RC17 Opening Sequence: రామ్ చరణ్, సుకుమార్ మూవీ స్టోరీ లీక్ చేసిన రాజమౌళి తనయుడు!
RC17 Opening Sequence: రామ్ చరణ్, సుకుమార్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు రాజమౌళి తనయుడు కార్తికేయ. రంగస్థలం కాంబో రిపీట్ అవుతున్న వేళ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోతున్నాయి.
RC17 Opening Sequence: రామ్ చరణ్ 15వ సినిమా గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి ఇంకా ఏమీ తెలియడం లేదు. ఈ మధ్యే ఆర్సీ16 షూటింగ్ కూడా మొదలైంది. ఇక సోమవారం (మార్చి 25) హోలీ సందర్భంగా ఆర్సీ17 కూడా అనౌన్స్ చేసేశారు. ఈసారి సుకుమార్ తో రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా గురించి రాజమౌళి తనయుడు కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.
ఆర్సీ17 ఓపెనింగ్ సీక్వెన్స్ ఇదీ..
రామ్ చరణ్, సుకుమార్ కాంబో ఆరేళ్ల కిందట రంగస్థలం మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేసిందో మనకు తెలుసు. చరణ్ కెరీర్లోని అతి పెద్ద హిట్స్ లో అదీ ఒకటి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ చేతులు కలపబోతున్నారంటేనే అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీ గురించి తనకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలోనే తెలుసని రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పడం విశేషం.
ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ వచ్చిన కాసేపటికి అతడు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా గురించి ఎక్కువ లీక్ చేయనంటూనే కార్తికేయ చెప్పిన విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ ట్వీట్ లో అతడు ఏమన్నాడంటే..
"ఆర్ఆర్ఆర్ క్లైమ్యాక్స్ షూటింగ్ సమయంలో అనుకుంటాను.. సుకుమార్ గారితో మూవీ చేయబోతున్నట్లు అతడు (రామ్ చరణ్) మాటల సందర్భంగా చెప్పాడు. అంతేకాదు మూవీలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి వివరించాడు. ఐదు నిమిషాల పాటు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది.
అతడు ఆ విషయం చెప్పినప్పటి నుంచీ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గురించి ఎదురు చూస్తున్నాను. ఆ మూవీ ఓ బ్లాక్‌బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక అది ఓ ఐకానిక్ సీక్వెన్స్ అవుతుంది. నేను దీని గురించి మరీ ఎక్కువగా లీక్ చేయనులే" అంటూ రామ్ చరణ్ ను కార్తికేయ ట్యాగ్ చేశాడు.
ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ రాగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు కార్తికేయ ట్వీట్ తో అవి కాస్తా రెట్టింపయ్యాయి. రంగస్థలం మూవీ చరణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడతనితో మరెలాంటి మ్యాజిక్ సుకుమార్ చేస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
చరణ్, సుకుమార్ మూవీ ఎప్పుడు?
2018లో రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఆ మూవీలో చిట్టిబాబు అనే చెవిటి పాత్రలో చరణ్ అదరగొట్టాడు. అలాంటి కాంబో రిపీట్ అవుతుంటే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది తెలియడం లేదు. ప్రస్తుతం చరణ్ కూడా గేమ్ ఛేంజర్, ఆర్సీ16 సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఈ రెండు షూటింగ్ లు పూర్తయిన తర్వాతే అతడు ఆర్సీ17 మొదలు పెట్టనున్నాడు. అటు పుష్ప 2 ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అంత వరకూ సుకుమార్ కూడా బిజీయే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదే ఈ ఇద్దరి సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.