OTT Murder Mystery Web Series: తెలుగులో రాబోతున్న మరాఠీ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Murder Mystery Web Series: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. ఓ నిజ జీవిత క్రైమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ టీజర్ తాజాగా రిలీజైంది. ఏడు హత్యల చుట్టూ తిరిగే ఈ థ్రిల్లింగ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది.
OTT Murder Mystery Web Series: ఓటీటీలోకి ఓ నిజ జీవిత క్రైమ్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ వస్తోంది. మరాఠీలో తెరకెక్కిన ఈ సిరీస్ పేరు మన్వత్ మర్డర్స్. 1972లో మహారాష్ట్రలో జరిగిన ఏడు హత్యలు, వాటి మిస్టరీని ఎలా ఛేదించారన్న కథతో ఈ సిరీస్ ను రూపొందించారు. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 3) రాత్రి ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు.
మన్వత్ మర్డర్స్ వెబ్ సిరీస్
మన్వత్ మర్డర్స్ ఓ మరాఠీ వెబ్ సిరీస్. 1972లో మహారాష్ట్రలోని మన్వత్ లో జరిగిన హత్యల ఆధారంగా ఈ సిరీస్ తీశారు. ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 4 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సిరీస్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
"ఏడు హత్యలు.. ఏడాదిన్నర పాటు ఎవరూ పరిష్కరించలేకపోయారు.. ముంబైకి చెందిన పోలీస్ అధికారి రమాకాంత్ కులకర్ణి అయినా న్యాయం చేయగలడా? మహారాష్ట్రను 1970ల్లో వణికించిన దారుణమైన క్రైమ్ ఆధారంగా తెరకెక్కిన మన్వత్ మర్డర్స్ అక్టోబర్ 4 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో సోనీలివ్ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.
టీజర్‌తోనే భారీ అంచనాలు
మన్వత్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ టీజర్ తోనే అంచనాలు పెంచేసింది. టీజర్ ప్రారంభంలోనే ఓ ఊళ్లో మర్రి చెట్టు కింద క్షుద్రపూజలు జరుగుతున్నట్లుగా చూపించారు. ఎవరో ఆడపిల్లలను ఎత్తుకెళ్లి చంపేస్తుంటారు. మొత్తంగా నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు ఆడవాళ్లు హత్యకు గురవుతారు.
ఈ హత్యలు స్థానిక పోలీసులకు అంతుబట్టకపోవడంతో ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి ఆ ఊళ్లోకి వస్తాడు. ఏడాదిన్నర వ్యవధిలో ఏడు హత్యలు జరిగినా ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు అని అతడు అనడం టీజర్లో వినొచ్చు. హంతకులను పట్టుకోవడానికి ఆ పోలీస్ అధికారి చేసే ఇన్వెస్టిగేషన్, ఒక్కొక్కటిగా బయటపడే నిజాలు టీజర్లో చూపించారు.
మన్వత్ మర్డర్స్ గురించి..
మన్వత్ మర్డర్స్ సిరీస్ ను ఆశిష్ బెండె డైరెక్ట్ చేశాడు. పోలీస్ అధికారి రమాకాంత్ కులకర్ణి ఆటోబయోగ్రఫీ ఫుట్‌ప్రింట్స్ ఆన్ ద సాండ్ ఆఫ్ క్రైమ్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో అశుతోష్ గోవారికర్, మకరంద్ అనస్పురే, సొనాలి కులకర్ణి, సాయి తమ్‌హంకర్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
సీఐడీకి చెందిన డిటెక్టివ్ ఆఫీస్, షెర్లాక్ హోమ్స్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన అధికారి రమాకాంత్ కులకర్ణి. అలాంటి అధికారి మహారాష్ట్రలోని ఓ కుగ్రామంలో జరిగిన ఆ హత్యలను ఎలా పరిష్కరించాడన్నదే ఈ మన్వత్ మర్డర్స వెబ్ సిరీస్.