OTT Web Series: ఓటీటీలోకి వస్తున్న డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Web Series: ఓటీటీలోకి మరో డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. శేఖర్ హోమ్ పేరుతో వస్తున్న ఈ సిరీస్.. షెర్లాక్ హోమ్స్ స్టోరీస్ నుంచి స్ఫూర్తి పొంది తీసినది కావడం విశేషం.
OTT Web Series: డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు అంటే ఇష్టమా? అయితే ఈ జానర్ లో వస్తున్న వెబ్ సిరీసే శేఖర్ హోమ్. ఈ కొత్త సిరీస్ ను జియో సినిమా కొన్నాళ్ల కిందట అనౌన్స్ చేయగా.. తాజాగా సోమవారం (జులై 29) ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేసింది. కే కే మేనన్, రణ్‌వీర్ షోరే, రసికా దుగల్ నటించిన ఈ సిరీస్ షెర్లాక్ హోమ్స్ స్టోరీల ఆధారంగా తెరకెక్కించారు.
శేఖర్ హోమ్ ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీలోకి మరో సరికొత్త డిటెక్టివ్ డ్రామా రాబోతోంది. జియో సినిమా ఓటీటీలో ఆగస్ట్ 14 నుంచి శేఖర్ హోమ్ అనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సర్ ఆర్థర్ కానన్ రాసిన షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ స్టోరీల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. కొన్నాళ్ల కిందట సిరీస్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ ను శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేయగా.. కే కే మేనన్, రణ్‌వీర్ షోరే, రసికా దుగల్ నటించారు. ఈ ముగ్గురి ఇంటెన్స్ లుక్ తో కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. విలక్షణ నటుడిగా పేరుగాంచిన కే కే మేనన్ తోపాటు ఓటీటీ షోల ద్వారానే ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన రణ్‌వీర్ షోరే, రసికా దుగల్ లాంటి వాళ్లతో ఈ సిరీస్ ఆసక్తి రేపుతోంది.
"ఎన్నో పరిష్కారం దొరకని మిస్టరీలు. వాటిని పరిష్కరించగలిగేది ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే. శేఖర్ హోమ్ ఆగస్ట్ 14 నుంచి మీ జియో సినిమా ప్రీమియంలో" అనే క్యాప్షన్ తో సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ వెల్లడించారు.
ఏంటీ శేఖర్ హోమ్ సిరీస్?
శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ ఓ డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్. షెర్లాక్ హోమ్స్ కథల ఆధారంగా రూపొందడమే కాదు.. టైటిల్ కూడా దానికి దగ్గరగా పెట్టి మేకర్స్ ఆసక్తి రేపుతున్నారు. ఈ సిరీస్ లో కే కే మేనన్ ఈ శేఖర్ హోమ్ అనే డిటెక్టివ్ పాత్రను పోషించబోతున్నాడు. అయితే మిగిలిన రెండు ముఖ్య పాత్రలు రణ్‌వీర్, రసికాతోపాటు కృతి కుల్హరి పాత్రల గురించి మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
1990ల నేపథ్యంలో సాగే ఈ కథ వెస్ట్ బెంగాల్లోని లోన్పూర్ అనే టౌన్ లో జరిగినట్లుగా ఈ సిరీస్ లో చిత్రీకరించారు. అక్కడ ఉండే శేఖర్ మరో వ్యక్తి జైవ్రత్ సాహ్నితో కలిసి తూర్పు భారతంలోని మిస్టరీలను పరిష్కరిస్తుంటారని జియో సినిమా ఈ సిరీస్ కథ గురించి వెల్లడించింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు డిటెక్టివ్ పాత్రను జోడించి వస్తున్న ఈ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది.