Tillu Square Review: టిల్లు స్క్వేర్ రివ్యూ - డీజే టిల్లు సీక్వెల్ నవ్వించిందా? లేదా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. డీజే టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ (Siddu jonnalagadda) హీరోగా 2022 రిలీజైన డీజే టిల్లు చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. టిల్లు స్క్వేర్ పేరుతో డీజే టిల్లుకు సీక్వెల్‌ను తెరకెక్కించాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సీక్వెల్‌లో హీరోగా నటిస్తూనే కథ, స్క్రీన్‌ప్లేను అందించాడు. అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో నేహా శెట్టి గెస్ట్ రోల్ చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. డీజే టిల్లులోని (DJ Tillu)మ్యాజిక్‌ను సీక్వెల్ అందించిందా? ఈ సారి టిల్లు ఎలాంటి నవ్వులను పంచాడన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
లిల్లీతో రొమాన్స్...
రాధిక (నేహా శెట్టి) తన జీవితంలో రేపిన అలజడిని మర్చిపోయి హ్యాపీగా లైఫ్‌ను గడిపేయాలని ఫిక్సవుతాడు. టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ). అతడి జీవితంలోకి అనుకోకుండా లిల్లీ (అనుపమ పరమేశ్వరన్)అడుగుపెడుతుంది. ఓ పార్టీలో పరిచయమైన లిల్లీతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు టిల్లు.
లిల్లీ మాయలో టిల్లు ఉండగానే ఆమె కనిపించకుండా పోతుంది. నెల తర్వాత లిల్లీ ఆచూకీని కనిపెట్టిన టిల్లు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్సవుతాడు. లిల్లీతో టిల్లు పెళ్లి జరిగిందా? లిల్లీ మిస్సింగ్‌కు కారణం ఏమిటి? రాధిక ఉంటున్న ఫ్లాట్‌లోనే లిల్లీ ఎందుకుంది? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్‌ను చంపేందుకు వేసిన ప్లాన్‌లోకి టిల్లు ఎలా వచ్చాడు? లిల్లీ కారణంగా టిల్లు జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి? రాధికను మళ్లీ టిల్లు ఎందుకు కలవాల్సివచ్చింది? అన్నదే టిల్లు స్క్వేర్(Tillu Square Review) మూవీ కథ.
టిల్లు క్యారెక్టరైజేషన్...
కొన్ని సినిమాలు కథ కంటే క్యారెక్టరైజేషన్‌తోనే ఆడియెన్స్‌ను అలరిస్తాయి. అలాంటి మ్యాజిక్, ఫన్ డీజే టిల్లు సినిమాతో వర్కవుట్ అయ్యింది. టిల్లు క్యారెక్టర్‌ను సెంటర్‌గా చేసుకుంటూ ఆ పాత్ర చుట్టూ మరో రొమాంటిక్ , సస్పెన్స్ డ్రామా అంశాలను జోడిస్తూ టిల్లు స్క్వేర్ కథను రాసుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమా సక్సెస్‌కు టిల్లు పాత్రలో సిద్దు జొన్నలగడ్డ చూపించిన ఆటిట్యూడ్ పాటు ఫన్ డైలాగ్స్, రొమాంటిక్ ట్రాక్ కీలకంగా నిలిచాయి.
సీక్వెల్(Tillu Square Review) కోసం ఆ బలాలనే నమ్ముకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రేక్షకుల్ని ఊహలకు అందని సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లేవి సీక్వెల్‌లో లేవు. కథ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. అయినా టిల్లు స్క్వేర్ ఎక్కడ బోర్ కొట్టదు. రొటీన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలగనీయదు. అందంతా టిల్లు క్యారెక్టర్ మహిమగానే చెప్పొచ్చు. హిలేరియస్ పంచ్‌లతో ఫుల్ టైమ్‌పాస్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ.
ప్రాపర్ సీక్వెల్...
ఇప్పొడొస్తున్న సీక్వెల్స్‌లో చాలా వరకు టైటిల్ మినహా ఫస్ట్ పార్ట్‌తో సెకండ్ పార్ట్ ఎక్కడ సంబంధం కూడా కనిపించడం లేదు. కానీ డీజే టిల్లును మాత్రం ప్రాపర్ సీక్వెల్‌గా(Tillu Square Review) సిద్ధు జొన్నలగడ్డ తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్‌కు లింక్ చేస్తూ చాలా సీన్స్ సినిమాలో కనిపిస్తాయి. రాధిక ఫ్లాట్‌లోనే లిల్లీ ఉండటం, డీజే టిల్లులో రాధిక చేతిలో చనిపోయిన రోహిత్‌ను లిల్లీ అన్నయ్యగా చూపించడం లాంటి సీన్స్‌కు బాగా రాసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా రాధిక పాత్రను గెస్ట్‌గా రంగంలోకి దించడం కూడా సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్...
డీజే టిల్లు ఎక్కడ ఎండ్ అయితే అక్కడి నుంచే సీక్వెల్ మొదలవుతుంది.ఈవెంట్ మేనేజర్‌గా సెటిలైన టిల్లు జీవితంలోకి లిల్లీ రావడం, ఆమెతో టిల్లు రొమాన్స్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. ఆ తర్వాత లిల్లీ మిస్సవ్వడం, ఆమె కోసం టిల్లు అన్వేషణతో కథను ముందుకు నడిపించిన డైరెక్టర్ ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు.
సెకండాఫ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను చంపేందుకు వేసిన ప్లాన్... ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎంట్రీ ఇవ్వడం...ఆ ప్లాన్‌లోకి అనుకోకుండా టిల్లు భాగం కావడం అనే డ్రామాతో సెకండాఫ్‌ను నడిపించాడు డైరెక్టర్. ఈ డ్రామాలో కామెడీ డోస్ తగ్గింది. చాలా వరకు ట్విస్ట్‌లు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. పంచ్‌లు, ప్రాసలతో సిద్ధు డైలాగ్స్ ఈ ఎపిసోడ్‌లో రిలీఫ్‌ను పంచుతాయి.
టిల్లు వన్ మెన్ షో...
డీజే టిల్లు మాదిరిగానే టిల్లు స్క్వేర్ కూడా సిద్దు జొన్నలగడ్డ వన్ మెన్ షోగా నిలుస్తుంది. టిల్లు పాత్రలో అతడి ఎనర్జీ, డైలాగ్స్ నవ్విస్తాయి. తాను రాసుకున్న క్యారెక్టర్ కావడంతో ఈజీగా ఈ క్యారెక్టర్‌ను చేసుకుంటూ వెళ్లిపోయాడు. బోల్డ్ క్యారెక్టర్‌లో అనుపమ సర్‌ప్రైజ్ చేసింది. లిప్‌లాక్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేసింది. ఆమె క్యారెక్టర్‌లోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. రాధికగా నేహాశెట్టి గెస్ట్ రోల్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె ఎంట్రీ సీన్ అలరిస్తుంది. మురళీధర్ గౌడ్, మురళీశర్మ, ప్రిన్స్‌తో పాటు మిగిలిన వారు కూడా పర్వాలేదనిపించారు. భీమ్స్ బీజీఎమ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అచ్చు, రామ్ మిరియాల కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి.
Tillu Square Review -ఫస్ట్ పార్ట్‌కు మించి నవ్వులు...
టిల్లు స్క్వేర్ డీజే టిల్లుకు పర్‌ఫెక్ట్ సీక్వెల్‌గా చెప్పవచ్చు. ఫస్ట్ పార్ట్‌కు మించి ఈ సీక్వెల్‌లో టిల్లు ఆడియెన్స్‌ను నవ్విస్తూనే థ్రిల్ చేస్తాడు.
రేటింగ్: 3/5