Director Whisky: మూవీ విడుదలయ్యాక నా అసలు పేరు, నా ఫేస్‌ను రివీల్ చేస్తా: డైరెక్టర్ విస్కీ
The Birthday Boy Director Whisky Comments: ది బర్త్‌డే బాయ్ సినిమా విడుదలయ్యాకే తన అసలు పేరు, మొహాన్ని రివీల్ చేస్తానని డైరెక్టర్ విస్కీ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ది బర్త్‌డే బాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంది మూవీ యూనిట్.
The Birthday Boy Director Comments: కంటెంట్ ఈజ్ కింగ్ అని ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిరూపించాయి. కథ, కథనాలు బాగుంటే కొత్త నటీనటుల సినిమాలు అయినా మన తెలుగు ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తారు. ఆ కోవలోనే స్ట్రాంగ్ కంటెంట్‌తో రానున్న యూనిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ 'ద బర్త్‌డే బాయ్'.
ది బర్త్‌డే బాయ్ సినిమాలో సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా పతాకంపై ఐ.భరత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల వేడుక బుధవారం (జూలై 10) హైదరాబాద్‌లో వినూత్నంగా ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి జబర్ధస్త్ ఫేం రోహిణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ "యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రాసుకున్నాను. నా జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనకు కథ రూపం ఇది. ఈ సినిమా నచ్చితే ఇద్దరికి చెప్పండి. నచ్చకపోతే పది మందికి చెప్పండి" అని చెప్పారు.
"నా అసలు పేరును. నా ఫేస్‌ను సినిమా విడుదలైన తరువాత రివీల్ చేస్తాను. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని డైరెక్టర్ విస్కీ తెలిపారు. నిర్మాత ఐ. భరత్ మాట్లాడుతూ.. "ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది" అని తెలిపారు.
"ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఐదుగురు స్నేహితులకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యవసానాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమా సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం ఉండనుంది" అని నిర్మాత ఐ భరత్ అన్నారు.
"ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించాం. ఈ సినిమాతో నాకు పర్సనల్‌గా మంచి కనెక్షన్ ఉంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ నెల 19న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అందరూ తప్పకుండా చూడండి" అని నిర్మాత భరత్ కోరారు.
నటుడు రవికృష్ణ మాట్లాడుతూ "సినిమా అంటే పిచ్చి ఉన్న టీమ్‌తో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. తప్పకుండా సినిమా అందరికి కొత్త అనుభూతిని పంచుతుంది" అని నటుడు రవికృష్ణ తెలిపారు.
ఈ చిత్రంలో తాను నటించకపోయినా, సినిమా కోసం ఈ టీమ్ కష్టాన్ని చూసి వాళ్లకు ప్రమోషన్ సహాయం చేస్తున్నానని రోహిణి తెలిపారు. ఈ సమావేశంలో ఈ చిత్రంలో నటించన నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు. మూవీలో రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.