NTR Awards: రెండు హారర్ సినిమాలకు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా మసూద హీరో తిరువీర్
Kalavedika NTR Film Awards To Thiruveer: ఇటీవల ప్రదానం చేసిన కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్ వేడుకల్లో 2 హారర్ సినిమాలకు పురస్కారాలు లభించాయి. వాటిలో బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా మసూద సినిమా హీరో తిరువీర్ అవార్డ్ అందుకున్నాడు. ఎన్టీఆర్ అవార్డ్స్ 2024 పూర్తి వివరాల్లోకి వెళితే..
NTR Film Awards 2024: విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరామారావు స్మరాణార్థం ఆయన పేరుతో అవార్డుల ప్రదానోత్సం ప్రతి సంవత్సరం జరిపిస్తున్న విషయం తెలిసిందే. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో తాజాగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సినీ రంగంలోని వివిధ విభాగాల్లో మంచి పేరు తెచ్చుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎన్టీఆర్ అవార్డ్స్ అందజేశారు. అయితే ఈ అవార్డ్స్ రెండు తెలుగు హారర్ సినిమాలకు వరించడం విశేషంగా మారింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హారర్ సినిమా మసూదలో హీరోగా చేసిన తిరువీర్ బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా పురస్కారం గెలుచుకున్నాడు.
కెరీర్ ప్రారంభం నుంచి విలక్షణ పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు తిరు వీర్. హారర్ ఫిల్మ్ మసూద, కామెడీ మూవీ పరేషాన్ వంటి చిత్రాలతో వెర్సటైల్ యాక్టర్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మసూద సినిమాలో తిరువీర్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తిరువీర్ ప్రెస్టీజియస్ అవార్డును దక్కించుకున్నారు.
హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగిన కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో భాగంగా మసూద చిత్రంలో అద్భుతమైన నటనకుగానూ తిరువీర్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లో మరచిపోలేని మైల్‌స్టోన్ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
కాగా హారర్ థ్రిల్లర్ సినిమా మసూదలో తిరువీర్‌తో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి కిరణ్.వై దర్శకుడిగా పరిచయం అయ్యారు. స్వధర్మ ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ సినిమాతోపాటు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్న మరో హారర్ సినిమా మా ఊరి పొలిమేర 2. ఈ చిత్రానికి గాను బెస్ట్ ప్రొడ్యూసర్‌గా స్పెషల్ జ్యూరీ అవార్డును నిర్మాత గౌరీ కృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గౌరీ కృష్ణ తన మనసులోని భావాలను పంచుకున్నారు.
"బెస్ట్ ప్రొడ్యూసర్‌గా ఇంతటీ ప్రెస్టీజీయస్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా సత్యం రాజేష్ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సక్సెస్‌లో భాగమైన నటీనటులు టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్" అని మా ఊరి పొలిమేర 2 చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలిపారు.
ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి మోహన రూప మాట్లాడుతూ.. "తెలుగు జాతి కోసం పుట్టి తెలుగువారి ఆత్మగౌరవం కోసం బ్రతికిన వ్యక్తి, తెలుగు వారు దేవుడిగా భావించే నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వంగా తెలుగు వాళ్లం అని చెప్పుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ గారి వల్లే" అని అన్నారు.
"ఆయన అప్పట్లో చేసినటువంటి మల్లీశ్వరి, పాతాళ భైరవి సినిమాలతోనే ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు పోషించి అఖండ విజయం అందుకున్న సినిమా దానవీరశూరకర్ణ. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు తనదైన శైలిలో నటిస్తూ ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా నిలబడ్డారు" అని నందమూరి మోహన రూప తెలిపారు.