NNS February 7th Episode: అడ్డంగా బుక్కైన కాళీ, మనోహరి! చీర కొనిచ్చిన అమర్.. నిజం చెప్పిన మిస్సమ్మ
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 7వ తేది ఎపిసోడ్‌లో అమర్, మనోహరి వెళ్లిన షాపింగ్ మాల్‌కే కాళీ, మిస్సమ్మ వెళ్తారు. అక్కడ మిస్సమ్మకు చూడకుండా అమర్ డ్యాష్ ఇస్తాడు. అప్పుడు మిస్సమ్మ నిజం చెప్పేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam 7th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 7th February Episode) తండ్రి కోరిక తీరుస్తున్నానే ఆలోచనతో మంగళ మాట కాదనకుండా కన్నీరు పెట్టుకుంటూ కాళీతో షాపింగ్‌కి బయలుదేరుతుంది మిస్సమ్మ. రాథోడ్‌ని అమర్ పిలిచి కార్ కీస్ ఇవ్వు, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి మనోహరిని తనతో పాటు బయటికి తీసుకువెళ్తాడు. ఎక్కడికి అని మనోహరి అడిగితే సమాధానం చెప్పడు.
గాలిలో తేలిపోయిన మనోహరి
మనోహరిని ఈయన ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అనుకుంటుంది అరుంధతి. కారులో వెళ్తున్న మనోహరి ఆనందంతో గాలిలో తేలిపోతూ ఉంటుంది. ఫస్ట్ టైం మనిద్దరమే కలిసి బయటికి వెళ్తున్నాము. ఎప్పటికైనా కలిసి వెళ్లేది మనిద్దరమే. ఆగిపోయిన నీ జీవితం నాతోనే ప్రారంభం అవ్వాలి అని మనసులో అనుకుంటూ సంతోష పడిపోతుంది మనోహరి. ఇంతలో రాంగ్ రూట్‌లో వస్తున్న కాళీ అమర్ కారుని ఢీ కొంటాడు.
రాంగ్ రూట్‌లో నీ ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తున్నావు. నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగేది అంటాడు అమర్. నా బండి నా ఇష్టం అయినా పని మీద పోతున్నాను కాబట్టి ఇలా రాంగ్ రూట్‌లో వస్తున్నాం అంటాడు కాళీ. అమర్ మిస్సమ్మ మళ్లీ కలవకూడదు అనుకున్న మనోహరి వాళ్లిద్దరూ ఎదురు పడటంతో కంగారుపడుతుంది. అలాంటి వాళ్లతో మనకి మాటలు ఏంటి మనమే తప్పించుకుని వెళ్లిపోవాలి అని అమర్‌తో చెప్తుంది మనోహరి. రాంగ్ రూట్‌లో రావడం తప్పే సారీ అని చెప్తుంది మిస్సమ్మ.
మనోహరికి చీర
ప్రతిసారి తప్పు చేయటం తర్వాత సారీ చెప్పటం అలవాటైపోయింది అంటాడు అమర్. తను నా కాబోయే భార్య. తనని ఏమైనా అంటే ఊరుకోను అంటాడు కాళీ. తనని పెళ్లి చేసుకుంటావో, పల్లకిలో ఊరేగిస్తావో నాకు అనవసరం కానీ మళ్లీ ఇలా రాంగ్ రూట్‌లో కనిపిస్తే ఊరుకోను అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అమర్. మనోహరిని అమర్ ఒక షాపింగ్ మాల్‌కి తీసుకెళ్లి చీర సెలెక్ట్ చేసుకోమంటాడు. ఇది నిజమేనా నువ్వు ఎందుకు చీర కొంటున్నావు అని ఆనంద పడిపోతూ అడుగుతుంది మనోహరి.
ఇది నా బాధ్యత వెళ్లి చీర సెలెక్ట్ చేసుకో అని అమర్ అనటంతో మరింత ఆనంద పడిపోతుంది మనోహరి. ఇప్పుడు ఎందుకు చీర కొంటున్నావు అని మళ్లీ అడుగుతుంది మనోహరి. రేపు నీకు పెళ్లిచూపులు అందుకే నీకు నచ్చిన చీర కొనుక్కో అంటాడు అమర్. నాకోసం చీర కొంటున్నావంటే బంధం దగ్గర అవటానికి అనుకున్నాను. కానీ శాశ్వతంగా బంధాన్ని దూరం చేయడానికా అని మనసులో అనుకుంటుంది మనోహరి. అదే సమయానికి అదే షాప్‌కి వస్తారు మిస్సమ్మ, కాళీ. మళ్లీ ఇద్దరూ ఎదురు పడటంతో కళ్లతోనే కాళీని మందలిస్తుంది మనోహరి.
అతుక్కుపోతారు
కోపంగా ఎందుకు మా వెంట పడుతున్నారు. మళ్లీ మాయ మాటలు చెప్పి అమర్‌ని మాయ చేయడానికా అని అంటుంది మనోహరి. ఒకసారి నమ్మి మోసపోయాను.. మళ్లీ అలాంటి పొరపాటు చేయను అంటాడు అమర్. తర్వాత మిస్సమ్మని వేరే కౌంటర్‌కి తీసుకుని వెళ్లి నువ్వు చీర సెలెక్ట్ చేస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్తాడు కాళీ. అమర్ పక్కకు వెళ్లడంతో మనోహరి కూడా కాళీ దగ్గరికి వెళ్లి వాళ్లిద్దరూ ఎదురెదురు పడితే ఇనుము అయస్కాంతం లాగా అతుక్కుపోతారు. అప్పుడు మనిద్దరం చిప్పకూడు తినాలి. మర్యాదగా షాపింగ్ పూర్తి చేసుకుని త్వరగా వెళ్లిపో అని హెచ్చరిస్తుంది.
వాళ్లిద్దరూ వెనక్కి తిరిగే సరికి అక్కడ అమర్ ఉంటాడు. ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. నా దగ్గర ఏం దాచాలని ప్రయత్నిస్తున్నావు మనోహరి. మిస్సమ్మలాగా నువ్వు కూడా ఏమైనా దాస్తున్నావా అని నిలదీస్తాడు అమర్. అవును, తను నీ కంటపడిన ప్రతిసారి నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు అర్థమవుతుంది. అందుకే తనని ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపో అని అతనితో మాట్లాడుతున్నాను. అదే నీ దగ్గర దాచాను అని అబద్ధం చెప్తుంది మనోహరి.
నిజం చెప్పిన మిస్సమ్మ
ఇలాంటి వాళ్లతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది త్వరగా వచ్చేయ్ అని అమర్ అక్కడ నుంచి వెళ్లిపోతూ ఎదురుగా వస్తున్న మిస్సమ్మని చూసుకోకుండా డాష్ ఇస్తాడు. మిస్సమ్మని చూసి అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లనివ్వను ముందు నేను చెప్పేది వినండి అంటుంది మిస్సమ్మ. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను అంటాడు అమర్. నా ఆత్మ సంతృప్తి కోసం నేను చెప్పాలనుకున్నది చెప్తాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని చెప్పి తను తన తండ్రి కోసమే ఇదంతా చేశాను అని మొత్తం జరిగిందంతా చెప్తుంది మిస్సమ్మ.
మరి అమర్ మిస్సమ్మ చెప్పింది నమ్ముతాడా? మనోహరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 8న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!