌రాజ్ చివరి మూవీ రోషాక్. 2022లో మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ తండ్రిగా కనిపించాడు. ఆ తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరమయ్యారు.
సినిమాల్లోకి రాకముందు మోహన్‌రాజ్ కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఏఈవోగా వర్క్‌చేశారు. ఆ తర్వాత సినిమాలతో బిజీ కావడంతో ఉద్యోగానికి దూరమయ్యారు. మోహన్‌రాజ్‌కు భార్య ఉషతో పాటు ఇద్దరు కుమార్తులు ఉన్నారు.