Freedom At Midnight Web Series: మనకు తెలియని చరిత్ర చెప్పడానికి వస్తున్న వెబ్ సిరీస్.. ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ డ్రాప్ 1
Freedom At Midnight Drop 1: మనకు తెలియని చరిత్ర చెప్పడానికంటూ ఓ సరికొత్త వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ కాగా.. ఈ సిరీస్ నుంచి డ్రాప్ 1 వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు.
Freedom At Midnight Drop 1: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది. మనకు తెలియని చరిత్ర, కచ్చితంగా తెలుసుకోవాల్సిన చరిత్ర అంటూ సోనీలివ్ ఇప్పుడు ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనే వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. తాజాగా మంగళవారం (జులై 30) ఈ సిరీస్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ తోనే వాళ్లు చెప్పబోయే చరిత్ర ఏంటన్నది అర్థమైపోతుంది.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ టీజర్
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ పేరుతో సోనీలివ్ ఓటీటీ తీసుకొస్తున్న వెబ్ సిరీస్ టీజర్ ఎంతో ఆసక్తి రేపుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీలో చివరి క్షణంలో జరిగిన మార్పు, అందులో మహాత్మా గాంధీ పాత్ర గురించి చెబుతూ ఈ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ టీజర్ సాగింది. నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ మనకు తెలియని, తెలుసుకోవాల్సిన చరిత్రను చెప్పబోతోంది.
ప్రముఖ ఓటీటీ సోనీలివ్ ఒరిజినల్ గా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. దేశానికి తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ఎలా అయ్యారో చెబుతూ ఈ టీజర్ సాగింది. వీడియో మొదట్లోనే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మౌలానా ఆజాద్ (పవన్ చోప్రా) మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ కు కాబోయే అధ్యక్షుడే దేశానికి తొలి ప్రధాని అవుతారని ఆయన అంటారు. అందరి మద్దతు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా) కే ఉందని అనడంతో మిగిలిన సభ్యులందరూ చప్పట్లతో దానికి ఆమోదం తెలుపుతారు.
నిర్ణయం మార్చిన గాంధీజీ..
అయితే అదే క్షణంలో సమావేశం జరుగుతున్న హాల్లోకి వస్తారు మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా). కాంగ్రెస్ పార్టీకి సర్దార్ అవసరం ఎంతో ఉందని అంటూనే దేశానికి మాత్రం జవహర్ (సిద్థాంత్ గుప్తా) అవసరం అని అంటారు. అదే సమయంలో నామినేషన్ ఉపసంహరించుకోవాల్సిందిగా ఓ పత్రాన్ని సర్దార్ చేతుల్లో పెడతారు. ఇలా దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కావడం వెనుక గాంధీ పాత్ర గురించి ఈ టీజర్ వివరించే ప్రయత్నం చేసింది.
టీజర్ చివర్లో దేశానికి స్వతంత్రం రావడం, అప్పటి వరకూ ఒక్కటిగా ఉన్న దేశం హిందుస్థాన్, పాకిస్థాన్ గా విడిపోవడంలాంటి ఘటనలను కూడా చూపించారు. చివరికి నెహ్రూయే తొలి ప్రధాని కాగా.. వల్లభ్ భాయ్ పటేల్ ఉప ప్రధాని, హోంమంత్రిగా ఉన్నారు.
పొలిటికల్ డ్రామా
1975లో లారీ కొలిన్స్, డొమినిక్ లాపియెర్ రాసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ బుక్ ఆధారంగా దేశ స్వాతంత్య్ర పోరాటం గురించి చెబుతూ ఈ సిరీస్ సాగనుంది. 1947లో దేశానికి స్వతంత్రం రావడం, దేశం విడిపోవడం వెనుక ఇప్పటి వరకూ చాలా మందికి తెలియని చరిత్రను ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని సోనీలివ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇది కేవలం డ్రాప్ 1 అని చెబుతున్నారు. అంటే సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు రాబోతున్నట్లు తెలుస్తోంది.