Salaar OTT Release Date: సలార్ ఓటీటీ రిలీజ్‌పై కీలకమైన అప్‌డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఎప్పుడు వస్తోందంటే?
Salaar OTT Release Date: ప్రభాస్‌కు చాలా రోజుల తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన సలార్ మూవీ ఓటీటీ రిలీజ్ పై నెట్‌ఫ్లిక్స్ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 22న ఈ మూవీ థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Salaar OTT Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ అతనికి ఆరేళ్ల తర్వాత ఓ పెద్ద హిట్ అందించింది. మధ్యలో వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సలార్ మూవీ రిలీజై 24 రోజులు కాగా.. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే సోమవారం (జనవరి 15) సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చింది.
నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న సినిమాలు ఇవే
"ఖాన్సార్ ప్రజలు తమ సంబరాలను మొదలుపెట్టొచ్చు. వాళ్ల సలార్ తిరిగి రాజ్యానికి వచ్చాడు. సలార్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ అప్‌డేట్ ను తీసుకొచ్చింది. ఒక్క సలారే కాదు.. తమ ప్లాట్‌ఫామ్ పై రాబోయే సినిమాలన్నింటి గురించి సోమవారం నెట్‌ఫ్లిక్స్ లో అప్డేట్స్ ఇవ్వడం విశేషం.
దేవర, టిల్లూ స్క్వేర్, కార్తికేయ12లాంటి సినిమాలు కూడా తమ ప్లాట్‌ఫామ్ పైనే రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అయితే ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కూడా కాలేదు. కాకపోతే వీటి డిజిటల్ హక్కులు తమ దగ్గరే ఉన్నట్లు ఈ అప్డేట్స్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ చెప్పింది. ఇక సలార్ విషయానికి వస్తే ఈ సినిమా రిపబ్లిక్ డే సమయానికి ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సలార్ ఓటీటీ హక్కులు
సలార్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజైన విషయం తెలిసిందే. దీంతో ఐదు భాషల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. వీటికోసం ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏకంగా రూ.162 కోట్లు చెల్లించడం గమనార్హం. రూ.270 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కగా.. బాక్సాఫీస్ కలెక్షన్ల రూపంలోనే భారీ లాభాలు వచ్చాయి. ఇక రిలీజ్ కు ముందే ఈ భారీ ఓటీటీ డీల్ తో మేకర్స్ పై కాసులు వర్షం కురిసింది.
సలార్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. ఈ సినిమాను వచ్చే ఏడాదే కచ్చితంగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం అనే టైటిల్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో షూటింగ్ ఏ సమయంలో అయినా ప్రారంభం కావచ్చని, 2025లో రిలీజ్ చేయడానికి ప్లాస్ చేస్తున్నట్లు నిర్మాత విజయ్ కిరగండూర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
ఇక సలార్ పార్ట్ 2 పాపులర్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో ఉండబోతోందని కూడా చెప్పాడు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు. ఈ మధ్యే కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా.. సంక్రాంతి సందర్భంగా మారుతి మూవీ టైటిల్ ను రాజాసాబ్ గా నిర్ణయించారు.