Paruvu Web Series Review: పరువు రివ్యూ - సుస్మిత కొణిదెల మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
Paruvu Web Series Review: చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించిన పరువు వెబ్‌సిరీస్ శుక్రవారం జీ5 ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్‌లో నివేతా పేతురాజ్, నరేష్ అగస్త్య కీలక పాత్రలో పోషించారు.
ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, నాగబాబు, ప్రణీత పట్నాయక్ కీలక పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. పరువు వెబ్‌సిరీస్ ఎలా ఉంది? ఈ సిరీస్‌తో నివేతా పేతురాజ్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా లేదా? అంటే
పల్లవి, సుధీర్ ప్రేమకథ...
పల్లవి (నివేతా పేతురాజ్) పెద్దలను ఎదురించి సుధీర్‌ను (నరేష్ అగస్త్య) ప్రేమవివాహం చేసుకుంటుంది. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందనే కోపంతో పల్లవిని ఆమె తల్లిదండ్రులతో పాటు బంధువులు దూరం పెడతారు. పెదనాన్న చనిపోవడంతో కడసారి అతడిని చూసేందుకు భర్తతో కలిసి పల్లవి సొంత ఊరు బయలుదేరుతుంది. పల్లవి బావ చందు ఇష్టం లేకపోయినా ఇద్దరికి తన కారులో లిఫ్ట్ ఇస్తాడు. జర్నీలో పల్లవి, సుధీర్ గురించి చందు చులకనగా మాట్లాడుతాడు. దాంతో పల్లవి అతడితో గొడవపడుతుంది.
అదే రాత్రి చందు ఓ గన్ కొనడం పల్లవి చూస్తుంది. తమను చంపడానికే చందు గన్ కొంటున్నాడని భ్రమపడుతుంది. పల్లవి మాటలు నిజమని నమ్మిన సుధీర్ ఆవేశంలో చందును చంపేస్తాడు. ఆ శవాన్ని ఎవరికి తెలియకుండా మాయం చేయాలని ఇద్దరు ఫిక్సవుతారు. మరోవైపు చందు జాడ కోసం అతడి ప్రియురాలు స్వాతి (ప్రణీత పట్నాయక్) వెతుకుంటుంది. లోకల్ ఎమ్మెల్యే రామయ్య.(నాగబాబు)..చందును కిడ్నాప్ చేశాడని భ్రమపడుతుంది. ఆ తర్వాత ఏమైంది? చందు డెడ్‌బాడీని సుధీర్, పల్లవి ఎవరి కంట పడకుండా ఎక్కడ దాచిపెట్టారు?
పెదనాన్నను చూడటానికి వెళ్లిన పల్లవికి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి. ఓ పరువు హత్యకు చందుకు ఉన్న సంబంధం ఏమిటి? రామయ్యపై రివేంజ్ తీర్చుకోవడానికి స్వాతి ఏం చేసింది? చందు నిజంగానే పల్లవి, సుధీర్‌లను చంపడానికే గన్ కొన్నాడా? ఈ కథలో ఏఎస్ఐ చక్రవర్తి (రాజ్‌కుమార్ కసిరెడ్డి) పాత్ర ఏమిటి? అన్నదే పరువు వెబ్‌సిరీస్ కథ.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్...
పరువు హత్యలు అన్నది చాలా సెన్సిటివ్ పాయింట్. ఈ కాన్సెప్ట్‌తో గతంలో తెలుగు తెరపై కొన్ని సినిమాలొచ్చాయి. కానీ సిరీస్‌లు అంతగా రాలేదు. పరువు వెబ్‌సిరీస్‌తో ఫస్ట్ టైమ్ ఈ కాన్సెప్ట్‌ను టచ్ చేశారు దర్శకద్వయం సిద్ధార్థ్‌నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి. ఓ పరువు హత్య చుట్టూ జరిగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
కుల వివక్ష...
అనుకోకుండా ఓ మర్డర్ చేసి ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే ఓ జంట కథ ఇది. ఈ థ్రిల్లర్ కథలో పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలకు సొసైటీలో ఎదురయ్యే అవమానాలు, కుల వివక్ష లాంటి అంశాలను అంతర్లీనంగా టచ్ చేశారు డైరెక్టర్స్.
అభిమాన హీరో గురించి చందు క్యారెక్టర్ చెప్పే సింపుల్ డైలాగ్‌తో సమాజంలోని కుల వివక్షను అర్థవంతంగా చూపించారు డైరెక్టర్స్. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని కొందరు నాయకులు చేసే కుట్రలను ఇంటెన్స్‌గా సిరీస్‌లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. . మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌ను ఆరంభం నుంచి చివరి వరకు గ్రిప్పింగ్‌గా సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగబోతుందో అనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కలిగించడంలో డైరెక్టర్స్ చాలా వరకు సక్సెస్ అయ్యారు.
కొత్త పాత్రలు ఎంట్రీ...
పెద్దలకు చెప్పకుండా ఓ ప్రేమ జంట ఇంట్లో నుంచి పారిపోయే సీన్‌తో సిరీస్ ఆసక్తిగా ప్రారంభమవతుంది. ఆ తర్వాత చందుతో కలిసి పల్లవి, సుధీర్ కారులో జర్నీ చేసే సీన్స్, పల్లవి, చందు మధ్య గొడవతోనే వారి కథ ఏమిటన్నది బయటపెట్టడం ఆకట్టుకుంటుంది.
చందును సుధీర్ చంపడంతోనే అసలు కథ మొదలవుతుంది. ఆ డెడ్‌బాడీని మాయం చేసేందుకు సుధీర్, పల్లవి చేసే ప్రయత్నాలు, చందు గురించి స్వాతి సాగించిన అన్వేషణ నేపథ్యంలో కొత్త పాత్రలు స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వడం, వాటిని చందు మిస్సింగ్‌కు లింక్ చేస్తూ స్క్రీన్‌ప్లేను ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నారు. పరువు హత్యతో అన్ని క్యారెక్టర్స్‌ను ముడిపెట్టిన తీరు మెప్పిస్తుంది.
క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్...
ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ నాయకుడు ప్రేమ జంటకు అన్యాయం చేసి ప్రజల పాలిట ఎలా విలన్‌గా ఎలా మారాడన్నది కన్వీన్సింగ్‌గా సిరీస్‌లో ప్రజెంట్ చేశారు. పల్లవి, సుధీర్ లను కలిపి రొటీన్‌గా క్లైమాక్స్‌ను ఎండ్ చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ చివరలో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ తో సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు.
ఎగ్జైటింగ్ మిస్...
పరువు కాన్సెప్ట్ బాగున్నా పాయింట్ మాత్రం కొత్తది కాదు.ఈ కాన్సెప్ట్‌తో సిరీస్‌లు ఎక్కువగా రాకపోయినా సినిమాలు మాత్రం చాలానే వచ్చాయి. చందు డెబ్‌బాడీని మాయం చేసేందుకు సుధీర్ వేసే ఎత్తుల్లో ఆసక్తి లోపించింది. ఒక్క ప్లాన్ కూడా ఎగ్జైటింగ్‌గా అనిపించదు. ఫ్యామిలీ డ్రామాలో సరిగా ఎమోషన్స్ పండలేదు.
ఎమోషనల్ రోల్‌లో...
పల్లవి గా నివేతా పేతురాజ్ నటన ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలిచింది. పెద్దలను ఎదురించిప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిగా ఎమోషనల్ రోల్‌లో మెప్పించింది. నరేష్ అగస్త్య నాచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సిరీస్ ఆసాంతం సెటిల్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడు. నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో నాగబాబు, పోలీస్ ఆఫీసర్‌గా రాజ్‌కుమార్ కసిరెడ్డిల నటన బాగుంది. స్వాతిగా ప్రణీత పట్నాయక్ క్యారెక్టర్‌కు పరిచయం చేసిన తీరు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా.... ఆ తర్వాత డైలాగ్స్‌కే పరిమితం చేసి రొటీన్‌గా ఎండ్ చేశారు.
థ్రిల్లర్ జానర్ ఫ్యాన్స్‌కు...
పరువు కథ, కథనాల్లో కొత్తదనం లేకపోయినా యాక్టింగ్ పరంగా ఈ సిరీస్ మెప్పిస్తుంది. కొన్ని ట్విస్ట్‌లు, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. థ్రిల్లర్ జానర్ లవర్స్‌ను ఈ సిరీస్ కొంత వరకు మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5