Pushpa 2 Box Office Collection Day 12: ఇదీ పుష్ప గాడి రూల్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 రికార్డులు బ్రేక్.. టార్గెట్ బాహుబలి 2
Pushpa 2 Box Office Collection Day 12: పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా 12 రోజుల్లోనే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయగా.. ఇప్పుడు బాహుబలి 2 రికార్డుపై కన్నేసింది.
Pushpa 2 Box Office Collection Day 12: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడు అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. 12 రోజుల్లోనే రూ.1500 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువైన ఈ మూవీ.. దంగల్ (రూ.2070 కోట్లు), బాహుబలి 2 (రూ.1790 కోట్లు) తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 రికార్డులు బ్రేకయ్యాయి.
పుష్ప 2 బాక్సాఫీస్ కలెక్షన్లు
ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk.com ప్రకారం ఇప్పుడు పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో మూడో స్థానంలో ఉంది. 11 రోజుల్లో రూ.1409 కోట్ల గ్రాస్ సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇక 12వ రోజు ఈ సినిమా రూ.27.75 కోట్లు వసూలు చేసింది. 12 రోజుల్లో పుష్ప 2 మూవీ ఇండియా నెట్ కలెక్షన్లే రూ.929.85 కోట్లకు చేరడం విశేషం. రెండో సోమవారం (డిసెంబర్ 16) కూడా తెలుగు రాష్ట్రాల్లో 24 శాతం, హిందీలో 21 శాతం ఆక్యుపెన్సీ నమోదవడం మామూలు విషయం కాదు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లలో ఆర్ఆర్ఆర్ (రూ.1230 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ.1215 కోట్లు) రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేసింది. ఇప్పుడు బాహుబలి 2 రికార్డును కూడా పుష్ప 2 బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పట్లో ఈ సినిమాకు గట్టి పోటీ ఇచ్చిన మూవీస్ ఏవీ ఇటు తెలుగులోగానీ, అటు హిందీలోగానీ కనిపించడం లేదు.
ఇక ఇండియాలో గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే బాహుబలి 2 మూవీ రూ.1417 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. కేజీఎఫ్ 2 రూ.1000 కోట్ల గ్రాస్ తో రెండో స్థానంలో ఉంది. ఈ రికార్డులను కూడా పుష్ప 2 త్వరలోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది. సోమవారం (డిసెంబర్ 16) పుష్ప 2కి తెలుగులో రూ.5.45 కోట్లు, హిందీలో రూ.21 కోట్లు, తమిళంలో రూ.కోటి, కన్నడ, మలయాళంలలో చెరో రూ.15 లక్షలు వచ్చాయి.
హిందీలో రికార్డుల పరంపర
పుష్ప2 మూవీ తెలుగు కంటే హిందీలో ఎక్కువగా రికార్డులను బ్రేక్ చేస్తోంది. అత్యంత వేగంగా రూ.500 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన హిందీ మూవీగా నిలిచింది. 11వ రోజే అల్లు అర్జున్ మూవీ ఈ రికార్డును అందుకుంది. ఇంతకుముందు 18 రోజులతో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ పేరిట ఈ రికార్డు ఉండేది.
ఇండియాలో 12 రోజుల్లో పుష్ప 2 హిందీ వెర్షన్ రూ.573.1 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కేవలం జవాన్ (రూ.582 కోట్లు), స్త్రీ 2 (రూ.598 కోట్లు) మాత్రమే పుష్ప 2 కంటే ముందున్నాయి. ఆ రికార్డులు కూడా ఈ మూడో వీకెండ్ కల్లా మరుగునపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఓ తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ త్వరలోనే ఇండియా బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా నిలవబోతుండటం విశేషం.