Rajamouli On Oscar Nomination : ఆస్కార్ స్టేజీపై మన పాట.. జక్కన్న ఎమోషనల్ పోస్ట్
Naatu Naatu Song Oscar Nomination : 95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలు జాబితాను అకాడమీ ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ బరిలో ఉంది. తాజాగా నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటంపై ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి స్పందించాడు.
ఆస్కార్ నామినేషన్స్ కోసం.. అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. 95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను అకాడమీ తాజాగా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయింది. వివిధ భాషల నుంచి దాదాపు మూడు వందల చిత్రాలు షార్ట్ లిస్ట్.. అయ్యాయి. తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఉండటంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజమౌళి(Rajamouli) ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సినిమా బృందానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు జక్కన్న. సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, భైరవకు థ్యాంక్స్ చెప్పాడు. ఇలా టీమ్ లోని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపాడు. రెస్ట్ లేకుండా పని చేశారని గుర్తు చేసుకున్నాడు. 'నా సినిమాలోని పాటకు నా పెద్దన్న ఆస్కార్ నామినేషన్స్ సాధించాడు. ఇంకా నేనేం అడగను. ఇప్పుడు నాటు నాటు పాటకు తారక్, చరణ్ కంటే ఎక్కువగా నేను చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ చంద్రబోస్ గారు. ఆస్కార్ స్టేజి మీద మన పాట. థాంక్యూ' అంటూ అందరికి చెప్పుకొచ్చాడు రాజమౌళి.
నాటు నాటు సాంగ్ కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, ఇతర భాషలతోపాటుగా విదేశాల్లోనూ సత్తాచాటింది. ఈ పాటలోని రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అందరినీ ఈ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్ రాసిన సాహిత్యానికి.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫి చేశారు.
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఇప్పటికే పలు అంతర్జాతీ అవార్డులు వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.
ఆస్కార్ అవార్డు 2023 కోసం ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పలు చిత్రాలు నామినేట్ అయ్యాయి. నాటు నాటుతోపాటుగా.. టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ చిత్రంలో అప్లాజ్, అలాగే టాప్ గన్ : మావెరిక్ చిత్రంలోని హోల్డ్ మై హ్యాండ్, బ్లాక్ పాంథర్: వకండ ఫెరవర్ చిత్రంలోని లిఫ్ట్ మీ అప్, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంలోని దిస్ ఈజ్ ఏ లైఫ్ పాటలు నామినేట్ అయ్యాయి.