Rangasthalam vs KGF: “రాకీ భాయ్‍పై చిట్టిబాబుదే పైచేయి..! జపాన్‍లో రంగస్థలం హవా-rangasthalam got more advanced bookings than kgf in japan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rangasthalam Vs Kgf: “రాకీ భాయ్‍పై చిట్టిబాబుదే పైచేయి..! జపాన్‍లో రంగస్థలం హవా

Rangasthalam vs KGF: “రాకీ భాయ్‍పై చిట్టిబాబుదే పైచేయి..! జపాన్‍లో రంగస్థలం హవా

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 14, 2023 06:30 PM IST

Rangasthalam vs KGF: జపాన్‍లో కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, రంగస్థలం సినిమాలు నేడు (జూలై 14) విడుదలయ్యాయి. జపనీస్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.

రంగస్థలం, కేజీఎఫ్
రంగస్థలం, కేజీఎఫ్

Rangasthalam vs KGF: జపాన్‍లో భారతీయ సినిమాలు క్రమంగా దుమ్మురేపుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా జపనీస్ మార్కెట్‍లో అదరగొట్టింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ జపాన్ వెర్షన్‍లో రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. జపనీస్ మార్కెట్‍లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. కాగా, ఇప్పుడు జపాన్‍లో నేడు (జూలై 14) కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు ఒకేసారి జపనీస్‍ వెర్షన్‍లో విడుదలయ్యాయి. అయితే, రామ్‍చరణ్ తేజ్ నటించిన రంగస్థలం సినిమా కూడా ఇదే రోజు అక్కడి థియేటర్లలో జపనీస్ భాషలో వచ్చింది. ఈ తరుణంలో కలెక్షన్‍లపై అందరి దృష్టి పడింది.

జపాన్‍లో కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 కంటే రంగస్థలం మూవీకే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్‍లు జరిగాయని తెలుస్తోంది. దీంతో జపాన్‍లో తొలి రోజు రంగస్థలం ఎక్కువ కలెక్షన్‍లను సాధించే అవకాశం కనిపిస్తోంది. రాకీ భాయ్‍తో పోలిస్తే చిట్టిబాబుకు ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ స్పష్టంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్‍చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారాడు. దీంతో రంగస్థలం జపాన్ మార్కెట్‍లోనూ దుమ్మురేపే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‍లోనూ అద్భుతంగా ఆడటంతో చరణ్‍కు అక్కడ ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా 2018 మార్చి 30న విడుదలై కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది. చిట్టిబాబుగా ఈ సినిమాలో రామ్‍చరణ్ నటన ప్రశంసలు దక్కించుకుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ మాస్ యాక్షన్ డ్రామాను సుకుమార్ ఓ దృశ్యక్యావ్యంగా మలిచాడు. దీంతో రంగస్థలం సినిమా టాలీవుడ్‍లో రికార్డులను బద్దలుకొట్టింది. అప్పట్లోనే ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్‍లను రాబట్టి సంచలనం సృష్టించింది. మరి, ఇప్పుడు జపాన్ మార్కెట్‍లో ఎంత కలెక్షన్‍లను రాబడుతుందో చూడాలి. రంగస్థలంలోని ఎమోషన్ జపనీయులకు నచ్చితే ఈ సినిమా పంట పండుతుందని బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, 2018లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1తో యశ్.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. రాకీ భాయ్‍గా ఫేమస్ అయ్యాడు. ఈ మూవీ దేశమంతా తెగ ఆడేసింది. ఈ క్రేజ్‍తోనే 2022లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 పాన్ ఇండియా రేంజ్‍లో కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.1,200కోట్లకు పైగా వసూళ్లతో సునామీ సృష్టించింది. కలెక్షన్‍ల విషయంలో ఆర్ఆర్ఆర్‌తో పోటీ పడింది. ఇప్పుడు జపాన్ మార్కెట్‍లో కేజీఎఫ్ సినిమాలు, రంగస్థలం తలపడుతున్నాయి.

Whats_app_banner